తమన్నాలో మార్పుకు ఈ చిత్రాలే కారణమట!

తమన్నా గ్లామర్‌కు మారు పేరు… అందాలను నమ్ముకుని ఎదిగిన నటి తమన్నా. ఇక ఐటమ్‌ సాంగ్స్‌లో అయితే చెప్పనక్కర్లేదు. అయితే తమన్నాలోనూ మంచి నటి ఉంది. ఆ విషయం తమిళంలో నటించిన ‘కల్లూరి’ చిత్రంలోనే నిరూపించుకున్నా…ఎందుకనో దర్శక, నిర్మాతలు తమన్నాను గ్లామర్‌కే ఎక్కువగా వాడుకుంటున్నారు. తమన్నా నట జీవితంలో ‘బాహుబలి’ చిత్రం మరచిపోలేని చిత్రంగా గుర్తుండి పోతుంది.”బాహుబలి’ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ బాధ్యతతో చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం జీవిత కాలం ఆదృష్టమే అనుకోవాలి. కానీ ఆ సినిమా అంతటి విజయాన్ని చేకూరుస్తుందని మాత్రం మేము ఊహించలేదు. అంతేగాకుండా ఈ సినిమా ప్రాంతీయ చిత్రాల ముఖచిత్రాన్నే మార్చేసిందని చెప్పాలి”..అని అంటోంది తమన్నా.
 
“పాత్రలో సత్తా ఉండాలేగాని.. దుమ్ము దులిపేస్తా” అన్నట్టుగా ‘సైరా’ చిత్రంలో లక్ష్మీ పాత్రకు జీవం పోసింది తమన్నా. అ చిత్రంలో నయనతార కంటే తమన్నా పాత్రకే పేరు వచ్చింది. ఇక ఇటీవల తెరపైకి వచ్చిన తమిళ చిత్రం ‘పెట్రోమ్యాక్స్‌’ తమన్నాకు సక్సెస్‌ను అందించింది. తమన్నాలో మార్పుకు ఈ చిత్రాలే కారణమట…. ఇకపై గ్లామర్‌కు దూరంగా ఉండాలని తమన్నా నిర్ణయించుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తానంటోంది. మంచి కుటుంబ కథా పాత్రల్లో నటించాలన్న తమన్నా ఆశను ఆహ్వానించాల్సిందే గానీ..కానీ,ఆమె తన మాటపై నిలబడుతుందా?
 ఆమె పాత్ర చేయాలనుంది
”వెండితెరపై శ్రీదేవి పాత్ర చేయాలనుంది. ఆమె వయసులో ఉన్నప్పటి పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. ఆమె బయోపిక్‌లో చేయాలని ఆతృతగా ఎదురు చూస్తున్నా. అదే నా డ్రీమ్‌ రోల్‌’ అని చెప్పింది తమన్నా. తెలుగులో ‘ఆనందో బ్రహ్మా’ చిత్రాన్ని తమిళంలో ‘పెట్రోమ్యాక్స్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. ఇందులో ఈమె నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన కెరీర్‌ గురించి వివరించింది. ‘నేను చేస్తున్న పాత్రలు ఏవైనా వాటన్నింటికీ సమాన ప్రాధాన్యమిస్తూ చేస్తున్నా. ఏదైనా చాలా కూల్‌గా ఉంటా. కానీ ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత ‘పెట్రోమ్యాక్స్‌’ లైన్‌ మాత్రం నాకు కొత్తగా అనిపించింది . అలా అని హారర్‌ కామెడీ చిత్రాలే చేయాలని ఏమీ అనుకోలేదు. ‘ఆనందో బ్రహ్మా’ లైన్‌ కాస్త భిన్నంగా ఉంది. భారీ సంఖ్యలో నటీనటులు ఇందులో నటిస్తున్నారు. అందుకే నేనూ చేసేందుకు ఆసక్తి చూపాను. సినిమా ఏదైనా, నటులు ఎవరైనా వారికి ఎంతో గౌరవం ఇస్తా. బడ్జెట్‌ను బట్టి ప్రాధాన్యాలుండవు…అని అంటోంది.
తమన్నా ప్రస్తుతం విశాల్‌తో ‘యాక్షన్‌’ చిత్రంలో కనిపిస్తోంది. తెలుగులో నటుడు గోపీచంద్‌కు జంటగా నటిస్తోంది. అందులో కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నట్లు తమన్నా చెప్పింది. ‘నవాజుద్దీన్‌ సిద్దిఖీతో కలసి ఓహిందీ సినిమా చేస్తున్నా. అతనో ప్రతిభావంతుడైన నటుడు’..అని చెప్పింది. అదే విధంగా హిందీ చిత్రం ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’ చిత్రంలో తమన్నా నటించిన విషయం తెలిసిందే.