లాభంలో వాటా ఇస్తేచాలని నిర్మాతలతో చెప్పా !

అందాల కథానాయిక తాప్సి నటించిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతమయ్యింది . మంచి రివ్యూలను కూడా అందుకుంది. అయితే ఇందులో నటించడానికి తాప్సి పారితోషికం తీసుకోలేదట. ఉచితంగా నటించారట. కాకపోతే సినిమా విజయం సాధించిన తర్వాత వచ్చే లాభంలో వాటా ఇస్తేచాలని నిర్మాతలతో చెప్పినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. కేవలం కథను నమ్ముకుని చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తాప్సి అన్నారు.
“ఒకే రకమైన కథలను ఎంచుకోకుండా, విభిన్న కథలను ఎంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నా. కొత్తగా ప్రయత్నించడానికి ఈ సినిమా ఓ మంచి అవకాశం. అనుకున్నంత పారితోషికం ఇవ్వలేదని సినిమా నుంచి తప్పుకోలేను. నేను నిజాయతీగా కథను నమ్మా. అందుకే రిస్క్‌ తీసుకున్నా” అని  చెప్పారు.
మనుషుల్ని చూసి దెయ్యం భయపడే నేపథ్యంతో కూడిన సినిమా ‘ఆనందో బ్రహ్మ’. కొంచెం విరామం తర్వాత తాప్సి తెలుగులో నటించిన చిత్రమిది. మహి వి. రాఘవ్‌ దర్శకుడు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్‌, షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, తాగుబోతు రమేశ్‌ ప్రధాన పాత్రలు పోషించారు.