వచ్చినవన్నీ కాదు, నచ్చిన పాత్రలే చేస్తా !

తమన్నా… వచ్చిన అవకాశాలన్నీ ఎడాపెడా ఒప్పేసుకుని నటించేస్తున్న ఈ మిల్కీబ్యూటీ స్పీడ్‌ ఇటీవల తగ్గింది. కోలీవుడ్‌లో గత ఏడాది ‘స్కెచ్‌’ చిత్రం తరువాత మరో సినిమా తెరపైకి రాలేదు. ప్రస్తుతం ఉదయనిధిస్టాలిన్‌తో నటిస్తున్న ‘కన్నే కలైమానే’ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఇక తెలుగులో చిరంజీవి’ సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో మెరవనుంది.మొత్తం మీద తమన్నాకి అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి.
 
మీ జోరు తగ్గిందా? అని అడిగితే… తమన్నా మాత్రం అంగీకరించడంలేదు. “కొందరు అనుకుంటున్నట్లు నాకు అవకాశాలు తగ్గలేదు. నా జోరు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. నేను పదమూడేళ్ళుగా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ …క్షణం కూడా తీరిక లేకుండా నటిస్తున్నా.ఇప్పుడు కొంచెం విరామం కోరుకుంటున్నానని చెప్పింది. అందుకే ఇకపై వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా, నచ్చిన పాత్రలనే    చెయ్యాలని  నిర్ణయించుకున్నాన”ని చెబుతోంది
ఈ మధ్య తెలుగులోనే ఆలోచిస్తున్నా!
‘‘నువ్వు తెలుగు అమ్మాయివి అయిపోయావు .ఎవరైనా నీ మాతృభాష ఏంటని అడిగితే తెలుగు అని చెప్పు ’’ అని మా అమ్మ నన్ను ఆట పట్టిస్తుంటారు అని చెప్పారు తమన్నా. ఇంతకీ ఆమె తల్లి రజనీ భాటియా ఎందుకలా అంటారు… ఈ విషయాన్నే తమన్నాను అడిగితే ‘‘నేను కూడా  ‘ఎందుకు అలా అంటున్నావు?’ అని అమ్మను అడిగితే…. “నీ మాతృభాష సింధీ. కానీ నువ్వు సింధీ అమ్మాయిలాగా స్పష్టంగా ఏరోజూ సింధీ మాట్లాడవు. అదే తెలుగు మాత్రం తెలుగువారు మాట్లాడినంత బాగా మాట్లాడుతున్నావ్‌. అందుకే నిన్ను అలా చెప్పమంటున్నాను”అని అంది. నిజమే… ఒకప్పుడు నా ఆలోచనలన్నీ సింధీలోనే సాగేవి. అదేంటో విచిత్రంగా ఈ మధ్య తెలుగులోనే ఆలోచిస్తున్నాను. అంటే అమ్మ చెప్పినట్టు నేను తెలుగు అమ్మాయిని అయిపోయానన్నమాట’’ అని చెప్పారు తమన్నా.చక్కటి తెలుగు మాట్లాడుతున్న  తమన్నాను చూసి అయినా..  మన హీరోయిన్ లు తెలుగు మీద దృష్టి పెడితే బాగుంటుంది.