ఈ ఏడాది కూడా అదే సక్సెస్‌ కొనసాగిస్తా !

ఏ రంగంలోనైనా విజయాలే కెరీర్‌ను నిర్ణయిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజం చెప్పాలంటే  చెన్నై చిన్నది త్రిష విజయాన్ని చూసి చాలా కాలమైంది. స్టార్‌ హీరోలతో నటించిన చిత్రాలే కాదు, ఎన్నో ఆశలు నింపుకుని నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు ‘నాయకి’, ‘మోహిని’ వంటి చిత్రాలు ఈ అమ్మడిని తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక టాలీవుడ్‌ ఈ బ్యూటీని దాదాపు మరిచిపోయిందనే చెప్పాలి. అలా విజయం కోసం తహతహలాడుతున్న సమయంలో వచ్చిన చిత్రం ’96’. ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకి వచ్చిన ఈ చిత్రం త్రిషకు ఊహించని విజయాన్ని అందించిపెట్టింది. అంతే త్రిష పేరు మరోసారి కోలీవుడ్‌లో మారుమోగింది. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేని పాత్రలో త్రిష అభినయం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. అంతే, అవకాశాలు ఇప్పుడామె ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి.

“వచ్చే ఏడాది కూడా ఇదే సక్సెస్‌ను కొనసాగిస్తా”నంటూ అరడజను చిత్రాలతో సిద్ధంగా ఉంది. ఇటీవల తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఎక్కువ తమిళ చిత్రాలపైనే ఫోకస్‌ చేసింది. ‘గర్జనై’, ‘శతురంగ వేటై 2’, ‘1818’, ‘పరమ పదమ్‌ విలయట్టు’ వంటి తదితర చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే, అలాగే తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోనూ త్రిషే నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. రజనీకాంత్‌కు జంటగా ఈ సంచలన నటి నటించిన ‘పేట’ చిత్రం 2019 సంవత్సరానికి స్వాగతం పలికే విధంగా సంక్రాంతికి తెరపైకి రానుంది.
 
జీవా, శాలినిపాండే జంటగా నటిస్తున్న ‘గొరిల్లా’ చిత్ర నిర్మాణ సంస్థ తదుపరి త్రిష హీరోయిన్‌గా వరుసగా రెండు చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్రిష హీరోయిన్‌గా వరుసగా చిత్రాలు చేయనుండడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.  ఇప్పుడామె నటిస్తున్న కొన్ని చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. 35 వసంతాల ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తున్నా, కథ, పాత్ర నచ్చితేనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు, అలాంటి పాత్రలనే అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. మొత్తం మీద 2018 త్రిష జీవితంలో మరచిపోలేని సంవత్సరంగా గుర్తుండిపోతుంది.
2019 సంవత్సరంలోనూ పక్కాగా అరడజను చిత్రాలతో త్రిష సందడి చేయటం ఖాయం.