ముప్పై ఏళ్ళకు ముందే సక్సెస్‌ని సాధించు !

విజయ్ దేవరకొండ… తెలుగు తెరపై వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ అరుదైన ఘనత సాధించాడు.2019 సంవత్సరానికి వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన 30 ఏళ్ల లోపు వారి జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ‘ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ’ పేరుతో ఆరవ జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్ రైజింగ్‌ స్టార్‌​ విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడని తెలిపింది. ముఖ్యంగా 2017లో అర్జున్‌రెడ్డి ద్వారా సంచలనం సృష్టించారని ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది.ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మ్యూజిక్ కేటగిరీలో యాక్టర్‌గా విజయ్ ఈ ఘనత సాధించాడు.

 
వయస్సు 25 అయినా 52 ఏళ్లు అయినా సక్సెస్‌లను అభినందించడంతోపాటు, తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని ఫోర్బ్స్‌ ఇండియా వెల్లడించింది. విజయాలు, కెరీర్‌లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించామనీ, దీనికి సంబంధించిన కథనాన్ని ఫిబ్రవరి 15, ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజీన్‌లో చూడొచ్చని తెలిపింది.
 
16 కేటగిరీల్లో 300 పేర్లను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను రూపొంచింది. మీడియా, క్రీడలు, మార్కెటింగ్‌, పరిశ్రమ, ఎంటర్‌టైన్మెంట్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లోని వారిని ఎంపిక చేసింది. మహిళా క్రికెట్‌ సంచలనం స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వీరితోపాటు యూట్యూబ్ పర్సనాలిటీ ప్రజక్త కోలీ, సింగర్ మేఘన మిశ్రా, ఆయుష్ అగర్వాల్ లాంటివారి పేర్లున్నాయి. ఇంకా పైనాన్స్‌ సంస్థను నడుపుతున్న ఐఐటీయన్లు వసంత్‌ కాంత్‌, అనురాగ్‌ శ్రీవాస్తవ, రోహన్‌గుప్త, ఇంకా నింజా కార్ట్‌ ద్వారా రైతులకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్న కార్తీశ్వరన్‌, శరత్‌ లోగనాథన్‌, అశుతోష్‌ విక్రం తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అప్పుడే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తావు !
ఈ సందర్భంగా తన ఆనందాన్ని విజయ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పిక్‌ని ట్వీట్ చేసిన విజయ్… ‘‘నాకు 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. బ్యాంకు ఖాతాలో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ లేదని అకౌంట్‌ని లాక్ చేశారు. అప్పుడు మా నాన్న “30 సంవత్సరాల కంటే ముందే సక్సెస్‌ని సాధించు.. వయస్సులో ఉన్నప్పడు, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తావు” అని చెప్పారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఫోర్బ్స్‌ సెలబ్రిటీ 100, ఫోర్బ్స్ 30 అండర్ 30’’ అంటూ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు సమర్పణలో కేఎస్‌ వల్లభ నిర్మిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా నాలుగో బ్యూటీగా కేథరిన్‌ కూడా తోడయ్యారు. ప్రస్తుతం కొత్తగూడెంలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సింగరేణి కార్మికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ షెడ్యూల్‌లో కేథరిన్‌ కూడా పాల్గొంటున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది.మరోవైపు సరికొత్త ఫ్యూచర్ ప్లాన్స్‌తో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ఇటీవలే ‘రౌడీ’ పేరిట వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. నిర్మాతగా కూడా అతను ఓ సినిమా చేస్తున్నాడు.