ఆమె పేరు మీద డైమండ్ జ్యూవెల్లరీ బ్రాండ్‌

తమన్నా… ఓవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఖరీదైన వజ్రాల వ్యాపారం చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తమన్నా అధికారికంగా ప్రకటించింది. వినాయక చవితి రోజున తన పేరుమీద కొత్త డైమండ్ జ్యూవెల్లరీ బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆమె పేర్కొంది. సౌత్‌లో ఏ స్టార్ హీరోయిన్ పేరు మీద కూడా జ్యూవెల్లరీ బ్రాండ్ లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు పలువురు జ్యూవెల్లరీ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. కానీ వారి పేరుపైన మాత్రం బ్రాండ్స్ లేవు. మొదటిసారి తమన్నా తన పేరుపై బ్రాండ్‌ను విడుదల చేస్తున్న కారణంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం తమన్నా ‘ఎఫ్2’ చిత్రంతో పాటు ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహా లక్ష్మి’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా తమిళ్ లో సి. సుందర్ సినిమాలో కమిట్ అయ్యింది.
 
ఇక్కడ అనుకోనివీ జరుగుతుంటాయి
తమన్న కి ఇటీవల కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇంకో విషయం ఏమిటంటే… ఆమె ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన ‘కన్నె కలమానే’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా, విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇటీవల తమన్న ఇలా చెప్పుకొచ్చింది…. ‘‘నేను సినీరంగప్రవేశం చేసిన ఈపన్నెండేళ్లలో  చాలా అనుభవం పొందా. చిత్ర పరిశ్రమ గురించి అర్థం అయ్యింది. ఇంకా చెప్పాలంటే నా నిజజీవితానికి, సినీ జీవితానికి అనుబంధం ఉందనిపిస్తోంది. ఆదిలో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించా. అందులో కొన్ని అనూహ్యంగా విజయం సాధించి నా కెరీర్‌కు ఉపయోగ పడ్డాయి. ‘బాహుబలి’ చిత్రం తరువాతే ఉత్తమ నటి అనిపించుకున్నాను. అంతకు ముందు హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా, అక్కడా నాకు గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం ‘బాహుబలి’నే.
ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందీ? విజయం సాధిస్తుందా?లేదా? అన్నది ఎవరూ చెప్పలేరు. కొన్ని చిత్రాలే సంతృప్తిని కలిగిస్తాయి. కొన్ని చిత్రాలు విజయం సాధిస్తాయని భావించినా ప్లాప్‌ అవుతుంటాయి. నిజం చెప్పాలంటే… కొన్ని చిత్రాల్లో ఎలాంటి నమ్మకం లేకుండా నటిస్తాం. అవి అనుకోకుండా సక్సెస్‌ అవుతుంటాయి. ఇక్కడ ఊహించినవి జరగవు, అనుకోనివీ జరుగుతుంటాయి. సినిమా పేరు, డబ్బు అన్నీ ఇస్తుంది. అద్భుత చిత్రాలు ఎప్పుడు వస్తాయన్నది ఎవరూ చెప్పలేరు. అనూహ్యంగా వస్తాయి. ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాయి’’ అని తమన్న పేర్కొంది.