‘మంచి పాట’ అనిపిస్తే ఎప్పుడూ వెనుకాడను !

తమన్నా… ‘ఐటెంసాంగ్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తోంది’ అని కొందరు అనుకుంటున్నారు. నిజం ఏమిటంటే…నాకు గుర్తింపు తెచ్చి పెట్టింది నా డాన్సే! మామూలుగా హీరోయిన్‌గా చేసే సమయంలో నా డాన్స్‌ టాలెంట్‌ చూపించే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే ఐటెంసాంగ్‌, లేదా స్పెషల్‌ సాంగ్ప్‌లో అయితే నా డాన్స్‌ టాలెంట్‌ పూర్తిగా చూపించవచ్చు. అందుకే అవి చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. అలా అని పూర్తిగా వాటికే పరిమితం కాను. మంచి పాట అనిపిస్తే చేయడానికి ఎప్పుడూ వెనుకాడను.
 
‘బుర్రకథ’ కోసం స్పెషల్‌ సాంగ్‌..!
ప్రత్యేక పాటలకి తమన్నా ఇప్పుడో బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వర్‌’, ‘జై లవకుశ’, ‘కే జీ ఎఫ్‌’ వంటి తదితర చిత్రాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లో తనదైన స్టెప్పులతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్‌ చేసింది. ఈ నేపథ్యంలో తమ ‘బుర్రకథ’ చిత్రంలో తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ని చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.
ఆది సాయికుమార్‌, నైరా షా, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ‘బుర్రకథ’ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. స్పెషల్‌ సాంగ్స్‌లో తమన్నాకి ఉన్న భారీ క్రేజ్‌ దృష్ట్యా ఆమెను చిత్ర యూనిట్‌ సంప్రదించిందట. కథ, కథనంతోపాటు ఈ ప్రత్యేక పాట వచ్చే సందర్భం తమన్నాకి బాగా నచ్చాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌కి తమన్నా పచ్చజెండా ఊపినట్టేనని అందరూ భావిస్తున్నారు. మరో స్పెషల్‌ సాంగ్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేందుకు రెడీ అవుతున్న తమన్నాకు ‘ఎఫ్‌2’తో చాలా పెద్ద హిట్ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’, ‘సైరా నరసింహారెడ్డి’, తమిళంలో ‘దేవి 2′, కలైమానె’ చిత్రాల్లో నటిస్తోంది.