అంతా సంకోచిస్తున్న సమయంలో నేను ధైర్యంగా చేసా !

“మన ఆశయంలో నిజాయితీ, స్వచ్ఛత ఉంటే కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటామ”ని విశ్వాసం వ్యక్తం చేసింది తమన్నా. “సినీరంగంలో తొలి అడుగు నుంచి కెరీర్‌ను ప్రణాళికబద్దంగా తీర్చిదిద్దుకున్నా”నని చెప్పింది. ప్రస్తుతం తమన్నా సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. “అగ్ర కథానాయికలు డిజిటల్‌ మీడియాపై అడుగుపెట్టేందుకు సంకోచిస్తున్న తరుణంలో తాను ధైర్యంగా వెబ్‌సిరీస్‌లు చేశా”నని చెప్పింది. పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దక్షిణాదిన కమర్షియల్‌ కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృషించుకున్న తమన్నా మాట్లాడుతూ…

“నటిగా ప్రతిభాసామర్థ్యాల్ని ఆవిష్కరించుకోవడానికి డిజిటల్‌ వేదికలు గొప్ప మాధ్యమాలుగా భావిస్తా. ఇక్కడ కొత్త కథల్ని, ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకునే అవకాశముంటుంది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కాన్సెప్ట్‌లతో  వెబ్‌సిరీస్‌లు చేస్తా” అని చెప్పింది. ఓటీటీల్లో నటించడం వల్ల కథానాయికగా స్టార్‌ ఇమేజ్ దెబ్బతింటుందా? అనే ప్రశ్నకు…”నటించడం వరకే మన చేతిలో ఉంటుంది. స్టార్‌డమ్‌ ప్రేక్షకులు అందించే వరం. నా నియంత్రణలో లేని విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించను. ప్రతిభకు గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వస్తే వాటిని బోనస్‌గా భావిస్తా” అని చెప్పింది. తెలుగులో ‘లెవెన్త్‌ అవర్‌’ సిరీస్‌తో ఓటీటీ వేదిక మీద అరంగేట్రం చేసింది తమన్నా. ఆమె నటించిన తొలి తమిళ వెబ్‌సిరీస్‌ ‘నవంబర్‌ స్టోరీ’ 20 నుండి  ప్రసారం కానుంది.

అటువంటి వాళ్లను చూస్తే, భయం వేస్తుంది!… ‘‘కొంతమంది వైరస్‌ లక్షణాలు కనిపించినా… చాలా లైట్‌ తీసుకుంటారు. అటువంటి వాళ్లను చూస్తే, భయం వేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులతో పోలిస్తే… కరోనా ఫస్ట్‌ వేవ్‌ నథింగ్‌’’ అని తమన్నా అంటోంది. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా బారిన పడిన తారల్లో ఆమె ఒకరు. హైదరాబాద్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ చేస్తున్న సమయంలో లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆస్పత్రిలో చేరింది. కొవిడ్‌ గురించి తమన్నా మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నా వయసు ఉన్న వారు ఆస్పత్రిలో చేరడం అరుదు. ఆస్పత్రికి వెళ్లే ముందు రోజు వరకూ చిత్రీకరణ చేశా. నా విషయంలో అన్నీ స్పీడుగా జరిగాయి. కొంతమంది వైరస్‌ లక్షణాలు కనిపించినా చాలా లైట్‌ గా తీసుకుంటారు. అటువంటి వాళ్లను చూస్తే, భయం వేస్తుంది. నేనలా కాదు, వెంటనే స్పందించి చికిత్స తీసుకున్నా. ఇప్పుడు కుటుంబాలకు కుటుంబాలు తుడిచి పెట్టుకుపోతున్నాయి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి బయటకు వెళ్లకుండా… ఇంట్లోనే ఉండే అవకాశం ఉన్నవాళ్లందరూ ఆ పని చేయండి’’ అని చెప్పింది.