ప్రేమ వివాహమే చేసుకుంటాను. అయితే …

పెళ్లి కుదిరిందంటూ వచ్చిన ప్రచారంపై త్రిష స్పందించింది.దక్షిణాదిలో అగ్ర కథానాయిక అనిపించుకున్న త్రిష దీర్ఘ కాలంపాటు  తన హవాను కొనసాగించింది.   త్రిష ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగా వుంది. ఆ మధ్య త్రిషకి వరుణ్‌ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరగడం, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల అది రద్దు కావడం జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో తమిళనాడుకి చెందిన ఒక బిజినెస్‌మేన్‌తో త్రిషకి ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు వచ్చాయి. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుందని, అందుకోసం భారీస్థాయిలో షాపింగ్‌ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని గురించి త్రిష స్పందించింది. ”కొంతకాలంగా నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఇంకా నేను పెళ్లి గురించిన ఆలోచన చేయడం లేదు. ప్రేమ వివాహమే చేసుకుంటాను.. అయితే ఇంతవరకూ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడలేదు. అదే జరిగితే అందరికీ నేనే స్వయంగా చెబుతాను” అంటూ స్పష్టం చేసింది.

వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం…   

సంచలన తార త్రిష  నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో ప్రేమ, పెళ్లి దాకా వెళ్లి ఆగిపోయి… నటనపైనే దృష్టిసారిస్తోంది  ఈ బ్యూటీ.  మూడు పదులు దాటినా కథానాయకిగా రాణిస్తున్న త్రిష కమర్శియల్‌ చిత్రాల నాయకిగానూ, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల నాయకిగానూ రాణిస్తోంది. అలా నయనతార, అనుష్కల బాటలో పయనిస్తున్న త్రిషను ‘నాయకి’ చిత్రం నిరాశపరచింది. ‘నాయకి’ ఫ్లాప్‌ అయినా,  ఆ తరహా చిత్రాలు మరిన్ని ఆమెను వరించడం విశేషమే. అలా ‘మోహిని’, ‘గర్జన’ వంటి చిత్రాలతో యాక్షన్‌ సన్నివేశాల్లో దుమ్మురేపడానికి త్రిష సిద్ధమైంది.

ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ‘కొడి’ చిత్రం తరువాత తమిళ తెరపై కనిపించలేదు. అలాగని అవకాశాలు లేవని కాదు. చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు ‘మోహిని’, ‘గర్జన’, అరవిందస్వామికి జంటగా ‘చతురంగవేట్టై 2′, విజయ్‌సేతుపతి సరసన ’96’, ‘1818’ అనే మరో విభిన్న కథా చిత్రం అంటూ బిజీబిజీగా నటించేస్తోంది. అయితే చిత్ర నిర్మాణంలో జాప్యం వల్ల త్రిష చిత్రాల విడుదలలో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ నటించిన మోహిని, గర్జన, 96 చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నాయని సమాచారం. దీంతో త్రిష కూడా ఖుషీ అవుతోందట.