మంచి న‌టుడిని కాదు కనుకనే, మంచి క‌థ‌లు ఎంచుకుంటా !

విజయ్‌ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్‌ మేరీ తారాగణంగా రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. జి.శ్రీనివాసన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్‌ బేనర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. న‌వంబ‌ర్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో విజ‌య్ ఆంటోనితో ఇంట‌ర్వ్యూ…

రాజ‌కీయాల‌తో సంబంధం లేదు…
– త‌మిళంలో ‘అన్నాదొరై’ అనే పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో `ఇంద్ర‌సేన` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నాం. ఇది త‌మిళ‌నాడు రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే సినిమా కాదు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌న్‌కు ఓ క‌వ‌ల స‌హోద‌రుడు ఉండేవాడు. త‌న నిజ జీవితంలో జ‌రిగిన ఘట‌న‌ను ఆధారంగా చేసుకుని శ్రీనివాస‌న్ డైరెక్ట్ చేసిన చిత్ర‌మిది. ఈ సినిమాలో ఏక కాలంలో ద్వి పాత్రాభిన‌యం చేశాను.

మంచి టెక్నిషియ‌న్‌ని…
ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీలో ద్విపాత్రాభిన‌యం చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. మ‌రో విష‌యం చెప్పాలంటే నేను మంచి న‌టుడిని కాదు. మంచి క‌థ‌ల‌ను ఎంచుకుంటాను. క‌థ‌కు త‌గిన విధంగా నా ఎమోష‌న్స్‌ను ప‌లికిస్తాను. నేను మంచి న‌టుడ్ని కాను కానీ మంచి టెక్నిషియ‌న్‌ని. నేను మంచి డ్యాన్స‌ర్‌ని కూడా కాను. రెండు మూడేళ్ల‌లో డ్యాన్స్ కూడా నేర్చుకుని సినిమాల్లో చేస్తాను. అలాగని నేను డ్యాన్స్ కోచింగ్ తీసుకోను. ఏరోబిక్స్‌, జుంబా ట్ర‌యినింగ్ తీసుకుంటాను. అది ఓ ర‌కంగా శారీర‌కంగా మ‌న‌కెంతో స‌హాయం చేస్తుంది.

బాగా ఆడితేనే క‌మ‌ర్షియ‌ల్ సినిమా…
– నేను సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనో, మ‌రేదో అని విభ‌జించి చూడ‌ను. సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారంటే నా దృష్టిలో అది క‌మ‌ర్షియ‌ల్ సినిమానే. ప్ర‌తి ఒక్క‌రికీ సినిమాలు తీయ‌డంలో ఒక్కొక్క పంథా ఉంటుంది. నా స్టైల్ ఆఫ్ మేకింగ్ మూవీస్ ఇవి. నటుడిగా నాకొక లిమిట్ ఉంది. అది నాకు తెలుసు. ఆ లిమిట్ దాట‌నంత వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను హీరోగా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. నేను ఒక సినిమాలో ఏం చెప్పాల‌నుకుంటున్నాన‌నేది నాకు బాగా తెలుసు కాబ‌ట్టే, ఓ న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నాను. ‘ఇంద్ర‌సేన’ సినిమా బాగా వ‌చ్చింది. ‘బిచ్చ‌గాడు’ సినిమా న‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు ఇంద్ర‌సేన త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.

టీజ‌ర్‌తో మోసం చేస్తున్నారు…
– ఈరోజుల్లో టీజ‌ర్ ప్రేక్ష‌కులను మోసం చేస్తుంది. ఎడిట‌ర్ స‌హాయంతో టీజ‌ర్‌ను ఎవ‌రైనా అందంగా క‌ట్ చేసే అవ‌కాశం ఉంది. అందుక‌నే నేను ప‌దినిమిషాల సినిమాను ముందుగా చూపిస్తే బావుంటుంది క‌దా! అని ఆలోచించి దానికి త‌గ్గ‌ట్లు సినిమాలో 10 నిమిషాల క‌థ‌ను రివీల్ చేశాను. అలా ప‌ది నిమిషాలు ముందుగానే చెప్ప‌డం వ‌ల్ల కొన్ని సినిమాల‌కు మెయిన్ క‌థాంశం రివీల్ అయ్యే అవ‌కాశం లేదు. `భేతాళుడు` సినిమాకు నేను ముందుగానే ప‌ది నిమిషాల సినిమాను విడుద‌ల చేశాను. దీని వ‌ల్ల సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అలాగే ఇంద్ర‌సేన‌కు కూడా చేశాను. దీంట్లో నేను ఎక్క‌డా అస‌లు క‌థ‌ను రివీల్ చేయ‌లేదు.

