ఆ లక్ష్యానికి ఇప్పుడే దగ్గరవుతున్నా!

“ఒకేసారి ఐదారు సినిమాలు అంగీకరించి నేను కష్టాలు పడుతూ దర్శకనిర్మాతల్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోను. ఏకకాలంలో రెండు సినిమాలకు మించి అంగీకరించను. అవి పూర్తయిన తర్వాతే కొత్త సినిమాలపై సంతకం చేయాలన్నదే నా పద్ధతి” .. అని తెలిపింది తమన్నా. ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ లో పోరాట యోధురాలిగా మారిన డాన్సర్‌ లక్ష్మి పాత్రలో కనిపించి అభినందనలు అందుకుంది తమన్నా. అవకాశాలు లేకపోవడంతో తమన్నా సినిమాలు తగ్గినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ వార్తలపై తమన్నా స్పందిస్తూ… “కమర్షియల్ సినిమాలు కాకుండా అభినయపరంగా సవాలుతో కూడిన పాత్రల కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నానని.. అందుకే కొంత విరామం వచ్చింద”ని చెప్పింది .”మంచి నటిగా గుర్తింపును తెచ్చుకోవడం సులభం కాదు… ఆ లక్ష్యానికి ఇప్పుడే దగ్గరవుతున్నాను. ‘బాహుబలి’ తర్వాత నటనకు అవకాశం ఉన్న విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి . నా పాత్ర ఎంతుందని గాని… పారితోషికంతో గాని సంబంధం లేకుండా కొత్తదనం ఉన్న సినిమాల్నే అంగీకరించాలనుకున్నాను. అందుకే కథలు నచ్చకపోవడంతో కొన్నింటిని తిరస్కరిస్తున్నాను”.. అని చెప్పింది . అలాగే “ఇప్పటివరకు ఒక్క అవార్డు అందుకోలేదనే అసంతృప్తి తనకు లేద”ని చెప్పింది. “అవార్డులు నటీనటులకు ప్రేరణనిస్తాయి..అయితే వాటి కోసమే సినిమాలు చేయను. అవి రాలేదని బాధపడను” అని అంది తమన్నా.
 
మళ్లీ నాలుగేళ్ల తర్వాత మహేష్ తో 
తమన్నా ప్రస్తుతం ‘పెట్రోమాక్స్‌’, ‘యాక్షన్‌’, ‘బోల్‌ చుడియన్‌’, ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ చిత్రాల్లో చేస్తోంది . దీంతోపాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది.తమన్నా డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఫుల్‌ ఎనర్జీతో ఉంటాయి. ఈ స్టెప్స్‌కు స్క్రీన్‌పై మహేశ్‌ బాబు కూడా ఉంటే ఇక చెప్పనక్కరలేదు. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఇంట్రోసాంగ్‌లో తమన్నా డ్యాన్స్‌తో అలరించబోతున్నారు. ఈ విషయం తమన్నా చెబుతూ – ‘‘మహేశ్‌తో ‘ఆగడు’లో హీరోయిన్‌గా నటించాను. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మహేశ్‌ సినిమా లో డ్యాన్స్‌ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను’’ అని తెలిపింది . ఈ సాంగ్‌ చిత్రీకరణను డిసెంబరులో ప్లాన్‌ చేశారని తెలిసింది. అలాగే ‘స్పెషల్‌ సాంగ్‌’లో పూజా హెగ్డే చిందేస్తారట. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాలో రష్మికా మండన్నా కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.