‘కమర్షియల్‌ కథానాయిక’ అంటే గర్వంగానే ఉంటుంది !

‘కథానాయకులతో కలిసి ఎప్పుడూ ఆడిపాడటమేనా? నాక్కూడా ఓ బలమైన పాత్ర వస్తే బాగుండేది కదా !..అని తొలినాళ్లలో అనిపించేది. కానీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే.. ఆడిపాడే పాత్రలతోనే ప్రేక్షకులపై అంత ప్రభావం చూపించానా? అని ఆశ్చర్యం కలుగుతోంది’’ అంటోంది తమన్నా. దక్షిణాదికి చెందిన అగ్ర కథానాయికల్లో తమన్నా ఒకరు. తెలుగు, తమిళంలో నటిస్తూనే అప్పుడప్పుడు హిందీలోనూ మెరుస్తోంది. ‘కమర్షియల్‌ కథానాయిక’ అని పిలిపించుకోవడం ఎప్పుడూ గర్వంగానే ఉంటుందని చెబుతోంది. కెరీర్‌ తొలి రోజులు గుర్తుకొస్తుంటాయా? అని అడిగితే… అసలు మరిచిపోతే కదా …అని అంటోంది తమన్నా.
‘‘పదమూడేళ్లకే నా సినీ ప్రయాణం మొదలైంది. ఇన్నాళ్లుగా నటిస్తున్నా ఇప్పుడే నటిగా జీవితాన్ని ప్రారంభించినట్లు ఉందని, ఇలా భావించడమే తన విజయరహస్యం అన్నారు. చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చానని, ఆ రోజులను తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పారు.తొలినాళ్లలో అతి విశ్వాసం ఉండేది. ఏమైనా చేయగలననే ధీమాతో కనిపించేదాన్ని. అందుకేనేమో భాష తెలియకపోయినా ఆ వయసులో ధైర్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చా. అప్పటి ధైర్యం, ఆత్మ విశ్వాసం ఇప్పుడుంటే ఇంకా ఏమేం చేసేదాన్నో! వయసు, అనుభవం పెరుగుతున్నకొద్దీ ఆలోచనల్లో పరిణతి పెరుగుతుంది. ఇప్పుడు నాలో ఉన్నది అసలైన ఆత్మవిశ్వాసం. ఒక పాత్రనైనా, కథనైనా పరిపూర్ణంగా అర్థం చేసుకొని చేసేంత పరిణతి ఇప్పుడే వచ్చిందని నా అభిప్రాయం. అందుకే ఇకపై నా సినీ ప్రయాణం మరో రకంగా ఉంటుందని నమ్ముతా’’ అని చెప్పింది తమన్నా. ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర చేస్తున్న తమన్నా, ‘రాజుగారి గది 3’లోనూ నటిస్తోంది
అలాంటి చిత్రంలో నటించాలని కోరిక
మిల్కీ బ్యూటీ తమన్నాకు సినిమారంగంలో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉంది. చాలా పిన్న వయసులోనే నటిగా రంగప్రవేశం చేసిన తమన్నా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటించేశారు. బాలీవుడ్‌లో పెద్దగా ఆదరణకు నోచుకోకపోయినా దక్షిణాది ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా తన మార్కెట్‌ను కాపాడుకుంటున్న తమన్నా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ… తాను చిన్న తనం నుంచి నటి మాధురీదీక్షిత్‌ డాన్స్‌ చూసి ఆమెలా ఆడాలని ఆశ పడ్డానని చెప్పారు.
మాధురీకి చాలా మంది అభిమానులుండేవారని, అలా తనకూ ఉండాలని కోరుకునేదాన్నని అన్నారు. ఆ కోరికే తనను సినిమా రంగంలోకి తీసుకొచ్చిందని అంది. దీంతో పట్టుదలతో డాన్స్‌ను నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా డాన్స్‌కు ప్రాధాన్యత కలిగిన చిత్రంలో నటించాలన్న కోరిక ఉందని, అలాంటి చిత్రంలో తన పూర్తి డాన్స్‌ ప్రతిభను నిరూపించుకోవాలని ఆశ పడుతున్నట్లు వెల్లడించారు.అయితే ఇప్పటి వరకూ ఆ కోరిక నెరవేరలేదు.