జీఎస్టీ పై ధ్వ‌జ‌మెత్తిన టీ-ఫిలించాంబ‌ర్ అధ్య‌క్షుడు ఆర్.కె గౌడ్

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం  ఫిలిం ఇండ‌స్ట్రీ పై 28 శాతం జీఎస్ టీ విధిస్తు ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.  అయితే ఈ విధానంపై  “తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్” అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ తీవ్రంగా ఖండించారు.  సినిమా అనేది సామాన్యుల‌కు , మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు రెండు గంట‌ల వినోదం అందించేది.  అలాంటి సినిమాకు 28 శాతం జీఎస్ టీ విధించ‌డం అమానుషం.  ఇప్పుడు  చిన్న సినిమాకు 7 శాతం ట్యాక్స్, పెద్ద సినిమాకు 15 శాతం ట్యాక్స్, డ‌బ్బింగ్ సినిమాకు 20 శాతం ట్యాక్స్ ఉండేది. వాట‌న్నింటికీ క‌లిపి ఒకేలా 28 శాతం జీఎస్టీ  చేయ‌డం స‌బ‌బు కాదు. కాబ‌ట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాలి.  10 శాతం జీఎస్ టీ చేయాల్సింది గా డిమాండ్ చేస్తున్నా.కమర్షియల్ గా ఉండే క్ల‌బ్స్ , క్యాసినోలు, గుర్ర‌పు రేసుల‌కు విధించిన విధంగా, సినిమా ఇండ‌స్ట్రీ పై పన్ను భారం మోప‌డం వ‌ల్ల చిన్న సినిమాలు నష్ట‌పోతాయి.
తాజాగా మ‌ళ్లీ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని రాష్ట్ర హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఇండ‌స్ట్రీలో ఉండే 4.5  కార్పోరేష‌న్ ల ప‌ద్ద‌తిని తీసుకురావ‌డం దుర‌దృష్టక‌రం.  బిగ్‌ స్క్రీన్‌ టిక్కెట్‌ ధరలు రూ.300 అవుతుండ‌గా, మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధర రూ. 200లకు చేరనుంది. సాధారణ ఏసీ థియేటర్‌లో బాల్కనీ టిక్కెట్‌ ధరను రూ. 120 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ టిక్కెట్టు ధర రూ.80 నుంచి 100 వరకూ ఉంది. కనీస టిక్కెట్టు ధరను రూ. 40గా నిర్ణయించారు. ఇంతవరకూ ఇది రూ. 20గా ఉంది. దీంతో సినిమా వినోదం మ‌ధ్య‌త‌ర‌గ‌తి..దిగువ త‌ర‌గ‌తి కుటుంబాల‌కు భారం కానుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  త‌క్ష‌ణం ఈ ధ‌ర‌లను త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే సినిమా ఇండ‌స్ట్రీని పీడిస్తోన్న థియేట‌ర్ లీజ్ విధానం, డిజిట‌ల్ దోపీడి, రూ7 మెయింట‌నెన్స్ వ‌ల్ల చిన్న సినిమాలు భారీ గా న‌ష్ట‌పోతాయని విమర్శించారు .