వారి ఆదరణ పొందడం అంత సులభం కాదు !

చిత్ర పరిశ్రమ బాగుండాలంటే అన్ని చిత్రాలు విజయం సాధించాలి..నేను అదే కోరుకుంటానని అంటోంది నటి తమన్నా. టాలీవుడ్‌లో ‘ఎఫ్‌ 2’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ మిల్కీబ్యూటీ… నటన తన వృత్తి అని, ఈ రంగం తనదని అంటోంది . ఇక్కడ ఒంటరిగా ఎవరూ జయించలేరని, ఒక చిత్ర విజయం వెనుక చాలా మంది కృషి, శ్రమ ఉంటాయంది.
 
ఈ గుజరాతీ బ్యూటీకి సినిమా అనుభవం చాలా ఎక్కువనే చెప్పాలి. తొలుత బాలీవుడ్‌లో నటించి ఆపై టాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ చుట్టేసింది. అయినా ఇప్పుటికీ కథానాయకిగా బిజీగానే కొనసాగుతోంది. ప్రభుదేవాతో జత కట్టిన ‘దేవి 2′ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి వస్తోంది .హిందీలో’ఖామోషి’ అనే చిత్రంలో నటిస్తున్న తమన్నా.. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ప్రధాన భూమికను పోషిస్తోంది. ఇక కోలీవుడ్‌లో విశాల్‌తో నటిస్తున్న చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఈ సందర్భంగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….
 
తన చిత్రాలు బాగా ఆడితే నిర్మాతలకు, బయ్యర్లకు, థియేటర్‌ యాజమాన్యానికి లాభాలు వస్తాయని.. అది తనకూ సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పింది. అదే విధంగా తాను నటించని చిత్రాలు కూడా సక్సెస్‌ కావాలని కోరుకుంటానని.. కారణం.. చిత్ర పరిశ్రమ బాగుండాలంటే అన్ని చిత్రాలు విజయం సాధించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా రంగం పచ్చగా ఉంటేనే నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం సంతోషంగా ఉంటాయంది. అందుకే సినిమాల విజయాలు చాలా అవసరం అని.. అయితే ఇప్పుడు 100 చిత్రాలు విడుదలయితే.. అందులో 10 చిత్రాలే ప్రజాదరణ పొందుతున్నాయని, ఇది బాధాకరమైన విషయం అంది.ప్రస్తుత పోటీ ప్రపంచంలో అభిమానుల ఆదరణ పొందడం అంత సులభం  కాదన్న తమన్నా… ఇలాంటి పరిస్థితుల్లో చిత్రాల విజయాలు చాలా ముఖ్యమంటోంది. అదేవిధంగా విజయవంతమైన చిత్రాల్లో తానున్నానని సంతోషం పడడం కాకుండా… ఏ చిత్రం సక్సెస్‌ అయినా సంతోషపడతానని చెప్పింది
 
నలభై రోజుల్లో పూర్తి చేసి విడుదల
ఓ సినిమాను రూపొందించాలంటే కనీసం 90రోజులు సమయం అవసరం. అదీ పెర్‌ఫెక్ట్‌ మూవీ అయితే. అలా కాకుండా చిన్న చిత్రాలు మాత్రం ఏదో రికార్డుల కోసం 10 రోజులు, 20 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఐదారు రోజుల్లోనూ షూటింగ్‌ పూర్తి చేసి తామెంటో నిరూపించుకున్నారు కొందరు దర్శక నిర్మాతలు. కానీ ఓ అగ్రకథానాయకుడో, కథానాయికో చేస్తోన్న సినిమాలు ఇలా తక్కువ సమయంలో రూపొందడం అరుదు. ఇప్పుడు అగ్రకథానాయిక తమన్నా చేయబోయే తమిళ చిత్రం ఒకటి 40 రోజుల్లో అన్ని పనులూ పూర్తి చేసేసి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా ‘అభినేత్రి’ తరహాలో హారర్‌ జోనర్‌లోనే రూపొందించబోతున్నారు దర్శకుడు రోహిన్‌ వెంకటేశన్‌. త్వరలో ఈ సినిమా చెన్నైలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమా అనుకున్నట్టు జరిగితే తన జీవితంలో ఓ పెద్ద విజయం సాధించిన వాటిల్లో ఉండబోతుందని తమన్నా పేర్కొన్నారు.