ఓపికను పరీక్షించిన.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2/5

క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ పతాకం పై , కె.ఎస్‌.రామారావు సమర్పణలో.. క‌్రాంతి మాధ‌వ్‌ దర్శకత్వం లో కె.ఎ.వ‌ల్ల‌భ‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
కధ… హైదరాబాద్‌ గల్లీల్లో గూగుల్‌ మ్యాప్‌ కూడా చూపెట్టని ఓ అడ్రస్‌ కోసం తిరుగుతూ అవస్త పడుతున్న యామిని (రాశీ ఖన్నా)కి గౌతమ్‌ (విజయ్‌ దేవరకొండ) తారసపడతాడు. అడ్రస్‌ చూపించడంతో పాటు తన మనుసును కూడా యామినికి గౌతమ్‌ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత యామిని కూడా గౌతమ్‌ ప్రేమలో పడిపోతుంది. చిన్నప్పట్నుంచి రచయిత కావాలనేది గౌతమ్‌ డ్రీమ్‌. అయితే యామిని చెప్పిన ఒకే ఒక్క మాట కోసం గౌతమ్‌ ఉద్యోగం చేస్తాడు. అలా నాలుగేళ్ల ప్రేమ.. ఏడాదిన్నర సహజీవనంతో వారిద్దరి జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో గౌతమ్‌కు యామిని బ్రేకప్‌ చెబుతుంది. ఎందుకు బ్రేకప్‌ చెబుతుంది? అసలు ఈ కథలోకి సువర్ణ(ఐశ్వర్య రాజేశ్‌), స్మిత(క్యాథరీన్‌), ఈజ(ఇజాబెల్లే)లు ఎందుకు ఎంటర్‌ అయ్యారు? గౌతమ్‌ సీనయ్యగా ఎందుకు మారాడు? అసలు గౌతమ్‌ ఎందుకు ప్యారిస్‌ వెళ్లాడు? గౌతమ్‌ చివరికి రైటర్‌ అయ్యాడా? గౌతమ్‌ యామినిలు చివరికి కలుసుకున్నారా? అనేవి తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి…
 
విశ్లేషణ… ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే ..కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించారు.
ఇల్లందు నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే ఎపిసోడ్ వినోదాత్మకంగానూ, అదే సమయంలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతోనూ దర్శకుడు తెరకెక్కించారు. పారిస్ ఎపిసోడ్ తెరపై అందంగా ఆవిష్కరించారు.
 
విజయ్‌ దేవరకొండ నటన ఈ సినిమాకు ఎంతో దన్నుగా నిలిచినా.. కథలో ఆత్మ లోపించటం, సెకండాఫ్ ఎంగేజ్ చేయకపోవటం, ఎంటర్టైన్మెంట్ లేకపోవటం, ఇబ్బంది పెట్టే సాంగ్స్ ఈ సినిమాకు మైనస్. మూడు, నాలుగు కథలను తీసుకుని ఓ కథగా మలచడం ఆసక్తికరంగానే ఉంటుంది.అయితే వాటిని కలిపి సమర్ధవంతంగా నడపడంపైనే వీటి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్‌ కాదు. కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు తన ప్రతిభను తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. సెకండాఫ్‌లో డైరెక్టర్‌ పూర్తిగా తేలిపోయాడు. కథను ఏ కోణంలో రక్తికట్టించలేకపోయాడు. బోరింగ్‌, సాగదీత సీన్లు థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటాయి. కొన్ని ఎమోషన్‌ సీన్లు కట్టిపడేసేలా ఉంటాయి. ప్రి క్లైమాక్స్‌కు ముందు విజయ్‌ ఇచ్చే స్పీచ్‌ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుందనుకున్న సమయంలో… ‘అర్జున్‌రెడ్డి’ క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగిస్తాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగా రొటీన్ గా ఉన్నాయి.
 
నటవర్గం… విజయ్ దేవరకొండ నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపించాడు. రాశీ ఖన్నాతో బ్రేకప్ ఎపిసోడ్ లో అతడి గెటప్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో గెటప్ ను గుర్తు చేస్తుంది. అంతకుముందు కాలేజ్ ఎపిసోడ్ లో యువకుడిగా మెప్పించారు. ఇల్లందు నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ అయితే నటుడిగా విజయ్ దేవరకొండలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. బొగ్గు గని కార్మికుడిగా, పదో తరగతితో చదువు ఆపేసిన యువకుడిగా… గ్రామీణ తెలంగాణ వాతావరణంలో యువకుడిలా కనిపించాడు. పారిస్ ఎపిసోడ్ లో స్టైలిష్ గా ఉన్నాడు.కామెడీ, ఎమోషన్‌, కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని కోణాలను విజయ్‌ తన నటనలో చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ నటన అర్జున్ రెడ్డి ని తలపించడం సినిమాకు మైనస్ అయింది. కథానాయికల్లో ఐశ్వర్య రాజేష్ అందరికంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తుంది.‌ మినిమల్ మేకప్, చీరకట్టులో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశం మనసుల్ని తాకుతుంది .రాశీ ఖన్నా​ అందంతో, నటనతో ఆకట్టుకోగా.. స్మిత మేడమ్ పాత్రలో క్యాథరీన్‌, ఇజాబెల్లే నటనకంటే తమ అందాలతో కుర్రకారును ఆకట్టుకున్నారు. కొన్ని చోట్ల సైదులు(మై విలేజ్‌ షో అనిల్‌) తనదైన రీతిలో నవ్వించగా.. గౌతమ్‌ స్నేహితుడిగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు.జయప్రకాష్ ,శత్రు, ఆనంద చక్రపాణి తమ పాత్రలకు న్యాయం చేశారు.
 
సాంకేతికం…  గోపీసుందర్ సంగీతంలో ‘బొగ్గుగనిలో రంగు మణిరా’ పాట బావుంది. మిగతా పాటలు ఓ మోస్తారుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొన్ని చోట్ల మె​స్మరైజ్‌ చేస్తుంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో, హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. . క్రాంతి మాధవ్‌ అందించిన మాటలు కొన్నిచోట్ల ఆకట్టుకుంటాయి. ఆలోచించే విధంగా ఉంటాయి.అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ… మాటల్లో అంతగా కనిపించలేదు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు – రాజేష్