కామిడీతో తలకిందులైన ‘బీస్ట్’ చిత్ర సమీక్ష

సినీ వినోదం రేటింగ్ : 2.25/5

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్  దర్శకత్వంలో కళానిధి మారన్ (తెలుగు నిర్మాత దిల్ రాజు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ…  ‘రా’ ఏజెంట్ వీరరాఘవ (విజయ్) పాకిస్థాన్ టెర్రరిస్ట్ ఉమర్ ఫరూఖ్( లిల్లీపుట్ ఫరూకీ)ను పట్టుకొనే మిషన్‌ను టేకప్ చేసి విజయం సాధిస్తాడు. ఆ ఆపరేషన్ లో ఒక చిన్నపిల్ల చనిపోతుంది. తన వల్లే ఆ పాప చనిపోయిందనే బాధతో వీరరాఘవ ‘రా’ నుంచి బైటికి వచ్చేస్తాడు. కొన్నినెలల తర్వాత రాఘవకి ప్రీతి (పూజాహెగ్డే) పరిచయం అవుతుంది. ప్రీతి రాఘవతో ప్రేమలో పడుతుంది. ఆమె సహాయంతో ఒక సెక్యరిటీ ఏజెన్సీలో ఉద్యోగం కోసం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌కు వెళ్ళిన వీరరాఘవకు ఆ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్ చేశారని తెలుసుకుంటాడు. టెర్రరిస్ట్ ఉమర్ ఫరూఖ్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తారు. అదే మాల్‌లో ఉన్న వీరరాఘవ ఉగ్రవాదుల చెర నుంచి అక్కడి వారిని ఎలా కాపాడాడు? టెర్రరిస్టులకు, అతడికి జరిగిన ఘర్షణ… ఇలా మిగతా కథ సినిమాలో చూడాలి …

విశ్లేషణ… సీరియస్ సబ్జెక్ట్ ను కామెడీ కలిపి చెప్పాలనుకోవడం దర్శకుడు నెల్సన్ చేసిన పెద్ద పొరపాటు. దర్శకుడి తొలి రెండు చిత్రాల ఫార్ములాతో  విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేయాలనుకోవడంతో.. సినిమా ఇటు సీరియస్, అటు కామెడీ కాకుండా  తయారైంది. లాజిక్‌లేని అంశాలతో పరమ రొటీన్ కథతో ‘బీస్ట్’ సినిమా చేసాడు దర్శకుడు.  హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాల్లో లాజిక్‌లు వెతకడం కూడా తప్పే అవుతుందేమో. బీస్ట్ విషయంలో లాజిక్స్ అందనంత దూరంలో ఉంటాయి. విజయ్ బిల్డప్పులు, సాహసాల మధ్య పవర్ ఫుల్ విలనిజమే లేకుండా పోయింది. టెర్రరిస్టుల్ని వెర్రివాళ్ళను చేసి హైజాక్ డ్రామాను ఏదో చేసేసారు. ఇక లోపలున్న జనంలో భయమన్నదే  లేకుండా.. పిక్నిక్ కు వచ్చినట్టు కామెడీ చేస్తుంటే.. ఇంక ఆసక్తి  ఎక్కడుంటుంది? సినిమా ప్రారంభంలో  వచ్చే టెర్రరిస్ట్ మిషన్, పాప చనిపోయే సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. విజయ్ ఎంటర్ అయిన తర్వాత వచ్చే సన్నివేశాలు పరమరొటీన్‌గా, బోరింగ్ గా అనిపిస్తాయి. ‘అరబిక్ కుతు’ పాట మాత్రం ఆడియెన్స్ లో హుషారు నింపింది..

నటీనటులు… ‘బీస్ట్’ సినిమా అంతా కూడా వన్ మెన్ షోలానే ఉంటుంది. వీరరాఘవ గా విజయ్ ఓవరాల్ పర్మార్మెన్స్ చూపించాడు. పాటలో డాన్సులు, ఇతర క్యారెక్టర్లతో కలిసి కామెడీ, అదిరిపోయే యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. మ్యానరిజం, స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పిస్తాయి. విజయ్ సినిమాలో హీరోయిన్ ఉండాలి కనుక.. పూజా హెగ్డే ని పెట్టారని అనిపిస్తుంది. గ్లామర్ గా కనిపించినా ఆమె పాత్ర చాలా పేలవంగా అనిపిస్తుంది. రెండు పాటలకి తప్ప దేనికీ ఉపయోగపడలేదు. ఇక ఈ చిత్రంలో అల్తాఫ్ పాత్రలో దర్శకుడు సెల్వరాఘవన్ సీరియస్ పాత్రలోనూ నవ్వించాడు. వీటీవీ గణేశ్, యోగి బాబు నటించిన కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. యోగి బాబుతో వీలైనంత ఎక్కువ కామెడీ చేయించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కమెడియన్ పృథ్వీ తో పాటు ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. అనిరుద్ ఉన్న రెండు పాటలూ బాగా చేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గొప్పగా లేదు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి -రాజేష్