‘సూపర్‌స్టార్‌’ దంపతులకు ‘తెలుగు సినిమా గ్రంథం’ అంకితం

తెలుగు సినిమా లెజెండ్స్‌ అక్కినేని, దాసరి, రామానాయుడు, డి.వి.ఎస్‌.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన ‘ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అసోసియేషన్‌’ (ఫాస్‌) డా. కె.ధర్మారావు రచయితగా వెలువరించిన ’86 సంవత్సరాల తెలుగు సినిమా’ గ్రంథాన్ని సూపర్‌స్టార్‌ కృష్ణ, గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ హోల్డర్‌, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల అంకితం తీసుకున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ నివాసంలో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ అంకితోత్సవంలో రచయిత, 5 దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సాంస్కృతిక పరంగా దేశవిదేశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కె.ధర్మారావు… తెలుగు సినిమాకు ఒక గాఢాభిమానిగా దశాబ్దాలుగా తన వద్దనున్న, వివిధ రకాలుగా సేకరించిన సమాచారంతో 86 వసంతాల తెలుగు సినిమాను ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగిందని, ఈ విషయాలను దర్శకరత్న డా. దాసరి 4 సంవత్సరాలుగా వింటూ తమ ప్రశంసలు అందించడం తాను పడిన శ్రమను మర్చిపోయేటట్లు చేసిందన్నారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. 484 పేజీలు విషయం, మరో 24 పేజీలు రంగుల పుటలతో విశిష్ట సమాచారంతో పాటు చక్కటి ఫొటోలతో తెలుగు సినిమా విశేషాలను బాగా ఆవిష్కరించారు. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఎన్‌సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది. రచయిత ఈ పుస్తకంపై వెచ్చించిన 14 సంవత్సరాలకు తాను ప్రత్యక్ష సాక్షి అన్నారు.
ఒక వివాహ వేడుకగా అద్భుతంగా జరిగిన ఈ అంకితోత్సవం తమను ఎంతగానో ఆకట్టుకుందని, ఇంత అందమైన విషయంతో కూడిన పుస్తకాన్ని తెలుగు సినిమాకు బహూకరిస్తున్నట్టుగా తాము భావించామని, తమకు ఇంత మంచి గ్రంథాన్ని అంకితం చేసినందుకు రచయితను అభినందించారు గ్రంధ స్వీకర్తలు స్టార్‌ కపుల్‌ కృష్ణ, విజయనిర్మల.
సభాధ్యక్షత వహించిన సినీ నటుడు నరేష్‌ వికె మాట్లాడుతూ… ”ధర్మారావు తెలుగు సినిమా 86 సంవత్సరముల చరిత్రను చక్కగా విశధీకరించి, తెలుగు సినిమా సేవలో మరో అడుగు ముందుకు వేశారు” అన్నారు.
సభలో సినీ నటి రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, డా. కీమల ప్రసాదరావు, ఫా. గౌరవ ఛైర్మన్‌ ప్రసాదరావు, కొదాల బసవరావు, రచయిత భార్య శ్రీమతి ఆదుర్తి సూర్య కుమారి పాల్గొన్నారు. సమావేశానికి ముందు గాయని టి.లలితరావు, డా. టీవి రావులు కృష్ణ, విజయనిర్మల నటించిన చిత్రాల్లోని పాటలను పాడి సభను అలరించారు.