అలా చేయకుంటే ప్రేక్షకులకు బోర్‌ కొట్టేస్తా !

“కొత్త కథలు, కొత్త పాత్రలు చేయాలని ప్రత్యేక నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. ఇప్పటివరకూ చేసిన సినిమాలు, చేసిన పాత్రలు కాకుండా… ఇప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి. లేదంటే… ప్రేక్షకులకు నేను బోర్‌ కొట్టేస్తా”…. అని అంటోంది అందాల నటి త్రిష.
కొన్నేళ్లుగా ఓ నటి చిత్రపరిశ్రమలో ఉన్నప్పుడు… దర్శకులకు ఆమెపై నమ్మకం ఏర్పడుతుంది. ఆమె కోసం ప్రత్యేకంగా కథలు రాస్తారు. నా విషయంలోనూ అదే జరుగుతోంది. ఇట్స్‌ ఏ జర్నీ. ఇప్పుడు నేను చేస్తున్న రెండు మూడు సినిమాల్లో లిటిల్‌ బిట్‌ యాక్షన్‌ చేసే అవకాశం దొరికింది. నన్ను నమ్మి ఇటువంటి కథలతో నా దగ్గరకు వచ్చిన, వస్తున్న దర్శకులకు థ్యాంక్స్‌ చెప్పాలి. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని యాక్షన్‌ కథలు రాస్తున్న దర్శకులు అందరికీ థ్యాంక్స్‌ చెప్పాలి. ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు ఆలోచించే విధానం మారాలి.
ఐ లవ్‌ కమర్షియల్‌ సినిమా! …నా దృష్టిలో సినిమాలు కమర్షియల్‌గా ఉండాలి. నిర్మాతలకు లాభాలు తీసుకురావాలి. లాభాలు వస్తే నిర్మాతలు సంతోషంగా ఉంటారు. ఆయనతో పాటు చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అది చాలా చాలా ముఖ్యం. నాతో మీరూ ఏకీభవిస్తారని ఆశిస్తున్నా. ముందు నుంచీ కమర్షియల్‌ సినిమాలంటే నాకిష్టమే. ఎందుకంటే… ఆరేళ్ల పిల్లల నుంచి అరవైయేళ్ల పెద్దల వరకూ కమర్షియల్‌ సినిమాలను ఇష్టపడతారు. అదే సమయంలో కొంచెం స్క్రిప్ట్‌ గురించీ నేను ఆలోచిస్తా. కమర్షియల్‌ కథలో నా క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఉందనేది కీలకం.
రోల్‌ ఏదైనా నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. దర్శకులు నా పాత్రను, నటనను చూసే విధానంలోనే అంతా ఉంటుంది. నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి ఈ మాటే చెబుతున్నా. తెలుగులో నా తొలి సినిమా ‘వర్షం’ నుంచి ‘మోహిని’ వరకూ… దర్శకులందరూ నేను ఏ పాత్రలోనైనా నటించగలనని నమ్మారు. వాళ్ల నమ్మకమే నేను వైవిధ్యమైన పాత్రలు చేయడానికి, ప్రేక్షకుల్లో నాపై ఇంత అభిమానం ఏర్పడటానికి కారణం!
ఐ వాంట్‌ టు డు ఎ పీరియాడిక్‌ ఫిల్మ్‌
ఆల్మోస్ట్‌ అన్ని జానర్‌ చిత్రాల్లోనూ నటించా. చారిత్రక చిత్రాలు మాత్రం చేయలేదు. ఐ వాంట్‌ టు డు ఎ పీరియాడిక్‌ ఫిల్మ్‌. ఆ నగలు, బట్టలు వేసుకుని ఒక్క సినిమా చేయాలనుంది! ఫాంటసీ పీరియాడిక్‌ ఫిల్మ్‌ చేస్తే భలే ఉంటుంది.
జయలలిత అమ్మ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే… మరో ఆలోచన లేకుండా అంగీకరిస్తా. ఆమె చదువుకున్న చర్చిపార్క్‌ స్కూల్‌లోనే నేనూ చదివా. విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఆమె అంటే నాకెంతో ఇష్టం. ఒకసారి స్కూల్‌ ఫంక్షన్‌కి అమ్మ చీఫ్‌ గెస్ట్‌గా వచ్చారు. తర్వాత ఆమె చేతుల మీదుగా నేను ఒక అవార్డు అందుకున్నా. మహిళగా ఆమె ఎందరికో స్ఫూర్తి. అటువంటి వ్యక్తి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను.