ప్రేమని పంచాలి కానీ.. ద్వేషాన్ని కాదు !

‘‘ప్రస్తుతం మనందరం కరోనా అనే ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ప్రేమని పంచాలి.. కానీ ద్వేషాన్ని కాదు’’ aఅంటున్నారు తమన్నా. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెగటివిటీ ఎక్కువ అవుతోందని, అందరూ పాజిటివ్‌ గా ఆలోచించాలని తమన్నా పేర్కొన్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘మనమెప్పుడూ చూడని ఓ విపత్తు ఇప్పుడు మన ముందు ఉంది. ఇలాంటి సమయంలో మనందరం పాజిటివ్‌ గానే ఉండాలి. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చాలా అంటే చాలా ద్వేషం కనిపిస్తోంది. అది చాలా మందిని ఇబ్బందికి గురిచేసేలా ఉంది. మరీ ముఖ్యంగా ట్రోలింగ్‌ ఎక్కువైంది. కానీ ఇలాంటి సమయంలో కావాల్సింది ద్వేషం కాదు.. ప్రేమ. ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. సోషల్‌ మీడియా అనేది ఒకరికొకరం కనెక్ట్‌ అవ్వడానికి. దాన్ని సరిగ్గా వినియోగించుకుందాం. ఒకప్పుడు సోషల్‌ మీడియాలో ‘మంచి’ కనిపించేది. మళ్లీ ఇంతకు ముందులాగానే సోషల్‌ మీడియాలోనూ పాజిటివిటీనే పంచుదాం’’ అన్నారు.
 
మెగాస్టార్‌ ‘ఆచార్య’లో అతిథిగా..
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా కాజల్‌‌ అగర్వాల్‌ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమన్నాకు వీడియో కాల్‌ ద్వారా దర్శకుడు పాత్రను వివరించగా వెంటనే మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే చిరు ‘సైరా నర్సింహారెడ్డి’లో తమన్నా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇందులో ఆమె పాత్రకు మంచి స్పందన కూడా వచ్చింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ‘ఆచార్య’ షూటింగ్‌ త్వరలో తిరిగి ప్రారంభంకానుంది.
 
సత్యదేవ్ తో ‘లవ్‌ మాక్‌టైల్‌’
కన్నడలో ఘనవిజయం సాధించిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇందులో సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్నారు. నాగ శేఖర్‌ మూవీస్‌ బ్యానర్‌పై నాగశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. భావనా రవి, నాగశేఖర్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ రీమేక్‌కి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ని సెప్టెంబర్‌లో ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయబోతున్నారు’’ అన్నారు.