మరీ రొటీన్ రామా… ‘వెంకీమామ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్లపై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) దర్శకత్వంలో సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ…వెంక‌ట‌ర‌త్నం నాయుడు(వెంక‌టేశ్‌) గోదావ‌రి తీర ప్రాంతంలో ఓ ప‌ల్లెటూరులో మోతుబ‌రి రైతు . ఆయ‌న తండ్రి(నాజ‌ర్‌)ని అంద‌రూ ‘జాత‌క‌బ్ర‌హ్మ’ అంటుంటారు. జాత‌కాలు క‌ల‌వ‌వ‌ని తండ్రి చెప్పినా విన‌కుండా… అక్క‌ని, ఆమెకు నచ్చివాడికిచ్చి పెళ్లి చేస్తాడు వెంక‌టర‌త్నం. వారికొక కొడుకు పుడ‌తాడు. జాత‌కంలో ఉన్న‌ట్లే ఆ బాబు పుట్టిన ఏడాదికే కారు ప్ర‌మాదంలో తల్లి దండ్రులు చ‌నిపోతారు. దాంతో అనాథ అయిన మేన‌ల్లుడిని వెంక‌ట‌ర‌త్నం ..ఆ బిడ్డ‌ను పెంచ‌వ‌ద్ద‌ని తండ్రి ఎంత వారించినా విన‌కుండా, త‌నే అమ్మ‌, నాన్న‌గా పెంచి పెద్ద చేస్తాడు. మేన‌ల్లుడు కోసం మిల‌ట‌రీ ఉద్యోగానికి వెళ్లకుండా ఆగిపోతాడు. దాంతో అంద‌రూ వెంక‌ట‌ర‌త్నాన్ని ‘మిల‌ట‌రీ నాయుడు’ అని అంటుంటారు. మేన‌ల్లుడు కార్తీక్ శివ‌రాం(నాగ‌చైత‌న్య‌)కు కూడా మేన‌మామ అంటే ప్రాణం. ఆయ‌న కోసం లండ‌న్‌లో ఉద్యోగాన్ని..ప్రేయ‌సి హారిక‌(రాశీఖ‌న్నా)ని వ‌దులుకుంటాడు. త‌న కోసం పెళ్లి చేసుకోని మావ‌య్య కోసం కార్తీక్ పెళ్లి సంబంధాలు చూడటం మొద‌లు పెడ‌తాడు. మావ‌య్య‌కి, ఊరి టీచ‌ర్‌గా వ‌చ్చిన వెన్నెల‌ (పాయల్‌రాజ్‌పుత్) కి మ‌ధ్య ప్రేమ పుట్టేలా చేస్తాడు. మ‌రో ప‌క్క మేన‌ల్లుడు త‌న కోసం ప్రేమ‌ను వ‌దులుకున్నాడ‌ని తెలుసుకున్న వెంక‌ట‌ర‌త్నం.. అత‌ని ప్రేమ‌ను కూడా స‌క్సెస్ చేస్తాడు. అదే స‌మ‌యంలో అనుకోనివిధంగా…కార్తీక్ మామ‌య్య‌కు చెప్ప‌కుండా ఆర్మీలో చేరిపోతాడు. అస‌లు కార్తీక్ ఆర్మీలో ఎందుకు చేరుతాడు? అస‌లు మామ అల్లుళ్ల మ‌ధ్య ఏంజరిగింది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి…
విశ్లేషణ… జాత‌కాని కంటే మ‌నిషి ప్రేమ గొప్ప‌ద‌నే అంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. మామ‌, అల్లుడు మ‌ధ్య జాత‌కం వ‌ల్ల ఏర్ప‌డ్డ అగాథాన్ని ప్రేమ ఎలా జ‌యించింద‌నేదే క‌థ‌. నిజ జీవితంలో మామ అల్లుళ్లైన వెంక‌టేశ్‌, చైత‌న్య తెరపై కూడా అవే పాత్ర‌ల‌ను పోషించారు.ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా చూపించిన స‌న్నివేశాలు బావున్నాయి.