సినిమా డాన్స్ ‘మాస్టర్ జీ’ సరోజ్‌ఖాన్ మృతి !

ఎన్నో మరపురాని పాటలకు కొరియోగ్రఫీ చేసిన సరోజ్‌ఖాన్ (71) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. సరోజ్‌ఖాన్  జూన్ 20వతేదీన బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. సరోజ్ ఖాన్ శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. సరోజ్ ఖాన్ ఐదు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ‘దేవదాస్’ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. సరోజ్ ఖాన్ చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన ‘కళంక్’ చిత్రంలో మాధురీ నర్తించిన ‘తబా హోగయీ’ పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు సినీనటీనటులు తమ సంతాపం తెలిపారు. సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్ . ఆమెకు భర్ సోహన్ లాల్,  ఇద్దరు  కుమార్తెలు,  ఒక కుమారుడు ఉన్నారు.
 
అతని గురించే ఇన్‌స్టాగ్రామ్‌ చివరి పోస్టు
గుండెపోటుతో మరణించిన సరోజ్‌ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారి చేసిన పోస్టు అందరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది. బాలీవుడ్‌లో ‘మాస్టర్ జీ’, ‘మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ’ అని ప్రేమగా పిలిచే సరోజ్ ఖాన్ మరణించే ముందు చివరిసారిగా జూన్ 14వతేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనపై ఇన్‌స్టాగ్రామ్ పోస్టు పెట్టారు. తాను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎప్పుడూ పనిచేయకున్నా అతన్ని ఎప్పుడూ ఇష్టపడేదాన్నని సరోజ్ ఖాన్ పేర్కొన్నారు.
‘‘నేను మీతో ఎప్పుడూ పని చేయలేదు కానీ సుశాంత్, నేను చాలాసార్లు కలుసుకున్నాం. మీ జీవితంలో ఏం తప్పు జరిగింది? మీరు మీ లైఫ్‌లో ఇంత తీవ్రమైన అడుగు వేసినందుకు నేను షాక్ అయ్యాను. దేవుడు మీ ఆత్మకు శాంతి చేకూర్చుగాక…మీ తండ్రి, సోదరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సమయంలో వారికి సంతాపం తెలుపుతున్నాను. నేను మీ అన్ని సినిమాల్లోనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తాను.’’ అంటూ సరోజ్ ఖాన్ సుశాంత్ మృతి పట్ల తన సంతాపం తెలిపారు. సుశాంత్ మరణం పట్ల సంతాపం తెలిపిన 20 రోజుల్లోపే సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించారు.