“తెలంగాణ ఫిలించాంబ‌ర్” ఆధ్వ‌ర్వంలో రిలే నిరాహార దీక్ష‌

డిజిట‌ల్ రేట్లు, థియేట‌ర్ లీజు విధానం,  మినీ థియేట‌ర్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం నుంచి 15 రోజులలోనే  అనుమ‌తి, చిన్న సినిమాల‌ను ప‌ర్సంటేజ్ ప‌ద్ధ‌తిలో ప్ర‌ద‌ర్శించాల‌ని,  కేంద్రం ప్ర‌భుత్వం  సినిమా ఇండ‌స్ట్రీ పై  తీసుకొచ్చిన 28 శాతం పన్ను ర‌ద్దు అంశాల‌పై  “తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్” అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్  రిలే నిరాహార దీక్ష‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

కాగా సోమ‌వారం 10.30 గంట‌ల‌కు  ఆయ‌న బృందంతో హైద‌రాబాద్ “తెలుగు ఫిలిం ఛాంబ‌ర్” ఎదుట నిరాహార దీక్ష‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తాని మాట్లాడుతూ… `డిజ‌ట‌ల్ రేట్లు వారానికి 2500 చేయాలి. థియేట‌ర్ లీజు విధానం ర‌ద్దు చేయాలి. మినీ థియేట‌ర్స్ ను నిర్మించ‌డానికి ప్ర‌భుత్వం 15 రోజులలో అనుమ‌తి ఇవ్వాలి. చిన్న సినిమాల‌ను ప‌ర్సంటేజ్ ప‌ద్ద‌తిలో ప్ర‌ద‌ర్శించాలి. అలాగే జీఎస్టీ 28 శాతాన్ని 10 శాతానికి త‌గ్గించాల‌ని డిమాండ్` చేశారు.

ప్ర‌తాని దీక్ష‌కు సంఘీభావం తెలుపుతూ విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్. నారాయ‌ణ మూర్తి మాట్లాడుతూ … ` సినిమా ఇండ‌స్ర్టీ బ్రోక‌ర్ల మ‌యం అయిపోయింది. ఇక్క‌డ వాళ్లే ద‌ర్జాగా బ్ర‌తుకుతున్నారు. వాళ్ల వ‌ల్ల చిన్న సినిమాలు కిల్ అవుతున్నాయి. థియేట‌ర్ల విష‌యంలో గుత్తాదిప‌త్యం కొన‌సాగుతోంది. దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూర్చుని త‌గిన విధంగా ఆలోచ‌న‌లు చేసి త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలని` డిమాండ్ చేశారు.

తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ క‌విత మాట్లాడుతూ, ` జీఎస్టీ  వ‌ల్ల చిన్న సినిమా బ్ర‌తుకే శూన్యం అవు తుంద‌ని..28 శాతం గ‌నుక కొన‌సాగితే ఇక సినిమా జీవితం కోల్పోయిన‌ట్లే. అలాగే త‌మ డిమాండ్ల‌ను త‌క్ష‌ణం తీర్చాల‌ని` ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాగా రిలే నిరాహార దీక్ష‌లో తెలంగాణ  ఫిలింఛాంబ‌ర్  సెక్ర‌ట‌రీ సాయి వెంక‌ట్, క‌విత‌, ర‌మ్య శ్రీ, అన్న‌పూర్ణ‌, జాను, రోషం బాలు, బ‌ల్లెప‌ల్లి మోహ‌న్ , సంగీత ద‌ర్శ‌కుడు బోలే, బులెట్ ర‌వి, అక్ష‌ర, న‌ట్టికుమార్,శ్రీ లక్ష్మి ,పి.ఎన్,రామచంద్రరావు,షెరాజ్,వాసిరాజు ప్రకాశం,జ్యోతి ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అలాగే పలువురు చిన్న నిర్మాత‌లు.. 24 శాఖ‌ల‌కు చెందిన వారు  ప్ర‌తాని దీక్ష‌కు సంఘీభావం తెలిపారు.