ఫ‌స్టాఫ్ మామ అల్లుడి మ‌ధ్య అనుబంధం,వినోదం, భావోద్వేగాలు, హీరోయిజాన్ని బ్యాలెన్స్ చేస్తూ పక్కా కమర్షియల్ సినిమాగా చేసారు. వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు చాలావరకు వినోదాన్ని అందిస్తాయి.ఇద్ద‌రు హీరోలు, హీరోయిన్స్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌ బాగానే తెర‌కెక్కించారు.ఫ‌స్టాఫ్ కామెడీ, యాక్ష‌న్ తో స‌ర‌దాగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఎక్కువ సినిమా నడుస్తుంది. కశ్మీర్‌లో తెరకెక్కించిన సన్నివేశాలు బాగున్నాయి.. క్లైమాక్స్, దానికి ముందు వ‌చ్చే కొన్ని సన్నివేశాలు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. చిన్న పాయింట్‌ను సాగదీస్తూ చెప్పారు. ప్రేమ సన్నివేశాల్లో ద్వంద్వార్ధాలు ఎక్కువగానే వినిపిస్తాయి. మామాఅల్లుళ్లు దూరం కావడానికి కారణాల్ని బలంగా చెప్ప లేకపోయారు. ‘జాతకాలు అబద్ధం’ అనే కార్తిక్ ఒక్కసారిగా వాటిపై నమ్మకాన్ని పెంచుకోవడం కన్విన్సింగ్‌గా లేదు. ఫ‌స్టాఫ్ ఉన్నంతలా సినిమా సెకండాఫ్ ఆక‌ట్టుకోదు. ముఖ్యంగా క్లైమాక్స్ బాలేదు.

నటవర్గం… వెంక‌టేశ్ ప్రధాన బలంగా సినిమాను త‌న భుజాల‌పై మోశాడు. కామెడీ, ఎమోష‌నల్ సీన్స్‌లో వెంక‌టేశ్ ఎప్పటిలానే తన ప్ర‌త్యేకతను చూపించాడు. మామయ్య బాగుకోసం తపన పడే అల్లుడిగా నాగచైతన్య చక్కటి నటనను ప్రదర్శించాడు. లవర్‌బాయ్‌గా, సైనికుడిగా భిన్నపార్వాలతో అతడి పాత్ర కనిపిస్తుంది.ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధాన్ని చూపించిన స‌న్నివేశాలు బావున్నాయి. ప్రేమికుడి ఆలోచనల్ని గౌరవించే యువతిగా రాశీఖన్నా చేసింది. ఆమె త‌న గ‌త చిత్రాల‌కంటే.. గ్లామ‌ర్ డోస్ పెంచి ఈ చిత్రంలో న‌టించింది. ఇక పాయ‌ల్ రాజ్‌పుత్ టీచ‌ర్‌గా అతిథి లాంటి పాత్రలో కనిపిస్తుంది. కామెడీ కోసమే ఆమె పాత్రను సృష్టించారు. అవినీతి రాజకీయనాయకుడిగా రావురమేష్ తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. దాస‌రి అరుణ్‌,నాజ‌ర్‌, నాగినీడు, చ‌మ్మ‌క్ చంద్ర‌, అదుర్స్ ర‌ఘు, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు బాగా న‌టించారు.
 
త‌మ‌న్ సంగీతంలో వెంకీ, పాయ‌ల్ మ‌ధ్య వ‌చ్చే ‘రెట్రో సాంగ్‌’, ‘కొ కొ కోలా పెప్సీ’ సాంగ్ బావుంది. నేప‌థ్య సంగీతం ఓకే. పల్లెటూరితో పాటు కశ్మీర్ అందాలను తన కెమెరాతో అద్భుతంగా ఆవిష్కరించారు ఛాయాగ్రాహకుడు ప్రసాద్ మూరెళ్ల. డైలాగ్స్ కొన్ని సంద‌ర్భాల్లో బాగా పేలాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి -రాజేష్