వారిలో ఆ మార్పు బాగా కనిపిస్తోంది !

‘‘సినిమా హీరోయిన్‌గా నాకు పద్నాలుగేళ్ళు పూర్తయ్యింది.  వివిధ రకాల సినిమాల్లో భాగమయ్యే అవకాశం లభించింది. గతంలో కొన్ని సినిమాలు చేయాలనుకున్నా.. ప్రేక్షకులు చూస్తారో? చూడరో? అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది. ఆ మార్పు బాగా కనిపిస్తోంది’’ అన్నారు తమన్నా. ప్రస్తుతం తన దగ్గరకు వస్తున్న పాత్రలు, ప్రేక్షకులు సినిమా చూస్తున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ…
‘‘ప్రేక్షకులు భిన్నమైన సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. కొత్త ఐడియాలకు స్వాగతం పలుకుతున్నారు. ఇంతకుముందు చేయలేం అనుకున్న పాత్రలు ఇప్పుడు నమ్మకంగా చేయొచ్చు. నా దగ్గరకు వచ్చే పాత్రల్లో కూడా మార్పును గమనించాను. పాత్రల్లో కొత్తదనం ఉండి, అవి హీరోయిన్లు చేయగలరని దర్శకులు నమ్మడం యాక్టర్‌గా నాకు చాలా కాన్ఫిడెన్స్‌ ఇస్తోంది. చేసే ప్రతీ పాత్రలో వ్యత్యాసం చూపించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే’’ అన్నారు.
మలయాళం లో’సెంట్రల్‌ జైల్‌లో దెయ్యం’

తమన్నా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి తొలి పరిచయం కాబోతున్నారు. తొలి స్ట్రయిట్‌ సినిమాతోనే ప్రేక్షకులను భయపెడతానంటున్నారు. ‘సెంట్రల్‌ జైలిలే ప్రేతం’ (‘సెంట్రల్‌ జైల్‌లో దెయ్యం’ అని తెలుగు అర్థం) అనే హారర్‌ సినిమాలో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు తమన్నా. కథ మొత్తం ఓ సెంట్రల్‌ జైల్, అందులో ఉండే దెయ్యాల చుట్టూ తిరుగుతుందట. ఇందులో మలయాళ, తమిళ స్టార్స్‌ చేయనున్నారు. సంధ్యా మీనన్‌ దర్శకురాలు.

‘రీమేక్‌ క్వీన్‌’ అయ్యారు తమన్నా                                                                                         ఈ ఏడాది తమన్నా ఎక్కువ రీమేక్స్‌లో కనిపించనున్నారు. ఇటీవలే హిందీ ‘క్వీన్‌’ను తెలుగులో ‘దటీజ్‌ మహాలక్షి’గా రీమేక్‌ చేశారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది . ఆల్రెడీ తెలుగు సూపర్‌ హిట్‌ ‘ఆనందో బ్రహ్మా’ను ‘పెట్రోమాక్స్‌’ టైటిల్‌తో తమిళంలో రీమేక్‌ చేశారు. అందులో తమన్నా లీడ్‌ రోల్‌ చేశారు. ఇప్పుడు తమిళ ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి తెలుగు టు తమిళం టు హిందీ సినిమాల రీమేక్స్‌తో ప్రస్తుతానికి ‘రీమేక్‌ క్వీన్‌’ అయ్యారు తమన్నా

విశాల్‌తో సమానంగా యాక్షన్
తమన్నాను ‘మిల్కీ బ్యూటీ’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మిల్కీబ్యూటీని ఇంతవరకు గ్లామర్ తారగా చూశాం. ‘బాహుబలి’తో ఆమెలోని యాక్షన్ కోణాన్ని వెలికి తీశారు జక్కన్న రాజమౌళి. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లో లక్ష్మీ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ భామ. ఈ సినిమాలో ఈ మిల్కీబ్యూటీ యాక్షన్‌తో అదరగొట్టే ఫొటోలను ఇప్పటికే చూశాం. నెక్స్ తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘యాక్షన్’ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్‌తో సమానంగా యాక్షన్ సీన్లు చేస్తోందట ఈ భామ. తమన్నాలోని ఈ యాక్షన్ కోణాన్ని చూసి డైరెక్టర్ సుందర్.సి ఆశ్చర్యపోతున్నారట.