వెండితెర ‘అల్లూరి’ ‘దేవుడులాంటి మనిషి’ అస్తమించారు!

తెలుగు తెర ‘అల్లూరి’, టాలీవుడ్ కౌబోయ్, ‘దేవుడులాంటి మనిషి’.. సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) ఇక లేరు. వయో భారం వల్ల సమస్యలే తప్ప.. ఆయనకు ఆరోగ్యపరమైన ఇతర ఇబ్బందులేమీ లేవు. కానీ ఈ మధ్య కాలంలో వరుసగా.. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముగ్గురు కుటుంబ సభ్యులు విజయ నిర్మల , పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తర్వాత మొదటి భార్య ఇందిరా దేవి మృతి…  అదే సమయంలో తన ఆప్తమిత్రుడైన రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా తనని వీడి వెళ్లిపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ పరిణామాలు కృష్ణను మానసికంగా కృంగదీయడంతో.. ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై కూడా పడింది.

తెలుగు వారి గుండెల్లో 350కి పైగా చిత్రాలతో  సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఘట్టమనేని కృష్ణ.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 31మే, 1943న తొలి సంతానంగా జన్మించారు. హనుమంతరావు, నిర్మాత ఆదిశేషగిరిరావులు కృష్ణ సోదరులు. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు 5 గురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు , పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. పెద్దకొడుకు రమేష్ బాబు తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించి, అనంతరం నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. రెండో కొడుకు మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె పద్మావతి.. అమరరాజా బ్యాటరీస్ ఎండీ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భార్య. రెండో కుమార్తె మంజుల దర్శకనిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మూడో కుమార్తె ప్రియదర్శని హీరో సుధీర్ బాబు భార్య.

కృష్ణ తొలి చిత్రం అనగానే అందరికీ తేనెమనసులు (1965) చిత్రం గుర్తొస్తుంది. అయితే.. అంతకుముందే ఆయన కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. ఆ తర్వాత తేనెమనసులు (1965) చిత్రంతో పూర్తి స్థాయిలో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు).. ఇలా ప్రతీది కృష్ణ పేరిటే ఉన్నాయంటే.. తెలుగు సినిమా చరిత్రలో ఆయన స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొత్త దర్శకులని, కొత్త నిర్మాతలని ఎందరినో ఆయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పలు సినిమాలను కృష్ణ నిర్మించారు. సినిమాలే కాకుండా కృష్ణ రాజకీయాలలోనూ …  1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే కృష్ణ మనస్తత్వానికి రాజకీయ వాతావరణం అంతగా సరిపడకపోవడం, రాజకీయాలలో తనని ప్రోత్సహించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తదితర పరిణామాల తో  రాజకీయాలకు స్వస్తి చెప్పారు.

‘అల్లూరి సీతారామరాజు’ కృష్ణ కెరీర్‌కే కాదు… చిత్ర పరిశ్రమకూ ఎంతో గర్వకారణం !.
‘తెలుగువీర లేవరా’ అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన వెండితెర ‘అల్లూరి’ అస్తమించారు. కృష్ణ నటించిన 350కు పైగా చిత్రాల్లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నప్పటికీ ఆయన హీరోగా నటించిన వందవ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ మాత్రం ఆయన కెరీర్‌కే కాదు… చిత్ర పరిశ్రమకూ ఎంతో ప్రత్యేకం. అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందిన చిత్రమిది. ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అంటే సూపర్‌స్టార్‌ కృష్ణే గుర్తొస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకుల మదిలో ఆ పాత్ర నాటుకుపోయింది. ఈ చిత్రాన్ని ఓ మణిపూసగా చెబుతారు….

కృష్ణ నటించిన 12వ చిత్రం ‘అసాధ్యుడు’ చిత్రంతో అంతర్నాటకంలో కృష్ణ అల్లూరిగా నటించినప్పుడు, ఆ విప్లవ వీరుని కథని సినిమాగా మలచాలనే ఆలోచన వచ్చింది. అంతకు ముందు జగ్గయ్య ఆలుమగలు చిత్రంలో పోషించిన అల్లూరి పాత్ర కూడా కృష్ణకు ఒక స్ఫూర్తి. అక్కినేని నాగేశ్వరరావుతో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు ప్రయత్నాలు చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అదే ఆలోచన ఎన్టీఆర్‌కీ వచ్చింది. నాటక రచయిత పడాల రామారావుతో స్ర్కిప్టు కూడా సిద్ధం చేయించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తర్వాత శోభన్‌బాబు కూడా ఇదే ప్రయత్నం చేశారు. దేవదాసు నిర్మాత డి.ఎల్‌. శోభన్‌బాబుతో ఈ సినిమా తీయాలని చూసినా, అది కూడా కాలేదు. అప్పుడప్పుడే సినిమాల్లో హీరోగా నిలదొక్కుకుంటూ ఉండటంతో తన పథకాన్ని మనసులోనే ఉంచుకుని సమయం కోసం చూశారు కృష్ణ. త్రిపురనేని మహారథితో స్ర్కిప్టు రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం కట్టారు. మహారథి అప్పట్లో చాలా బిజీ రైటర్‌. ఈ చిత్రం కోసం ఆయన అంగీకరించిన చాలా చిత్రాలను కాదనుకున్నారు. ఆ యోధుడి గురించి పరిశోధన మొదటుపెట్టి కథ తయారు చేశారు.

