ప్రేమకు..ఆదర్శానికి మధ్య అవుట్… ‘డియర్ కామ్రేడ్’ సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25/5

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యానర్ల పై భ‌ర‌త్ క‌మ్మ‌ దర్శకత్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధలోకి వెళ్తే… వైజాగ్‌లో ఉండే చైత‌న్య అలియాస్ బాబీ(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్. త‌న క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే చూస్తూ ఊరుకునే ర‌కం కాదు. గొడ‌వ‌ల్లో ముందుండే దూకుడు స్వ‌భావాన్ని అత‌ని స్నేహితులు, త‌ల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. ఓసారి బాబీ వాళ్ల ఎదురింటికి వాళ్ల బంధువు అప‌ర్ణా దేవి అలియాస్ లిల్లీ(ర‌ష్మిక మంద‌న్న) వ‌స్తుంది. బాబీ, లిల్లీని ప్రేమిస్తాడు. లిల్లీ స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్‌. చివ‌ర‌కు లిల్లీ కూడా బాబీ ప్రేమ‌కు ఓకే చెబుతుంది. అయితే లిల్లీకి గొడ‌వ‌లంటే భ‌యం. దానికి దూరంగా ఉండ‌మ‌ని లిల్లీ చెప్పినా బాబీ వినిపించుకోడు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో బాబీకి దూరంగా లిల్లీ వెళ్లిపోతుంది. దాంతో బాబీ పిచ్చోడైపోతాడు. చివ‌ర‌కు దేశం మొత్తం టూర్ తిరుగుతాడు. సౌండింగ్ థెర‌పీ మీద రీసెర్చ్‌ చేస్తూ మూడేళ్లు ఇంటికి దూరంగా ఉంటాడు. బాబీ ఇంటికి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు, ఎలాంటి ప‌రిస్థితుల‌ను చూస్తాడు? లిల్లీని బాబీ క‌లిసిన త‌ర్వాత ఆమె మానసిక స్థితేంటి? లిల్లీ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది? చివ‌ర‌కు లిల్లీకి జ‌రిగిన అన్యాయంపై బాబీ ఎలాంటి పోరాటం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషిస్తే… ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయిన ‘మహిళలపై లైంగిక వేధింపులు’ అంశంతో తీసిన సినిమా ఇది. మ‌హిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్న‌స‌మ‌స్య‌ల‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ సినిమా మెయిన్ పాయింట్‌ను బాగానే ఎన్నుకున్నా.. కథనంలో మాత్రం ఫెయిల‌య్యాడు.సినిమాలో ఎక్క‌డా కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌దు. స్పీడ్ ఉండ‌దు. బ‌ల‌మైన ఎమోష‌న్స్ లేవు. డైలాగ్స్ ఒక‌ట్రెండు మాత్ర‌మే బాగున్నాయి. ప్రతీ సన్నివేశం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.
 
‘డియర్‌ కామ్రేడ్‌’ అసలు కథ అంతా ద్వితియార్ధంలోనే వుంటుంది. అది కూడా ఎప్పుడో క్లైమాక్స్ కి ముందు రివీల్‌ అవుతుంది.మొదటి భాగం ప్రేమ …రెండవ భాగం సామాజికం.. దీంతో మొదటి సగానికి, రెండవ సగానికి సంబంధం లేకుండా పోయింది. ఇక ఈ కథకి ఇచ్చిన ముగింపు కూడా కన్విన్సింగ్‌గా లేదు.చిత్రంలో ఏ సందేశాత్మక అంశాన్ని చర్చించారో దానిని హైలైట్‌ చేయాలి. కానీ ఆ అంశాన్ని విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ ని బేస్ చేసుకుని చెప్పాలని చూడడం వల్ల ఫెయిల్ అయ్యారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్‌ ట్రాక్‌ చాలా బాగా డీల్ చేసారు. అయితే కొన్ని రియలిస్టిక్‌ సీన్స్‌, లోకేషన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. పొయిటిక్‌ స్టైల్‌ టేకింగ్, నెరేషన్‌ ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ను మెప్పించినా అన్ని వర్గాలను అలరించటం కష్టమే.
 
నటవర్గం… విజ‌య్ దేవ‌ర‌కొండ కాలేజ్ స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టించాడు. ఆవేశపరుడైన చైత‌న్య అలియాస్ బాబీ పాత్రలో బాగా చేసాడు.ఒక‌వైపు కోపం పోరాటం చేయ‌డం, మ‌రో ప‌క్క ల‌వ‌ర్ బోయ్‌లా ఫ‌స్టాఫ్ మెప్పించాడు. విజయ్ దేవరకొండ యూత్‌కి నచ్చుతుందనే ఫీలింగ్‌ తో ‘అర్జున్‌రెడ్డి’ తరహాలో చాలానే ఇందులో చేసాడు.అయితే కథే అతనికి కలిసి రాలేదు.
 
లిల్లీ అనే లేడీ క్రికెట‌ర్ పాత్ర‌లో ర‌ష్మిక చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం ఆమె ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. స‌మాజంలో ప్ర‌స్తుతం మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మస్య‌ను ఎదుర్కొన్న బాధితురాలిగా ఆమె నటించింది. విజయ్ తో పోటీ పడి చేసింది. లవ్ సీన్స్ లోనూ, ఎమోషనల్ సీన్స్ లోనూ రష్మిక ఎక్స్ప్రెషన్స్ సహజంగా ఉన్నాయి. ఇక చారుహాస‌న్‌, క్రికెట్ చీఫ్ సెల‌క్ట‌ర్ పాత్ర‌ధారి, సుహాస్ త‌దిత‌రులు పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
 
సాంకేతికంగా… జస్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీతంలో మూడు మెలోడీ సాంగ్స్ … బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.అలాగే సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. కాశ్మీర్ ఎపిసోడ్ తో పాటు కేరళ అందాలతో తెరకెక్కించిన విజువల్స్‌ బాగున్నాయి. ఎడిటర్‌ శ‌్రీజిత్ సారంగ్‌ సినిమాను మరికొంత తగ్గించి ఉండాల్సింది.నిర్మాణ విలువలు బాగున్నాయి -రాజేష్