అంతా మాస్‌ మసాలా… ‘గద్దలకొండ గణేష్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

14 రీల్స్ ప్ల‌స్‌ పతాకం పై హ‌రీశ్ శంక‌ర్‌ దర్శకత్వం లో రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధలోకి వెళ్తే… అభి (అథ‌ర్వ‌)కి సినిమాలంటే పిచ్చి. జీవితంలో ఇంకో ఉద్యోగం చేసుకుని రాజీప‌డ‌టం అత‌నికి నచ్చదు. అందుకే త‌న‌కు న‌చ్చిన సినిమా ద‌ర్శ‌క‌త్వం చెయ్యాలని.. త‌న జ‌ర్న‌లిస్ట్ బాబాయ్ స‌హాయంతో ఓ ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా చేరుతాడు. సెట్లో ఒక‌రోజు అవ‌మానం జ‌రుగుతుంది. ఏడాది తిరిగేలోపు సినిమా చేస్తానంటూ స‌వాలు చేసి వ‌చ్చేస్తాడు. ఓ విల‌న్ క‌థ‌తో సినిమా తీయాల‌ని అనుకుని నేర చ‌రిత్ర ఉన్న వాళ్ల కోసం జైళ్ల చుట్టూ తిరుగుతుంటాడు. గ‌ద్ద‌ల‌కొండ‌లో ఓ వ్య‌క్తి ఉన్నాడ‌ని తెలిసి.. అక్క‌డికి వెళ్లే స‌రికి అత‌న్ని గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వ‌రుణ్‌తేజ్‌) హ‌త్య చేసి ఉంటాడు. ఆ గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌ రౌడీ షీట‌ర్ అనీ.. అత‌నంటే జనానికి హ‌డ‌ల్ అనీ.. లోక‌ల్ ఎమ్మెల్యే స‌పోర్టర్ అని తెలుస్తుంది. అనారోగ్యం పాలైన ఎమ్మెల్యే కొడుకు (వంశీ)కి సహాయం చేస్తాడు గ‌ణేష్‌. గ‌ణేష్ గురించి మొత్తం తెలుసుకున్న అభి, అత‌ని వ్య‌క్తి గ‌త జీవితాన్ని గురించి తెలుసుకోవ‌డానికి బుచ్చ‌మ్మ‌(మృణాళిని)ని ప్రేమిస్తున్న‌ట్టు న‌టిస్తాడు. చివ‌రికి అత‌ను గ‌ణేష్‌కి ద‌గ్గ‌ర‌వుతాడు. గ‌ణేష్ గ‌త జీవితాన్ని..ప్రేమ‌ను..అత‌ని ద్వారానే తెలుసుకుంటాడు. దాంతో `సీటీమార్‌` అనే సినిమా చేస్తాడు. ఆ సినిమా షూటింగ్‌లో ఉండ‌గా గ‌ణేష్‌కి బుచ్చ‌మ్మ మీద మ‌న‌సు కలుగుతుంది. అయితే అప్ప‌టికే అభితో ప్రేమ‌లో ఉన్న బుచ్చ‌మ్మ‌ అతనితో వెళ్లిపోతుంది. ఆ విష‌యం తెలుసుకున్న గ‌ణేష్ ఏం చేశాడు? అనేది మనం సినిమాలో చూడాలి…

