అచ్చం రాణిని చూస్తున్నట్లుగానే ఫీలవుతారు !

తాజాగా త్రిష ఓ సవాల్‌ని  స్వీకరించారు. ఓ పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడం త్రిష ముందు ఉన్న పెద్ద సవాల్‌. ‘ఈ పాత్ర చేయడం నీవల్ల అవుతుందా?’ అని సవాల్‌ విసిరే పాత్ర వస్తే.. ఎంత రిస్క్‌ అయినా తీసుకోవడానికి వెనకాడని నటీనటులు ఉంటారు.  మణితర్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలోని రాణి కుందవై పాత్ర కోసమే త్రిష హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవాల్సి వచ్చింది.

చెన్నైలోని ఓ హార్స్‌ రైడింగ్‌ స్కూల్‌లో గత నెల 26 నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టారు.ఐదు రోజుల్లో ‘ఇంట్రో టు హార్స్‌ బ్యాక్‌ రైడింగ్‌’ కోర్స్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత స్వారీ చేయడానికి ఫౌండేషన్‌ కోర్స్‌ మొదలుపెట్టారు. ఈ నెల 3 నుంచి 14 వరకూ ఈ కోర్స్‌ని కూడా విజయవంతంగా పూర్తి చేశారామె. ‘సర్టిఫికెట్‌ కూడా వచ్చేసింది’ అని ఆనందం వ్యక్తం చేశారు త్రిష. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులు త్రిషను మరచిపోయి తెర మీద కుందవైనే చూస్తున్నట్లుగా భావించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు ఆమె. ఇందులో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్‌ తదితరులు నటిస్తున్నారు.

అప్పటివరకు సింగిల్‌గానే… రెండు దశాబ్దాల క్రితం తెరంగేట్రం చేసిన చెన్నై చిన్నది త్రిష తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగింది. ఇరు భాషల్లోనూ దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించింది. 37 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ వివాహానికి మాత్రం దూరంగానే ఉంది. గతంలో చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం వరకు వెళ్లినా.. పెళ్లి పీటలెక్కక ముందే బ్రేకప్ జరిగిపోయింది. ఆ తర్వాత త్రిష కెరీర్‌పై దృష్టి సారించి వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే ఆమె పెళ్లిపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి త్రిష తాజాగా స్పందించింది. `నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితేనే నా వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది. అప్పటివరకు సింగిల్‌గానే ఉంటాను. అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే గడిపేస్తాన`ని త్రిష పేర్కొంది.

వెబ్‌ సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌… ఇప్పుడు అన్ని భాషల్లోనూ  డిజిటల్‌ హవా సాగుతోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో డిజిటల్‌ రంగానికి వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ రంగంవైపు మొగ్గుచూపుతున్నాయి. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం నటించేందుకు పచ్చజెండా ఊపుతున్నారు. సౌత్‌లో టాప్‌ హీరోయిన్స్‌ అయిన సమంత, కాజల్‌ అగర్వాల్, తమన్నా వంటి వారు సైతం డిజిటల్‌ రంగంవైపు అడుగులేశారు. తాజాగా మరో స్టార్‌ హీరోయిన్‌ త్రిష కూడా డిజిటల్‌ ఎంట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ టాక్‌. రామ్‌ సుబ్రమణ్యన్‌ దర్శకత్వం వహించనున్న ఓ తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు త్రిష అంగీకరించారట. తండ్రీ, కూతురు మధ్య జరిగే భావోద్వేగమైన కథతో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుందని సమాచారం.