సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టేసా !

జయలలిత పాత్రలో నటించాలని ఆశ పడ్డానని, అయితే ఆ అవకాశం వేరెవరికో దక్కిందని చెబుతున్నారని” నటి త్రిష అంది. అయితే దానివల్ల తనకెలాంటి బాధ లేదని త్రిష పేర్కొంది.
జయలలిత బయోపిక్ ‘దిఐరన్ లేడీ’ లో నిత్యమీనన్ ప్రధాన పాత్రకు ఎంపికయ్యింది.
జీవితంలో ఒడిదుడుకులు అన్నవి ప్రతి వ్యక్తికి సహజం. అదేవిధంగా ఆశ పడినవన్నీ జరగవు కూడా. ఇందుకు త్రిష అతీతం కాదు. అయితే ‘జరిగేవన్నీ మన మంచికే’నని జీవితాన్ని ఎంజాయ్‌ చేసే వ్యక్తిత్వం కలిగిన ఈ ముద్దుగుమ్మ తను ఆ మధ్య పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన తన ప్రేమ వ్యవహారం గురించి లైట్‌గా తీసుకుని నటిగా కొనసాగుతోంది. ఇక ఈ మధ్య సరైన సక్సెస్‌లు కూడా లేకపోవడంతో మార్కెట్‌  కాస్త డల్‌ అయ్యింది. అలాంటి సమయంలోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల ఆశ నెరవేరే అవకాశం ‘పేట’ చిత్రంతో వచ్చింది. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేక పోతున్నాయి.
 
విజయ్‌సేతుపతితో త్రిష నటించిన ’96’ చిత్రం గురువారం తెరపైకి వచ్చి విజయవంతమైంది. దీంతో త్రిష చాలా ఉత్సాహంగా ఉంది. ఎంతగా అంటే… ‘సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టేశా’నని నమ్మకంతో చెప్పేంతగా. ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో తన భావాలను పంచుకుంటూ… రజనీకాంత్, విజయ్‌సేతుపతిలతో నటించాలన్న కోరిక నెరవేరిందని చెప్పింది.అంతే కాదు ‘మరో రౌండ్‌కు నేనూ రెడీ’ అయ్యాను అంది. రజనీకాంత్‌తో నటిస్తున్న ‘పేట’ చిత్రం కోసం తన బరువు, జుత్తు పొడవు తగ్గించుకున్నానని చెప్పింది. 
రజనీకాంత్‌ గురించి చెప్పాలంటే… సూపర్‌స్టార్‌ అన్న ఎలాంటి అహం లేకుండా చాలా నిరాడంబరంగా, అత్యంత సహజంగా నడుచుకుంటారని తెలిపింది. ‘మీతో నటించడం నా డ్రీమ్‌’ అని చెప్పగా ఆయన చిన్న దరహాసం చేశారని చెప్పింది. ఇకపోతే చాలా మంది అడుగుతున్న ప్రశ్న పెళ్లెప్పుడు? అని, అయితే ప్రస్తుతానికి పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. అదే విధంగా ఎవరినీ ప్రేమించడం లేదని అంది. బాయ్‌ఫ్రెండ్‌ కూడా లేడని చెప్పింది. 
మంచి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటి
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా రూపొందిన తమిళ సిన్మా ’96’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిన్మా… 1996 నాటి ప్రేమకథా నేపథ్యంలో నిర్మితమైంది. విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి మంచి రేటింగ్ లభించింది. తమిళనాట యూత్ అంతా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటి అంటున్నారు సినీ ప్రియులు. ఈ సిన్మా విడుదలకి ముందే దిల్ రాజు చూశారు, ఇది తప్పకుండా హిట్ అవుతుందని ఆయన భావించారు. అందువల్లనే ఈ సిన్మా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకొని వచ్చారు. ఈ సిన్మాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనులను అప్పుడే ప్రారంభించారు. గత కొంతకాలంగా పరాజయాలను చవిచూస్తున్న దిల్ రాజు… ’96’ సిన్మాతో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.