‘తెలుగు సినిమాతల్లి 87వ పుట్టినరోజు’ వేడుకలు !

సాహితీ సాంస్కృతిక సంస్థలు “కళా మంజూష” ,”తెలుగు సినిమా వేదిక” సంయుక్తంగా ఫిబ్రవరి 6 సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో “తెలుగు సినిమా తల్లి 87వ పుట్టినరోజు వేడుకలను” అత్యంత వైభవంగా జరిపాయి. తెలుగు లో తొలి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” 1932 ఫిబ్రవరి 6 వ తేదీన విడుదలైనట్టు ఇటీవల  పరిశోధకులు నిర్ద్వంద్వంగా ఋజువు చేయడంతో 2016 నుంచి ఈ పండుగను వీరు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రసిద్ధ సినీ నిర్మాత, ‘అఖిలభారత ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్’ అధ్యక్షులు సి.కళ్యాణ్ ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. ఆత్మీయ అతిధులుగా ప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాతలు తమ్ముడు సత్యం, కొండేటి సురేష్, దర్శకులు దాసరి మారుతి, పారేపల్లి భరత్ తదితరులు హాజరయ్యారు..
ఈ కార్యక్రమ నిర్వాహకులు దర్శకులు రామ్ రావిపల్లి, బాబ్జి, నిర్మాతలు పి.విజయవర్మ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, ప్రేమ్ కుమార్ పాత్రా, ఎఫ్.టి.ఐ.హెచ్ ఉదయ్ కిరణ్, కథానాయిక మణి చందన తదితరులు ముఖ్యఅతిథి సి.కళ్యాణ్ చేతుల మీదుగా తెలుగు చిత్రసీమకు చెందిన తొమ్మిది మంది ప్రముఖులను సత్కరించారు.
తొమ్మిది మంది ప్రముఖులకు సత్కారం !
ప్రసిద్ధ నటుడు రాజేంద్ర ప్రసాద్, నటీమణి జీవిత, దర్శకుడు ధవళ సత్యం,నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ, సినిమాటోగ్రాఫర్ వెంగళ జయరాం, ఎడిటర్ గౌతమ్ రాజు, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ ఈ సత్కారాలు అందుకున్నారు.
“తెలుగు సినిమా తల్లి పుట్టిన రోజు”న తమకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతతో తొమ్మిది మంది ప్రముఖులూ  అత్యంత ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడడం విశేషం.
భవిష్యత్ లో తెలుగు సినిమా పరిశ్రమ లోని ప్రముఖులంతా కదిలి వచ్చి పెద్ద ఓపెన్ ఆడిటోరియం లో ఈ వేడుకను చేస్తే బావుంటుంది అని నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ చెప్పగా అందుకు తామూ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇకపై పెద్ద ఎత్తున ఈ వేడుక జరిగేలా చూస్తామని సి.కళ్యాణ్, రాజేంద్ర ప్రసాద్ హామీలిచ్చారు. “ఈ సభను మిస్ అయితే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం” అని తెలుగు సినిమా రంగం లోని ప్రతి ఒక్కరూ బాధ పడేంత పెద్ద స్థాయిలో ఈ సంబరాలు జరుపుకోవాలని సి.కళ్యాణ్ ఒకింత ఉద్వేగం తో చెప్పడం విశేషం. ఇకపై తానూ ఈ నిర్వాహకుల్లో ఒకడి గా కలిసిపోయి ప్రతి ఏడాదీ ఈ వేడుక లో పాలు పంచుకుంటానని పాత్రికేయ ప్రముఖుడు, నిర్మాత కొండేటి సురేష్ చెప్పారు.
సత్కార సభ ప్రారంభానికి ముందు తెరపై ప్రదర్శించబడ్డ తొమ్మిది మంది సన్మాన గ్రహీతల మీద రామ్ రావిపల్లి రూపొందించిన ఓ 40 నిమిషాల “బయోగ్రాఫికల్ డాక్యు-ఫిల్మ్” అటు అతిథులను, ఇటు  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.సినిమాని ప్రేమించే వందలాది మంది ప్రేక్షకుల కరతాళ ధ్వనుల నేపద్యంలో ఆద్యంతం సభ రసాత్మకంగా కొనసాగింది.