విశ్లేషిస్తే… ‘త‌మిళంలో హిట్ అయిన సినిమా జిగ‌ర్తాండ‌. ఆ సినిమాకు రీమేక్‌గా `వాల్మీకి`ని తెర‌కెక్కించారు.ఆఖరు నిముషం లో `వాల్మీకి`ని ‘గద్దలకొండ గణేష్’ గాపేరు మార్చారు. ఈమూవీకి ‘గబ్బర్ సింగ్’ ఫార్ములా మరోసారి అప్లై చేసిన హరీష్ కొంత మేర విజయం సాధించినా, ‘జిగర్తాండ’ మూవీ విజయానికి కారణమైన ఎమోషన్స్ మిస్ అయ్యారు. కొన్ని కథలను సరిగ్గా మార్చి తీయకుంటే మొదటికే మోసం వస్తుంది. హీరోయిజం ఎలివేషన్ కోసం హరీష్ చేసిన మార్పులు సినిమా మూలాన్ని దెబ్బతీశాయి.మూవీకి ప్రధాన బలమైన క్లైమాక్స్ లో ఎమోషన్స్ తెరపై కనిపించలేదు.ఒక పర్ఫెక్ట్ క్లాసిక్ స్టోరీ కి హరీష్ చేసిన అదనపు హంగులు ఆకట్టుకోవు. వరుణ్ మాస్ గెటప్ చూసి భారీ పోరాటాలు ఉంటాయని ఆశించినవారికి .. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా చెప్పుకోదగ్గది లేకపోవడం నిరాశకు గురిచేస్తుంది. గంభీరం గా కనిపించే తేజ్ సినిమాలో వచ్చివెళ్లే పాత్రలా అనిపిస్తుంటాడు కానీ, సినిమాలో భాగం అన్న భావన కలగదు.
అవ‌కాశం – క‌ష్టం గురించిన డైలాగులు, సినిమాకు సంబంధించిన డైలాగులు, కాంప్ర‌మైజ్‌-అడ్జ‌స్ట్ మెంట్ గురించి త‌నికెళ్ల‌భ‌ర‌ణి చెప్పే డైలాగులు అర్థ‌వంతంగా అనిపించాయి. హ‌రీష్ శంక‌ర్‌ అవకాశం ఉన్న ప్ర‌తి చోటా త‌న మార్కు డైలాగు చెప్ప‌డానికే ప్ర‌య‌త్నించాడు .ఇందులో బిందెలతో తెర‌కెక్కించిన ‘ఎల్లువొచ్చి గోదార‌మ్మ’ ప్ర‌త్యేక పాట‌ పాత రోజులను గుర్తుచేసింది. అయితే,పాత పాట‌లో ఉన్నంత మాధుర్యం ఇందులో లేదని అనిపించింది. ఇంకా బాగా తీయాల్సిందని ప్రేక్షకులు ఫీలయ్యారు. ఆ పాట‌లో వ‌రుణ్‌, పూజా మాత్రం చాల బాగా చేసారు. మొదటిసగం అధర్వ, మృణాలిని రవి ల కెమిస్ట్రీ తో పాటు, సత్య కామెడీతో ఆహ్లదకరంగా సాగినా, సెకండ్ హాఫ్ నిరుత్సాహపరిచింది. మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు మాత్రం ఉన్నాయి.
 
నటవర్గం… ఇప్పటివరకు ఒక లవర్ బాయ్ ఇమేజ్ లో కనిపించిన వరుణ్ ఊర మాస్ గ్యాంగ్ స్టర్ పాత్రకు సరిపోయారు. ఒక కొత్త వరుణ్ ని తెరపై చూడవచ్చు.అతను తెలంగాణా మాండలికంలో చెప్పిన మాస్ డైలాగ్స్ బాగాపేలాయి. గద్దలకొండ గణేష్ పాత్రలో కొత్త అనుభూతి కలిగిస్తాడు. హీరోకి సమానమైన మరో పాత్ర చేసిన తమిళ నటుడు అధర్వ యంగ్ డైరెక్టర్ పాత్రలో చక్కగా చేసాడు. సీరియస్ సన్నివేశాలతో పాటు కమెడియన్ సత్య కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నారు. అదర్వకు జంటగా నటించిన మృణాలిని రవి చాలా అందంగా ఉంది. అధర్వ, మృణాళిని మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగాయి. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎనభైల నాటి రెండు జడలు, లంగావోణీలో పూజా హెగ్డే పక్కా తెలుగమ్మాయి లుక్ లో బాగుంది. తక్కువ నిడివి గల పాత్రలో షార్ట్ అండ్ స్వీట్ అన్నట్లు అనిపించింది.సెకండ్ హీరో అధర్వ స్నేహితుడిగా చేసిన సత్య కామెడీ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సత్య కామెడీతో బాగాఎంటర్టైన్ చేస్తాడు. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను కూడా తమదైన కామెడీ పండించారు.
సాంకేతికంగా… సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ తన గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం కొరకు అందించిన మాస్ బీట్స్ అంచనాలకు మించి బాగున్నాయి. ముఖ్యంగా ‘జర్రా…, జర్రా..’సాంగ్ తోపాటు వరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ‘వాకా వాకా’ సాంగ్స్ అలరించాయి.’జిగర్తాండ’ మూవీ స్పూర్తితో ఆయన చేసిన బీజీఎమ్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం అలరించింది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఎస్సెట్. అయాంక్ బోస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.ఎడిటింగ్ పర్వాలేదనిపించింది -రాజేష్