“యాభై శాతం ఆక్యుపెన్సీ పరిమితితో థియేటర్ల నిర్వహణ భారం కూడా సాధ్యం పడద”నే ప్రధాన కారణంతో.. కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డ సినిమా థియేటర్లను ఈ నెల 15నుంచి ప్రారంభించుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతిచ్చినా.. రాష్ట్రం ప్రభుత్వం సుముఖంగా వున్నా.. రాష్ట్రంలో థియేటర్ యజమాన్యాలు అందుకు సిద్ధంగా లేవు. థియేటర్లు తెరిచినా ప్రదర్శించుకోవడానికి కొత్త సినిమాలేవీ లేకపోవడం అందుకు కారణం. అంతేకాకుండా యాభై శాతం ఆక్యుపెన్సీ పరిమితితో థియేటర్ల నిర్వహణ భారం కూడా సాధ్యం పడదనేది వారి మరో వాదన. కరోనాతో నిలిచిన సినిమా చిత్రీకరణలు ఇపుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్న నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించడానికి జంకుతున్నారు. పరిస్థితులు అన్నీ కుదిరితే దీపావళి వరకు థియేటర్లు ప్రారంభించాలనే ఆలోచనలో వున్నారు ఎగ్జిబిటర్లు. అయితే తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పడకపోవడంతో సినీ ప్రియులు నిరాశ చెందారు. అందువల్ల ధియేటర్లో బొమ్మపడాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే !
తక్కువ టికెట్ ధరలతో ‘పీవీఆర్’ ప్రారంభం !… ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈ నెల 15నుంచి పలు రాష్ట్రాల్లో థియేటర్లు పునఃప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్ భయాలు ఇంకా పోక పోవడంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లను తెరవడానికి అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దేశంలోని అగ్రగామి మల్టీప్లెక్స్ సంస్థల్లో ఒకటైన ‘పీవీఆర్’ గురువారం నుంచి థియేటర్లను తెరవబోతున్నట్లు ప్రకటించింది. పధ్నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ మల్టీప్లెక్స్‌లను పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ప్రజారోగ్య భద్రతా దృష్ట్యా తాము పాటించే నియమాలపై పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్‌కుమార్ బిజ్లీ మాట్లాడుతూ…
‘దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పీవీఆర్ సంస్థకు 846 స్క్రీన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మాకు లభించిన అనుమతుల మేరకు నేటి నుంచి పధ్నాలుగు రాష్ట్రాల్లో 496 స్క్రీన్స్‌లో సినిమాల్ని ప్రదర్శించబోతున్నాం. ప్రభుత్వం సూచించిన యాభైశాతం ఆక్యుపెన్సీ నిబంధనల్ని ఖచ్చితంగా అమలుపరచనున్నాం. ప్రతి షో తర్వాత ఆడిటోరియాన్ని శానిటైజ్ చేయబోతున్నాం. ఆడిటోరియం లోపలికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎంట్రెన్స్‌లో టెంపరేచర్ పరీక్షించడంతో పాటు శానిటైజర్స్, మాస్కులు, గ్లోవ్స్ అందుబాటులో ఉంచబోతున్నాం. ఆడిటోరియంలో ఉష్ణోగ్రత 24-27 డిగ్రీల మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నాం. అప్పుడే వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశముంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి 65 ఏళ్ల వయసు పైబడిన వారికి, పదేళ్ల లోపు పిల్లలకు థియేటర్లలోనికి అనుమతిలేదు. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి తక్కువ ఖర్చుతో వారికి వినోదాన్ని అందించే ఏర్పాటు చేస్తున్నాం. బ్లాక్‌బాస్టర్-నాన్ బ్లాక్‌బాస్టర్ కేటగిరీల వారిగా మా టికెట్ రేట్లను నిర్ణయిస్తాం. ప్రస్తుతం బ్లాక్‌బాస్టర్ సినిమాలేవీ సిద్ధంగా లేనందున.. టికెట్ రేట్లను తగ్గించే యోచనలో ఉన్నాం. తక్కువ టికెట్ ధరలతోనే పాత చిత్రాల్ని ప్రదర్శించే ఆలోచనలో ఉన్నాం’ అని తెలిపారు.