‘తెలుగు ఫిలించాంబర్’ నూతన అధ్యక్షుడిగా విశాఖ వాసి, ‘పూర్వి పిక్చర్స్’ అధినేత వి.వీరినాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ మేరకు ఛాంబర్ జనరల్ బాడీ మీటింగులో ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. 39వ జనరల్ బాడీ మీటింగులో వీరినాయుడిని ఏకగ్రీవ అధ్యక్షునిగా ఎంపిక చేస్తూ మెంబర్స్ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఆయన కొత్త అధ్యక్షునిగా ఛార్జ్ తీసుకోనున్నారు. ఫిలింఛాంబర్ ఉపాధ్యక్షుడిగా వి.సాగర్‌ని ఎంపిక చేశారు. అలానే పాత కమిటీలోని కె.బసిరెడ్డి, ముత్తవరపు శ్రీనివాస బాబు ఫిలించాంబర్ ఉపాధ్యక్షులుగా కొనసాగనున్నారు. గౌరవ కార్యదర్శులుగా ముత్యాల రాందాస్, కె.శివప్రసాదరావు(అలంకార్ ప్రసాద్) కొనసాగుతున్నారు. గౌరవ ఉపకార్యదర్శులుగా మోహన్ వడ్లపట్ల, వి.రామకృష్ణ(ఆర్.కె), ఎం.సుధాకర్, జె.మోహన్‌రెడ్డి, పేర్ల సాంబ మూర్తి, ఎన్.నాగరాజు, ట్రెజరర్‌గా టి.రామసత్యనారాయణ యథాతథంగా కొనసాగనున్నారు.
నిర్మాతల సెక్టార్ కౌన్సిల్ చైర్మన్‌గా వల్లూరిపల్లి రమేష్‌బాబు, స్టూడియోస్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్‌గా వై.సుప్రియ, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్‌గా వి.నాగేశ్వరరావు, ఎగ్జిబిటర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్‌గా జి.వీరనారాయణ బాబు కొనసాగనున్నారు. ఆ మేరకు జనరల్ బాడీ వివరాల్ని ప్రకటించింది.
అధ్యక్షునిగా ఎంపికైనందుకు గర్వంగానూ ఉంది !
ఫిలించాంబర్ నూతన అధ్యక్షుడు వీరినాయుడు మాట్లాడుతూ –“చాంబర్ అధ్యక్షునిగా అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రతియేటా ఒక్కో సెక్టార్ నుంచి ఈ ఎంపిక సాగుతోంది. ఈసారి పంపిణీదారుల విభాగం నుంచి నాకు అవకాశం వచ్చింది. ఇదివరకూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ నేను ఉన్నాను కాబట్టి పరిశ్రమ అన్ని సెక్టార్ల సమస్యల గురించి స్పష్టంగా అవగాహన ఉంది. ఎగ్జిబిటర్లకు జీఎస్టీ సహా పలు రకాల సమస్యలు ఉన్నాయి. ధరలన్నీ తారా స్థాయిలో ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ఏపీ, తెలంగాణ రెండుచోట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి మా టీమ్‌తో కలిసి కృషి చేస్తాను. తెలుగు ఫిలింఇండస్ట్రీకి అత్యున్నత స్థానంలో ఉన్న ట్రేడ్ బాడీ ఇది. అధ్యక్షునిగా ఎంపికైనందుకు గర్వంగానూ ఉంది. అలానే ఎగ్జిబిటర్‌కు డిజిటల్‌లో సమస్యలున్నాయి. డిజిటల్ ప్రొవైడర్ల తరపు నుంచి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాను. కొందరు డిజిటల్ ప్రొవైడర్లు మమ్మల్ని కలుస్తున్నారు. వాళ్లు ఇచ్చే సాంకేతికతలో క్వాలిటీ ఎలా ఉందో పరిశీలిస్తాం. ఈ సీజన్‌లో మంచి పనులు చేస్తాను“ అని అన్నారు.
ఫిలించాంబర్ ఉపకార్యదర్శి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ – ఫిలించాంబర్ కొత్త అధ్యక్షునికి శుభాకాంక్షలు. వీరినాయుడు రాబోవు 12 నెలల్లో ఎన్నో మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నా. ఈ ఏడాది తెలుగు సినీపరిశ్రమకు బెస్ట్ అవుతుందని చెప్పగలను“ అన్నారు.
నిర్మాతల సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ వల్లూరి పల్లి రమేష్ మాట్లాడుతూ – “పూర్వి పిక్చర్స్ రాజుగారిగా వీరినాయుడు అందరికీ బాగా తెలుసు. డిస్ట్రిబ్యూటర్ కం ఎగ్జిబిటర్‌గా ఎంతో అనుభవజ్ఞులు ఆయన. నాలుగు సెక్టార్‌లలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. నిర్మాతల సెక్టార్ తరపున కొన్ని సమస్యలున్నాయి. రాష్ట్రం విడిపోక ముందు 1999 నుంచి చిన్న సినిమాలకు సబ్సిడీలు ఇచ్చేవారు. అప్పటి నుంచి కొన్ని సినిమాలకు సబ్సిడీ శాంక్షన్ చేసినా ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. 4 కోట్ల 10లక్షల సబ్సిడీ శాంక్షన్ అయ్యి ఇంకా ఇవ్వలేదు. వాటిని నిర్మాతలకు ఇప్పించాలి. ఫిలింఛాంబర్ గత అధ్యక్షుడు, కన్వీనర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకు, రామ్మోహన్ గారి సమక్షంలో పత్రం సమర్పించాం. ప్రస్తుతం ఛాంబర్ అధ్యక్షుడు ముఖ్యమంత్రుల్ని కలిసి ఆ సబ్సిడీని ఇప్పించాలని కోరుతున్నా. అందరికీ తలనొప్పిగా మారిన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల సమస్యను పరిష్కరించాలి. పాత వారితో కుదరక పోతే కొత్త డీఎస్‌పీలను ఎంపిక చేయాలి. మీ అపారమైన అనుభవాన్ని నిర్మాతలు సహా అందరి కోసం వినియోగించి మేలు చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్ భరత్ చౌదరి మాట్లాడుతూ –“40ఏళ్ల అనుభవజ్ఞుడైన వీరినాయుడు గారు ఫిలించాంబర్ అధ్యక్షుడవ్వడం మేలు చేస్తుంది. అన్ని సెక్టార్ల సమస్యల్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నా“ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సెక్టార్ల చైర్మన్లు, సభ్యులు కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు, కార్యవర్గానికి `మా` అధ్యక్షుడు శివాజీ రాజా, వైస్ ప్రెసిడెంట్ బెనర్జి, సురేష్ కొండేటి ప్రత్యేకించి శుభాభినందనలు తెలిపారు.