పెళ్ళయిన సంగతి చెప్పకపోతే బాగుండేదేమో అనుకున్నా!

‘పరిణీత’ సినిమా చేస్తున్నప్పుడు నాకు నిండా 24 ఏళ్లే. ఆ వయసులోనే నాకు ఒక పెద్ద వయసు మహిళ పాత్ర వేసే అవకాశం వచ్చింది. ఇక, 2018 నాటి కల్లా నేను ఒక నిర్ణయానికి వచ్చేశా. నటించడానికి సవాలుగా నిలిచే పాత్రలు మాత్రమే పోషించాలని తీర్మానించుకున్నా…. అని చెప్పింది విలక్షణ నటివిద్యాబాలన్.

ఆ పద్ధతిలోనే ‘ది డర్టీ పిక్టర్‌’ లో నటించా. అందులో చేసిన పాత్రకు నాకు జాతీయ అవార్డు రావడంతో చాలా ఆనందపడ్డా. ఆ సినిమా ట్రైలర్‌ రిలీజైనప్పుడు చాలామంది నాకు ఫోన్‌ చేసి, నన్ను అలాంటి పాత్రలో చూడాలని తాము అనుకోవడం లేదన్నారు. నిజం చెప్పాలంటే, నాకూ, ఆ ‘డర్టీ పిక్చర్‌’ చిత్రం ఎవరి జీవితకథ మీద ఆధారపడి తీశారో ఆ నటి సిల్క్‌స్మితకూ ఏ రకంగానూ పోలికలు లేవు. కానీ, ఆ చిత్ర దర్శకుడు మిలన్‌ లూథ్రియా నాతో ఒకటే మాట అన్నారు… ‘‘నువ్వు సిల్క్‌కు గౌరవం ఇస్తే, జనం నీ సిల్క్‌ పాత్రకు గౌరవం ఇస్తారు’’. అంతే. నేను ఆ మాట వేదంలా అనుసరించా. ఫలితంగా, ఆ సినిమాకూ, నా పాత్రకూ ఎంత పేరొచ్చిందో అందరికీ తెలుసు. ‘ది డర్టీ పిక్చర్‌’ సినిమా వల్ల నాకు జాతీయ అవార్డు మాత్రమే కాదు… నాకు మరో పెద్ద బహుమతి కూడా లభించింది. అది ఏమిటంటే… ప్రతి విషయంలోనూ అతిగా జడ్జమెంటల్‌గా లేకపోవడమనే వైఖరి అలవాటైంది. ఆ సినిమా నా ఆలోచనా ధోరణిని మార్చేసింది.

ఈ రంగంలో నేను చాలా ఎత్తుపల్లాలే చూశా. ఒక దశలో నా సినిమాలు అయిదు వరుసగా విజయం సాధించాయి. ఆ తరువాత వరుసగా అయిదు సినిమాలు ఫెయిలైపోయాయి. సరిగ్గా నా పెళ్ళయిన సమయం అది. పెళ్ళయిపోయిన కథానాయికలను చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండరని అందరూ అంటూ ఉంటారు. నా సినిమాల ఫెయిల్యూర్స్‌తో నేను కూడా ఆలోచనలో పడ్డా. అందరూ అనుకొనే మాటే నిజమేమో? అని భావించా. నాకు పెళ్ళయిన సంగతి బయటకు చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేదేమో అనుకున్నా. కానీ, అవన్నీ తప్పుడు అభిప్రాయాలని నాకు ఇప్పుడు అర్థమైపోయింది.
అలాంటి సినిమాలకే మరింత భవిష్యత్తు !
ఇప్పటికీ మహిళా ప్రధాన సినిమాలు, హీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషించే సినిమాలు అనగానే వాటిలో భారీగా డబ్బు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు. అయితే, రాబోయే రోజుల్లో అలాంటి సినిమాలకే మరింత భవిష్యత్తు ఉంది. ‘క్వీన్‌, తను వెడ్స్‌ మను, తుమ్హారీ సులూ’ లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ. ఏమైనా, ఇటీవల కొన్ని మంచి సినిమాలు తయారవుతున్నాయి. అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘ప్యాడ్‌ మ్యాన్‌’ అలాంటిదే.