నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటా !

ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఎట్టిపరిస్థితుల్లోను దానికే కట్టుబడి ఉంటానని చెబుతున్నది మిల్కీబ్యూటీ తమన్నా. పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ముద్దు దృశ్యాల్లో అస్సలు నటించనని దర్శకనిర్మాతలకు షరతు పెట్టిందట ఈ పంజాబీ బ్యూటీ. ఆ మాట ప్రకారమే పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు చుంబన దృశ్యాల్లో నటించలేదట. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ…. కిస్సింగ్ సీన్స్‌లో నటించొద్దని కెరీర్ ఆరంభంలోనే ధృడ నిశ్చయం తీసుకున్నాను. అందాల ప్రదర్శన చేయాలని, ముద్దు దృశ్యాల్లో నటించాలని చిత్రసీమలో ఎవరూ బలవంత పెట్టరు. ఏదైనా విషయం నచ్చకపోతే నిరభ్యంతరంగా మన అభిప్రాయాన్ని వెల్లడించవొచ్చు. మనకు ఇష్టం లేకపోతే ఆ సినిమా నుంచి తప్పుకోవచ్చు. కెరీర్ తొలినాళ్లలోనే ముద్దు దృశ్యాలకు సంబంధించి నా అభిప్రాయాన్ని చెప్పాను కాబట్టి ఎవరూ అలాంటి సీన్స్‌లో నటించమని కోరలేదు అని చెప్పింది.
కెరీర్‌ పడిపోతున్నప్పుడు ‘బాహుబలి’ అవకాశం
సరైన సినిమాలు లేక తన కెరీర్‌ పడిపోతున్నప్పుడు ‘బాహుబలి’ చిత్రంలో అవకాశం దక్కిందని అంటున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. ‘నిజాయతీగా చెప్పాలంటే నేను కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడే నాకు ‘బాహుబలి’లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందు నేను చేసిన హిందీ చిత్రాలన్నీ భారీవే. కానీ అన్నీ బాక్సాఫీస్‌ వద్ద డీలాపడిపోయాయి. దాదాపు ఏడాదిన్నరగా ‘బాహుబలి’ సినిమాను రాజమౌళి సర్‌ తెరకెక్కిస్తున్నప్పుడు ఆయన నన్ను సంప్రదించారు. బహుశా కేమియో (అతిథి) పాత్ర కోసం అడుగుతున్నారని అనుకున్నా. కానీ ఆయన అవంతిక (బాహుబలిలో తమన్నా పాత్ర పేరు) గురించి చెప్పగానే చాలా ఆనందించా. ఎందుకంటే అది అంత అందమైన పాత్ర. అలాంటి పాత్రలను భారత సినీ చరిత్రలో తెరకెక్కించి ఉంటారని నేననుకోను. రాజమౌళి సర్ నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను’ అని వెల్లడించారు తమన్నా.
 
లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం
ఇప్పటివరకు గ్లామరస్‌ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా స్పెషల్‌ సాంగ్స్‌లోనూ కాలు కదిపింది. కానీ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలపై దృష్టి పెట్టిందామె. ఆల్రెడీ తమన్నా నటించిన రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు హిందీ హిట్‌ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’, తమిళ ‘దేవి 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘రాజుగారి గది 3’కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ‘దేవి 2, రాజుగారి గది 3’ చిత్రాలు హారర్‌ బేస్డ్‌ కావడం విశేషం.
 
తాజాగా తమన్నా మరో హారర్‌ సినిమాకు సై అంది. ఈ చిత్రానికి రోహిన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయాల్లో కొత్తగా ఉండే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం ఒకటి. ‘రాజుగారి గది 3’ చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో ఉండటమే కాకుండా స్క్రీన్‌ ప్లే రెండు కాలసమయాల్లో నడుస్తుంది. ఆసక్తిగా అనిపించి సైన్‌ చేశాను. స్క్రిప్ట్‌ నచ్చితే మరిన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్‌ దర్శకత్వం వహిస్తారు.