స్టార్ హీరోలు భయపడుతుంటే.. వీరు ‘ఓకే’ అంటున్నారు!

స్టార్ హీరోలు కరోనా నేపథ్యంలో బయటకు రావడానికి కూడా భయపడుతుంటే… త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్‌కి హాజరవుతోందట. త్రిష సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించింది. కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా త్రిష తమిళంలో మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీ గా ఉంది. ప్రస్తుతం త్రిష నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆమె చేతిలో మరో నాలుగు ప్రాజెక్ట్ ఉన్నాయి. తమిళ్ లో త్రిష నటించిన ‘పారపాధమ్ విలయాట్టు’, ‘గర్జనై’ సినిమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. త్రిష మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తోంది . అలాగే ‘రాంగీ’, ‘షుగర్’ అనే సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ అప్‌కమింగ్ మూవీ ‘రామ్’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆగిన ’రామ్’ షూటింగ్ కేరళ లో మళ్ళీ ప్రారంభమైంది. త్రిష కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది. అందరు స్టార్లు కరోనా నేపథ్యంలో బయటకు రావడానికి కూడా భయపడుతుంటే త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్‌కి హాజరవుతోందట. దీంతో ఈ విషయం ఇప్పుడు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి త్రిష 37 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ వరుస ఆఫర్లు తో తన హవా నడిపిస్తోంది.
 
ముంబయి షూటింగ్‌లో కాజల్!
లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత కూడా కరోనా తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు చిత్రీకరణకు కఠినమైన మార్గదర్శకాలు, షరతులు విధించాయి. తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినా సెట్స్‌పైకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామని సీరియళ్ల షూటింగ్‌ మొదలు పెడితే.. చాలా మందికి కరోనా రావడంతో తాత్కాలికంగా వాటి షూటింగ్‌లు నిలిపేశారు. తాజాగా కాజల్‌ అగర్వాల్‌ ముంబయిలో షూటింగ్‌లో పాల్గొంది. అక్కడ సినిమా షూటింగ్‌లు మాత్రం ప్రారంభం కాలేదు. సీరియళ్ల చిత్రీకరణే ఈనెల 25 నుంచి మొదలైంది. కాజల్‌ మాత్రం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఓ ప్రకటన షూట్‌లో పాల్గొంది. సుమారుగా మూడు నెలల విరామం తర్వాత షూటింగ్‌లో పాల్గొడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పుడు మళ్లీ ప్రాణం లేచివచ్చినట్టు అనిపించిందని పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్‌ చేస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని తనకు అనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ కథానాయిక తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’, కమల్‌ చిత్రం ‘భారతీయుడు 2’ చిత్రంలోనూ నటిస్తోంది.