జిఎస్‌టిపై అభిప్రాయం…
– మ‌నది చాలా పెద్ద దేశం, జ‌నాభా కూడా ఎక్కువే. కాబ‌ట్టి ‘జిఎస్‌టి’ పై అభిప్రాయాన్ని ఒకేసారి చెప్ప‌లేం. జిఎస్‌టి వ‌ల్ల పాజిటివ్ ఏంటో, నెగ‌టివ్ ఏంటో తెలియాలంటే ఏడెనిమిదేళ్ళ స‌మ‌యం ప‌డుతుంది. కాగా ఈ సినిమాలో జిఎస్‌టిపై సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో నేను ఎవ‌రినీ విమ‌ర్శించ‌లేదు. అయితే సెన్సార్ బోర్డువారు అభ్యంతరం చెప్పారు. వారి రూల్స్ ప్ర‌కారం..జిఎస్‌టి అనే ప‌దం థియేట‌ర్స్‌లో విన‌ప‌డుకుండా తొలగించాం. కానీ ఆన్‌లైన్‌లో ఏ కంట్రోల్ లేక‌పోవ‌డంతో జిఎస్‌టి ప‌దం అలాగే ఉంటుంది.

పాత్రల గురించి…
– సినిమాలో ఇంద్ర‌సేన‌, రుద్ర‌సేన అన్న‌ద‌మ్ములు. ఇంద్ర‌సేన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను కొన్ని ప‌రిస్థితుల్లో కోల్పోతాడు. దాంతో మందు తాగుతూ దుఃఖ‌ప‌డుతూ ఉంటాడు. రుద్ర‌సేన ఓ స్కూల్‌లో పి.టి టీచ‌ర్‌. ఇత‌నికి జీవితంలో అనుకోకుండా ఓ స‌మ‌స్య వ‌స్తుంది. దాంతో అత‌నెలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? అదే స‌మయంలో ఇంద్ర‌సేన ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? అసలు వారికి వ‌చ్చిన స‌మ‌స్యేంట‌నేదే సినిమా.

ప్రేక్ష‌కుడిలాగానే ఆలోచిస్తా…
– నేను చేసే ప్ర‌తి ప్ర‌నిని ఓ ప్రేక్ష‌కుడిలాగానే ఆలోచిస్తాను. ఎంజాయ్ చేస్తూ ప‌నిచేస్తాను కాబట్టి… దేని గురించి కూడా ఆలోచించ‌ను. నా ప‌నిని సిన్సియ‌ర్‌గా చేయాల‌నుకుంటాను. ఏదో కావాల‌ని,పెద్ద‌గా ఎక్స్‌పెక్ట్ చేయ‌ను.

ఆ ఆలోచ‌న లేదు…
– యాక్టర్ గానే కొనసాగుతా. దర్శకులు మంచి స్క్రిప్ట్స్ తో వస్తున్నారు. యాక్టింగ్ అంటేనే ఇష్టం. నిర్మాణం పైన శ్రద్ధ వహిస్తున్నాను. మ్యూజిక్ కూడా చేస్తున్నాను. డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఇప్పట్లో లేదు. ప్ర‌స్తుతం న‌టుడిగా, నిర్మాత‌గానే బిజీగా ఉన్నాను. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ్యూజిక్ చేయాల‌నుకోవ‌డం లేదు.

తెలుగులో…
– కథలు వింటున్నాను. త్వరలో చెయ్యబోతున్నాను.కొద్దికాలం లో నిర్ణయం తీసుకొని వెల్లడిస్తాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌…
– ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తాను.