15న విడుద‌లవుతోన్న ఎల్. రాధాకృష్ణ `తొలి ప‌రిచ‌యం`

వెంకీ, లాస్య జంట‌గా  ఎల్. రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పక్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం `తొలి ప‌రిచ‌యం`. ముర‌ళీ మోహ‌న్, సుమ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని డిసెంబ‌ర్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో…
సీనియ‌ర్ న‌టుడు, రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహన్ మాట్లాడుతూ, ` టైటిల్ లానే ఈ సినిమాతో చాలా మంది కొత్త వాళ్లు ప‌రిచ‌యం అవుతున్నారు. పేరుకే కొత్త‌వాళ్లు కానీ వాళ్లంతా అనభ‌వం ఉన్న వాళ్ల‌లా చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కొన్ని టీవీ సీరియ‌ల్స్ డైరెక్ట్ చేశారు. ఆయ‌న చేసిన `శివ‌రంజని` సీరియ‌ల్ లో నేను కూడా న‌టించాను. ఇప్పుడు ఆయ‌న  సినిమా డైరెక్ట్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఏ వ‌య‌సులో జ‌ర‌గాల్సింది ఆ అవ‌సులో జ‌రిగితేనే అందం. ముఖ్యంగా పెళ్లిళ్ల విష‌యంలో ఇప్ప‌టిత‌రం బాగా ఆల‌స్యం చేస్తున్నారు. అలా చేయ‌డం వ‌ల్ల జ‌రిగే న‌ష్టాలు..అన‌ర్ధాల‌ను సినిమాలో చ‌క్క‌గా చూపించారు. నేటి యువ‌త‌కు చ‌క్క‌ని సందేశాత్మ‌కంగా నిలుస్తుంది. రిటైర్డ్ స్కూల్ టీచ‌ర్ పాత్ర పోషించా. ఆ క్యారెక్ట‌ర్ చాలా కొత్త అనుభూతినిచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ నేను న‌టించిన  సినిమాల‌న్నింకంటే ఎక్కువ‌గా తృప్తినిచ్చిన సినిమా ఇదే. డిసెంబ‌ర్ 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. తెలుగు ప్రేక్ష‌కులంతా సినిమాను ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ మాట్లాడుతూ, `నేటి యువ‌త‌రం పెళ్లి అంటే వెనుక‌డుగు వేస్తున్నారు. మ‌హిళ‌ల ఆలోచ‌న కూడా అలాగే ఉంటుంది. అందుకు కార‌ణాలు చాలా ఉన్నాయి. ఆ విష‌యాల‌న్నింటిని బాగా స్ట‌డీ చేసి సినిమా చేసా. ‘పెళ్లి చేసుకుంటే త‌ప్పేంటి?’ అనే పాయింట్ ను హైలైట్ చేస్తూ తెర‌కెక్కించిన సినిమా ఇది. 80 శాతం షూటింగ్ పోల‌వారం, పాపికొండ మ‌ధ్య ప్రాంతంలో చేశాం. మిగిలిన భాగం హైద‌రాబాద్ లో పూర్తి చేశాం. ముర‌ళీ మోహ‌న్ గారు అడిగిన వెంట‌నే సినిమా చేస్తామ‌ని ఒప్పుకున్నారు. ఆయ‌న పాత్ర హైలైట్ గా ఉంటుంది. మిగిలిన పాత్ర‌లు కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటాయి. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఇది. ఈ నెల 15న భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది.` అని అన్నారు.
గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ మాట్లాడుతూ, `మూడు పాట‌లు అద్భుతంగా ఉంటాయి. చ‌క్క‌ని సాహిత్యానికి మంచి ట్యూన్స్ కుదిరాయి.  బిడ్డ‌పై త‌ల్లి ప్రేమ‌ను తెలుపుతూ ఇప్పటివ‌ర‌కూ మూడు పాట‌లు రాసారు. వాటిలో ఈ సినిమా కోసం రాసిన  లాలి జో పాట ఇంకా బాగుంటుంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.
చిత్ర  స‌హ నిర్మాతల‌లో ఒక‌రైనా ఎన్. సురేష్ కుమార్ మాట్లాడుతూ, `ద‌ర్శ‌కుడు మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చారు. తెర‌మీద క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. ముర‌ళీ మోహన్ గారి పాత్ర హైలైట్ గా ఉంటుంది` అని అన్నారు.
చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మాట్లాడుతూ, ` 3 పాట‌లున్నాయి. అన్నీ సంద‌ర్భానుసారంగా ఉంటాయి. చంద్ర‌బోస్  గారు రాసి లాలి జో పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది` అని అన్నారు.
ర‌ఘుబాబు, చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్, వైవా హ‌ర్ష‌, క‌ళ్లు కృష్ణారావు, ప్రీతీ నిగ‌మ్, మ‌ధుమ‌తి, రాగిణి, మాధ‌వి, దీప్తి న‌టిస్తున్నారు. ఈ  చిత్రానికి  పాట‌లు: చ‌ంద్ర‌బోస్, కాస‌ర్ల శ్యామ్, క‌రుణాక‌ర్, ఎడిటింగ్:  కృష్ణ పుత్ర‌, స‌హ నిర్మాత‌లు: ఎస్. సురేష్ కుమార్, ధ‌ర్మేంద్ర ముద్దాల నిర్మాత‌:  దీప‌క్ కృష్ణ‌న్, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎల్. రాధాకృష్ణ‌.