1973 డిసెంబరు 12న సినిమా ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. పద్మాలయా సంస్థకు ఆస్థాన కెమెరామెన్‌ వి.ఎస్‌.ఆర్‌. స్వామి, మన్య ప్రాంతంలో సినిమా షూటింగు జరిపే పక్షంలో సినిమాస్కోప్‌లో చిత్రాన్ని నిర్మిస్తే అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారు. సాహసాలు చేయడానికి వెనకాడని కృష్ణ అప్పట్లోనే ముంబై నుంచి లెన్స్‌లు తెప్పించారు. విశాఖపట్నం సమీప అడవుల్లో రెండు నెలలపాటు షూటింగు చేేసందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామలింగేశ్వరరావు కృషి మాటల్లో చెప్పలేనిది. నాగరిక ప్రపంచానికి నలభైౖ మైళ్ళ దూరంలో కొండ, కోనల మద్య చింతపల్లిలో గృహవసతితో సహా యూనిట్‌ మొత్తానికి సౌకర్యాలను కల్పించేరు. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, అన్నవరం, కృష్ణదేవిపేట, మన్యప్రాంతాల్లో శీతకాలంలో నిర్విరామంగా దాదాపు రెండు నెలలు షూటింగ్‌ జరిపారు. నటీనటులతోపాటు సాంకేతిక సిబ్బంది కూడా ఒక అనిర్వచనీయమైన భావావేశంతో చిత్ర నిర్మాణాన్ని సక్సెస్‌ చేశారు. . తొలిప్రయత్నంలోనే షాట్‌ ఒకే అయ్యేది. ఇది ఒక చిత్రమైన అనుభూతిగా ఉండేదని గంటందొరగా నటించిన గుమ్మడి చెబుతుండేవారు. మన్యంలో షూటింగు జరిగినన్ని రోజులు మహారథి ఒకపూట మాత్రమే భోజనం చేేసేవారు. పతాక సన్నివేశానికి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి ఒకరోజు దూరంగా వెళ్లి సాయంకాలం వరకూ రాలేదు. అంతవరకూ కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, అల్లూరి సీతారామరాజు మరో ఎత్తు. ఈ చిత్రం కోసం కృష్ణ ఏకదాటిన 30 కాల్షీట్లు పనిచేశారు.

చిత్ర దర్శకుడు వి. రామచంద్రరావు కృష్ణ నటించిన మూడో చిత్రం గూఢచారి 116 చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌. కృష్ణ నటించిన ‘అసాధ్యుడు’ రామచంద్రరావుకి దర్శకుడిగా తొలి చిత్రం. తర్వాతి చిత్రం మరపురాని కథలో కూడా హీరో కృష్ణే. నేనంటే నేనే, అఖండుడు, కర్పూర హారతి, ఆస్తుల –అంతస్తులు వంటి 13 విజయవంతమైన కృష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామచంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించక ముందు.. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేశారు. అందుకే వీరిద్దరి బంధం బలమైనది. అయితే సినిమా చివరి దశ నిర్మాణంలో ఉండగా తన 47వ యేట ఫిబ్రవరి 14న రామచంద్రరావు మృతిచెందారు.

తర్వాత కృష్ణనే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించమని మహారథి అడిగినా దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌ దాసుకు ఆ పనులు అప్పగించారు కృష్ణ. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని తీసినా తన సినిమా విజయాన్ని కళ్లారా చూడకుండానే రామచంద్రరావు మరణించడం దురదృష్టకరం. ఈ సినిమా 17 కేంద్రాల్లో శతదినోత్సవంతో భారీ విజయాన్ని అందుకుంది. రిపీట్‌లో కూడా వందరోజులు ఆడిన మాయాబజార్‌, దేవదాసు చిత్రాల జాబితాలో అల్లూరి సీతారామరాజు స్థానం దక్కించుకుంది. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తీయడం ఇష్టం లేని ఎన్టీఆర్‌ ప్రత్యేక షో చూసి కృష్ణను అభినందించారు. ఆ తర్వాత తను తీయాలనుకున్న చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఉత్తమ గీత రచన బహుమతి లభించింది. తెలుగు సినిమాకు ఇలాంటి పురస్కారం రావడం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి బంగారు నందిని బహూకరించింది. ఆఫ్రో–ఏషియన్‌ చలన చిత్రోత్సవంలో కూడా అవార్డు అందుకొంది. ఈ చిత్రాన్ని హిందీలో ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ పేరిట అనువదించి విడుదల చేశారు.స్వర్ణోత్సవం సందర్బగా సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజును కృష్ణ సత్కరించారు.

