చాలా కాలం త‌ర్వాత ప్రియాంక మ‌ళ్ళీ వస్తోంది !

తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు ఉపేంద్ర‌. ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాలు తీసి అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు ఈ క‌న్న‌డ స్టార్‌. అయితే కొన్నాళ్ళుగా తన సినిమాల‌లో కాస్త స్పీడ్ త‌గ్గించాడు ఉపేంద్ర . రాబోయే ఎన్నికల్లో  కర్ణాటక  రాష్ట్ర ఎన్నికల్లో  సొంత పార్టీ  పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఉపేంద్ర నిర్ణయించుకున్నాడు . కాని ఆయ‌న భార్య మాత్రం చాలా స్పీడ్ మీదున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త ఏడాది ‘చిన్నారి’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందు     కొచ్చింది ఉపేంద్ర భార్య ప్రియాంక‌. తెలుగు, క‌న్న‌డ‌లో ఏక‌కాలంలో రూపొందిన ఈ చిత్రానికి లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హ‌ర‌ర్ నేప‌థ్యంలో చైల్డ్ సెంటిమెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కింది.

ఇక ఇప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మయ్యింది ప్రియాంక‌. 2004లో ప్రియాంక న‌టించిన ‘జ‌న‌నం’ అనే చిత్రం విడుద‌ల కాగా, 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్రియాంక మ‌ళ్ళీ త‌మిళ చిత్రంలో న‌టించ‌నుంది. ‘హౌరా బ్రిడ్జ్’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ మూవీ కోల్‌క‌తాలో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంగా తెర‌కెక్క‌నుంది. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. త‌మిళ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇక ఇదిలా ఉంటే ఉపేంద్ర‌- ప్రియాంక‌ల కూతురు ఐశ్వ‌ర్య కూడా త్వ‌ర‌లోనే వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.