అయినా అవకాశాలు రాకపోతే అదివారి దురదృష్టం !

తమన్నా… ఇతర నటీమణులకు రావలసిన అవకాశాలను  తన్నుకుపోతోందనే ప్రచారం వైరల్‌ అవుతోంది. తమన్నాకు మరోసారి అదృష్టం తలుపు తట్టడంతో ఇతర హీరోయిన్ల అవకాశాలు తమన్నా రాబట్టుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా హీరోయిన్ల మధ్య పోటీ, పోరు జరుగుతోందని, ఒకరి అవకాశాలను మరొకరు ఎగరేసుకుపోతున్నరనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి స్పందించిన తమన్నా… ఎవరి అవకాశాలు వారి చేతిలోనే ఉంటాయని అంది. ఒకరి అవకాశాలను మరొకరు తన్నుకు పోయే పరిస్థితి ఇక్కడ లేదని అంది. అదే విధంగా హీరోయిన్ల మధ్య స్నేహం ఉండదు, అంతా పోటీ, పోరేననడం సరికాదు అని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే… ఇద్దరు హీరోయిన్లు మధ్య స్నేహాన్ని అదేదో ప్రపంచంలోనే జరగని విషయంగా చూస్తున్నారని అంది. సినిమారంగంలో దర్శకులు, హీరోయిన్లు, కెమెరామెన్లు ఇలా చాలా మంది స్నేహంగా మెలుగుతుంటారని, అయితే వారి మధ్య వృత్తి రీత్యా పోటీ ఉంటుందని చెప్పింది. అయితే ప్రతిభపై నమ్మకం లేని వారికే పోటీ, అసూయ, భయం లాంటివి ఉంటాయని అంది. ఇక్కడ ఎందరు హీరోయిన్లు ఉన్నా వారి ప్రతిభకు తగ్గట్టు అవకాశాలు లభిస్తాయని, ఒక వేళ ప్రతిభ ఉన్నా అవకాశాలు రాకపోతే అది వారి దురదృష్టం అని తమన్నా పేర్కొంది.
తెలుగులో ‘ఎఫ్‌–2’ విడుదల వరకూ తమన్నా అవకాశాల విషయంలో ఎదురీదింది. కోలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. తమన్నా నటించిన ‘కన్నె కలైమానే’ ప్లస్‌ అవలేదు. అయితే ఆ తరువాత అవకాశాలు రావడం మొదలెట్టాయి.  ప్రస్తుతం ప్రభుదేవాతో నటించిన ‘దేవి–2’ చిత్రం నిర్మాణకార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు వరుసగా కొత్త చిత్రాలు తమన్నా కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో రెండు విశాల్‌తో రొమాన్స్‌ చేసేవి కావడం విశేషం. అందులో సుందర్‌.సీ దర్శకత్వంలో నటించనున్న చిత్రం షూటింగ్‌ను అధిక భాగం టర్కీ లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట. తమన్నా ఏకంగా 50 రోజులు కాల్‌షీట్స్‌ కేటాయించిందని సమాచారం.‘అదే కణ్‌గళ్‌’ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రోహిత్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించబోతోంది. ఇది హర్రర్‌ ఇతివృత్తంలో తెరకెక్కనున్న చిత్రం.
 
రెండు యుగాల లేడీ ఓరియెంటెడ్‌ మూవీ
ఈ ఏడాది తనకు మంచి పాత్రలు రాబోతున్నాయనీ, అందులో రెండు యుగాలకు సంబంధించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీలో చేయడం అదృష్టంగా భావిస్తున్నానని.. నటి తమన్నా చెప్పింది. తెలుగులో ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది’కి మంచి పేరు వచ్చింది. దాంతో పలు భాగాలు తీయవచ్చని అప్పట్లో ఓంకార్‌ ప్రకటించారు. భయానక కామెడీగా రూపొందిన ఆ చిత్రంలో అశ్విన్‌ బాబు, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో 2015లో విడుదలైంది. ఆ తర్వాత 2017లో ‘రాజు గారి గది 2’ నాగార్జున,సమంతా  చేసారు. తాజాగా మూడో భాగం తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో తమన్నా కీలక పాత్ర పోషించనున్నదని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో పట్టాలెక్కనుంది. ఈ పాత్ర గురించి తమన్నా చెబుతూ… రెండు వేర్వేరు యుగాలకు చెందిన పాత్రలమధ్య సాగే కథ చాలా ఆసక్తికరంగా వుంది. అది విన్న వెంటనే చేయాలనిపించిందని పేర్కొంది.