పి.ఆదినారాయణరావు సంగీతం అందించిన పాటలు ఈ చిత్రానికి ఆణిముత్యాలుగా చెబుతారు. శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజులు ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. ‘రగిలింది విప్లవాగ్ని ఈరోజు.. ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు’ అనే ఆరుద్ర గీతాన్ని బాలు ఆలపించారు. ఈ పాటను బెర్లిన్‌లోని హంబోల్డ్‌ విశ్వవిద్యాలయ ఆర్కైవ్స్‌లో భద్రపరిచారు. సినిమా టైటిల్స్‌ పడేటప్పుడు ఈ పాట నేపథ్యంలో వినిపిస్తుంది. సుశీల పాడిన సి.నారాయణరెడ్డి గీతం ‘వస్తాడు నారాజు ఈరోజు..’ శ్రీ రాగంలో రూపుదిద్దుకుంటే, విజయనిర్మలపై ఆ పాట చిత్రీకరణ ఒక అద్భుతమనే చెప్పాలి. మూడు గంటల్లో ఈ పాటను చిత్రీకరించారు. కొచ్చాడయన్‌ చిత్రానికి ఉపయోగించిన మోషన్ క్యాప్చరింగ్‌ టెక్నిక్‌ వచ్చేలా, ఆరోజుల్లో సాధారణ కెమెరాలతో వి.ఎస్‌.ఆర్‌. స్వామి చిత్రీకరణ జరపడం మేధావుల్ని సైతం ఆశ్చర్యపరచింది. కొసరాజు రాసిన ‘జంబైలే జోరు జంబరు హైలేసా’ పాట చంద్రమోహన్‌, మంజుల, జయంతి బృందంపై రోడ్డు రోలర్‌తో మన్యంలో బాట వేేస సందర్బంగా చిత్రీకరించారు. ‘ఏ దేవుడైన దిగివచ్చి ఆదుకోడా… ఈ దిక్కులేని వాళ్ల ఎతలు తీర్చిపోడా’ అనే చరణంలో సీతారామరాజు కాషాయ వస్త్రంలో ప్రత్యక్షం కావడం ఈ పాటకు హైలైట్‌. మరో కొసరాజు పాట ‘కొండదేవత నిన్ను కొలిచేమమ్మా కోటి కోటి దండాలు’ను చింతపల్లి అడవుల్లో వేసిన గుహ సెట్‌లో చిత్రీకరించారు. అవుట్‌ డోర్‌లో చిత్రీకరించిన మొదటి పాట ఇదే. అంతేకాదు. సినిమాస్కోప్‌ లెన్స్‌ పనిచేస్తున్న తీరు పరీక్షించేందుకు ప్రయోగం ఈ పాట మీదే చేశారు.

ఇక జాతీయ బహుమతిని తెచ్చిపెట్టిన శ్రీశ్రీ గీతం తెలుగు వీర లేవరా.. అంటూ సీతారామరాజు మన్యం ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెల్లదొరలపై తిరుగుబాటు చేేసందుకు సమాయత్తపరిచే పాట వందేమాతరం నినాదంతో ముగుస్తుంది. ఘంటసాల అస్వస్థతకు గురైన సమయంలో కూడా.. ఉద్రేకంగా ఆలపించిన అద్భుత గీతమిది. సినిమాలో ఆఖరి పాటను సంగీత దర్శకుడు ఆదినారాయణరావు స్వయంగా రాసి స్వరపరచిన ‘హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌ మెర్రీ మెర్రీ క్రిస్మస్‌’ పాటను ఆల్‌ ఇండియా రేడియో పాపులర్‌ సింగర్‌ రీటా తన బృందంతో పాడగా, ప్రముఖ బెంగాలీ నటీ నందితా బోస్‌, జగ్గయ్య, రాజనాల తదితర నటీనటులతో మన్యంలో చిత్రీకరించారు. కాంతారావు, పేకేటి, రావుగోపాలరావు, చంద్రమోహన్‌, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, కె.వి. చలం, విజయనిర్మల, మంజుల, పండరీబాయి వంటి తారలు నటించిన ఈ చిత్రం 1974 మే ఒకటో తేదీని విడుదలై ఘన విజయం సాధించింది. చిత్రమాలికలో ఓ మణిపూసగా నిలిచింది.