ఆహ్లాదకరం గా సాగిన ….. ‘ఫిదా’ చిత్ర సమీక్ష

                                         సినీవినోదం రేటింగ్ : 3/5
 

శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై శేఖ‌ర్ క‌మ్ముల‌ దర్శకత్వం లో దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు

అమెరికాలో డాక్టర్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్).. అన్న రాజా, తమ్ముడు బుజ్జితో కలిసి ఉంటుంటాడు. తల్లీ తండ్రి లేకపోవటంతో వరుణ్, బుజ్జిలే రాజాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఉండే రేణుక (శరణ్య ప్రదీప్) అనే అమ్మాయితో రాజా పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన వరుణ్, పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. భానుమతికి కూడా వరుణ్ అంటే ఇష్టం కలుగుతుంది.కానీ తన తండ్రిని వదిలి వెళ్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో వరుణ్ తన మామయ్య కూతురు శైలుతో క్లోజ్ గా ఉండటం చూసి మరింతగా దూరమవుతుంది. రాజా పెళ్లి తరువాత అన్నా వదినలతో కలిసి అమెరికా వెళ్ళినా వరుణ్, భానుమతిని మర్చిపోలేకపోతాడు. చివరకు భానుమతికి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ భానుమతి వరుణ్ కి నో చెపుతుంది. తరువాత వరుణ్, భానుమతి మనసు ఎలా గెలుచుకున్నాడు..? తండ్రి వదిలి వెళ్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ తో పెళ్లికి ఒప్పుకుందా..? అన్నది సినిమాలో చూడాలి ….
కొంత గ్యాప్ తరువాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన ముద్ర చూపించారు. తన స్టైల్ లోనే ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా సాగే కథలో అద్భుతమైన ఎమోషన్స్ పండించారు. ఇప్పటి వరకు కాలేజ్, కాలనీ బ్యాక్ డ్రాప్ లనే ఎక్కువగా ఎంచుకున్న శేఖర్, ఈ సినిమాతో తెలంగాణ పల్లెటూళ్లను మరింత అందంగా చూపించాడు. కేవలం పరిస్థితులు, యాస మాత్రమే కాదు… సాంప్రదాయాలను కూడా చాలా బాగా తెరకెక్కించాడు. అచ్చం మన ఇంట్లో, మన ఊరిలో ఉన్న అనుభూతిని కలిగిస్తూ ఫస్ట్ ఆఫ్ అంతా సాగుతుంది .
అయితే … సినిమాలో చెప్పుకోవడానికి అసలు కథ లేకపోవడం తో కేవలం చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలు, భావోద్వేగాలతో కథని నడిపించారు. సినిమా చూడ్డానికి బాగానే ఉన్నా, ల్యాగ్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. తొలిస‌గం కాస్త వేగంగానే సాగిన‌ట్టు అనిపించినా, మ‌లి స‌గం మాత్రం భారంగానే న‌డుస్తుంది. సెకండ్ హాఫ్ ఆడియన్స్ అనుకున్న స్థాయిని రీచ్ కాలేకపోయింది.క‌థ‌లో ఏ స‌న్నివేశ‌మూ కొత్త‌గా అనిపించ‌దు. ప్ర‌తిదీ మ‌నం ఇంత‌కు మునుపు ఇంకేదో సినిమాలో చూసిన‌ట్టే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా బ‌లంగా హ‌త్తుకోవు. అలాగే ఫైనల్ గా హీరో తన ప్రేమని సొంతం చేసుకునే విధానం అంత కన్విన్సింగ్ గా లేదు .
సినిమా ప్లస్ పాయింట్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ సాయి పల్లవి. తన పెర్ఫార్మెన్స్ తో థియేటర్ లో అందరిని కట్టిపడేసింది. ప్రతి చిన్న ఎమోషన్ ని కూడా అద్బుతంగా చూపిస్తూనే, కుటుంబం, ప్రేమ అనే బంధాల మధ్య నలిగిపోయే ఓ మామూలు అమ్మాయి పాత్రలో ని సంఘర్షణని చాలా బాగా చూపించింది. ఇక ఆమె కామెడీ టైమింగ్, తెలంగాణా యాసలో ఆమె సంభాషణలు పలికే విధానం. డాన్స్ … ఇలా అన్నింటా ‘భలే చేసింది’ అని అనిపించుకొని సినిమా రేంజ్ ని పెంచేసింది.
వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో అతని పెర్ఫార్మెన్స్ విషయంలో కాస్త లోటుపాట్లు కనిపించేవి . ఇందులో తన గత సినిమాలని మించి పరిణితి చెందిన పెర్ఫార్మెన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటాడు. ఇక హీరోయిన్ తండ్రిగా చాలా ఏళ్ల తర్వాత నటించిన సీనియర్ నటుడు సాయిచంద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు .రాజా, గీత , స‌త్యం రాజేష్ త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషించారు .
శేఖ‌ర్ క‌మ్ముల రాసిన డైలాగులు కొన్ని సందర్భాల్లో మెప్పిస్తాయి.విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. ఫోటోగ్రఫి చాలా బాగుంది. ఇప్పటి వరకు పల్లెటూరి వాతావారణం అంటే గోదావరి ప్రాంతం అందాలే తెలుగు సినిమాలో కనిపించేవి. ఇప్పుడు తెలంగాణలో కూడా పల్లెలు ఇంత అందంగా ఉంటాయా అనేట్టు చూపించాడు.బాన్సువాడ ప‌రిస‌రాలు ప‌చ్చ‌ప‌చ్చ‌గా చూడ్డానికి క‌నువిందుగా అనిపించాయి. అమెరికాలోని లొకేష‌న్లు కూడా బావున్నాయి. పాట‌లు కూడా పంటి కింద రాళ్ళ‌ల్లా కాకుండా క‌థ‌లో భాగంగా సాగుతాయి. శక్తికాంత్ అందించిన పాటలు సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ బాణీలో సాగే ‘వచ్చిండే..’ పాట విజువల్ గా కూడా చాలా బాగుంది . బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సంద‌ర్భాల్లో వీక్‌గా అనిపిస్తుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది రాజేష్