వ‌చ్చే ఏడాది అంతా త్రిష సంద‌డే… సందడి!

త్రిషకు ’96’ చిత్రంతో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ‘96‘ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల కోరిక ‘పేట’ చిత్రంతో నెరవేరింది. ఈ రెండు చిత్రాల హిట్‌తో త్రిష పేరు మరోసారి ఫోకస్ లోకి వచ్చింది. ఆమె నటించిన మూడు నాలుగు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 2020 త్రిష మరోసారి ఓ ఊపు ఊపే అవకాశం కనిపిస్తోంది .
త్రిష గతంలో నటిగా కోలీవుడ్‌లో వెలిగిపోతూనే, తెలుగులోనూ పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. అయితే ఎవరికైనా జీవితంలో గానీ, వృత్తిలో గానీ వడిదుడుకులు సాధారణం. అందుకు త్రిష అతీతం కాదు. నటిగా వరుస ఫ్లాప్‌లతో సతమతం అయ్యింది.పలు చేదు అనుభవాలను చవిచూసింది.
డూప్‌ లేకుండా పోరాటాలు
త్రిష కథానాయికగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రాంగి’. విదేశీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో మొండితనం, ధైర్యసాహసాలున్న యువతిగా త్రిష కనిపిస్తుంది. పోలీస్ అధికారిణిగా, ఖైదీగా భిన్న పార్శాల్లో ఆమె పాత్ర నడుస్తుంది. ఈ సినిమా కోసం బైక్‌రైడింగ్‌తో పాటు యుద్ధవిద్యల్లో త్రిష శిక్షణ తీసుకుందని, డూప్‌లు లేకుండా… ఆమెపై తెరకెక్కించిన పోరాట సన్నివేశాలు అలరిస్తాయట. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మిస్తున్న ‘రాంగీ‘ ఒకటి. దీనికి ఏఆర్‌.మురుగదాస్‌ కథ, కథనాలను అందించడం విశేషం. ‘జర్నీ’ ఫేమ్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అలాగే, మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ‘పొన్నియన్‌ సెల్వన్‌‘ చిత్రంలో నటించే అవకాశం త్రిషను వరించింది. అత్యంత భారీబడ్జెట్‌లో రూపొందుతున్న ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి,విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యరాయ్‌ … ఇలా భారీ తారాగణమే నటిస్తున్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే థాయ్‌ల్యాండ్‌లో నిరాడంబరంగా ప్రారంభమైంది.
 
త్రిష గతేడాది ‘హే జూడ్‌’ చిత్రంతో మలయాళంలో తొలి సినిమా చేసింది. ఈ సినిమాలో త్రిష నటనకు అక్కడ మంచి మార్కులే పడ్డాయి. మోహన్‌లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామ్‌’ అనే చిత్రంలో త్రిషను కథానాయికగా తీసుకున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ చేస్తున్న రామ్‌ పాత్రకు భార్యగా త్రిష కనిపిస్తుంది.
 
మెగా చాన్స్‌ కొట్టేసింది!
తెలుగులో చాలా గ్యాప్‌ తరువాత ఒక మెగా చాన్స్‌ను త్రిష అందుకుందని సమాచారం. త్రిష ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరు. టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న త్రిష ఇప్పుడు త‌మిళ సినిమాల‌కే ప‌రిమిత‌మైంది. అయితే కొర‌టాల శివ‌- చిరంజీవి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంతో మ‌ళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చిత్ర‌బృందం త్రిష‌ని సంప్ర‌దించింద‌ని…ఆమె చిరు 152వ చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. ఇలా మరోసారి దక్షిణాలో మరో రౌండ్‌కు సిద్ధమైన త్రిష మహా జోరులో ఉంది. హీరొయిన్ గా 17 వసంతాలను పూర్తి చేసుకుంది.వ‌చ్చే ఏడాది అంతా త్రిష సంద‌డే…సందడి.