ప్రేక్షకులను మెప్పించలేని.. ‘మాస్టర్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2/5

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఎక్స్‌బీ ఫిలిం క్రియేటర్స్  గ్జేవియర్‌ బ్రిటో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మహేశ్‌ కోనేరు తెలుగులో విడుదల చేసారు.

కధాంశం… భవాని(విజయ్‌ సేతుపతి) ఓ పేరు మోసిన రౌడీ. తాను ఎలా ఉంటాడో జనాలకు ఎక్కువ తెలియదు కానీ.. తను ఎంతటి క్రూరుడో అందరికీ తెలుసు. లారీలలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ, రాజకీయంగా ఎదగాలని చూస్తాడు. అందులో భాగంగా మొదటగా లారీ యూనియన్‌ అధ్యక్షుడు కావాలని ప్లాన్‌ వేస్తాడు. ఇక జేడీ(విజయ్‌) ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్‌. మద్యానికి బానిసై  తోటి సిబ్బందికి తలనొప్పిగా మారుతాడు. విద్యార్థులకు మాత్రం ఆయనే హీరో. ఆయన కోసం ఏ పని చేయడానికైనా విద్యార్థులు సిద్దంగా ఉంటారు. జేడీ కొన్ని కారణాల వల్ల వరంగల్‌లోని బాల నేరస్థులకు పాఠాలు బోధించాల్సి వస్తుంది. అయిష్టంగానే అక్కడి వెళ్లిన జేడీకి.. అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో జేడీకి భవానికి పరోక్షంగా పోరు మొదలవుతుంది. అసలు బాల నేరస్థులకు, భవానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మద్యానికి బానిసైన జేడీ.. తాగుడు మానేసి, పిల్లలను రక్షించేందుకు ఎందుకు పూనుకున్నాడు? ..అనేది తెలియాలంటే సినిమాలో చూడాలి…

సమీక్ష… విజయ్‌ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు.  ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన లోకేశ్‌ కనకరాజ్ దర్శకత్వంలో విడుదలైన ‘నగరం’, ‘ఖైది’ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో ‘మాస్టర్‌’ సినిమాపై భారీ అంచనాలను ఏర్పడ్డాయి.అయితే ఆ అంచనాలు దర్శకుడు అందుకోలేకపోయాడు. సాధారణంగా లోకేశ్‌ కనకరాజ్‌ బలం.. స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌. ఈ సినిమాలో ఆ రెండు మిస్‌ అయ్యాయి. విజయ్‌ లాంటి మాస్‌ హీరోతో ఓ సందేశాత్మక చిత్రానికి కమర్షియల్‌ మసాలాలు జోడించి చెయ్యాలనుకున్న లోకేశ్‌ తడబడ్డాడు. తొలిభాగం అసలు కథ చెప్పకుండా హీరోని, విలన్‌ని హైలెట్‌ చేయడానికే కేటాయించాడు. విజయ్‍ని రెగ్యులర్‍గా కాకుండా కాస్త కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు. అయితే విజయ్‍ స్టార్‍డమ్‍కి తల వంచేసి, అవసరం లేని బిల్డప్‍ షాట్లు మీద ఎక్కువ  ద్రుష్టి పెట్టి  విషయాన్ని గాలికొదిలేసాడు. విజయ్‍  దర్శకుడికి పూర్తి స్వేఛ్ఛ ఇచ్చి వుంటే బాగుండేది. హీరో, విలన్ల పాత్రలను బలంగా తీర్చిదిద్దినప్పటికీ వారిద్దరు కలిసిన సన్నివేశాలు మాత్రం  పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా వ్యవథి మూడు గంటలుంది. సులభంగా ఓ ముప్పై నిమిషాల కథను ఎడిట్‌ చేసుకుంటే బావుండేది.

నటీ నటులు…కేర్ లెస్ కాలేజీ ప్రొఫెసర్‌గా విజయ్‌ స్టైల్‌, యాక్షన్‌తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో  సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో ఆకట్టుకున్నాడు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ విజయ్ అక్కడక్కడ నవ్వించాడు. విలన్‍గా విజయ్‍ సేతుపతి రాక్షస చర్యలు ఎలివేట్‍ చేస్తూ వివరంగా ఫ్లాష్‍బ్యాక్‍ వుంది. విజయ్‍ సేతుపతి సీన్లలో వున్న బలం వల్ల అతనే ఎక్కువ హైలైట్‍ అయ్యాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల నేర్పు వుండడంతో తన నెగెటివ్‍ పాత్రలో  చక్కని అభినయం ప్రదర్శించాడు. అతని పాత్రకు రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. ఉన్నా లేనట్టుగా వుంటుంది ఇందులో హీరోయిన్‍ వ్యవహారం. చారు పాత్రలో మాళవికా మోహన్‌ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేనప్పటికీ.. తెరపై కనిపించిన విధానం బాగుంది. ఆండ్రియా, అర్జున్‌ దాస్‌, శాంతన్‌ భాగ్యరాజ్‌ వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికం… అనిరుధ్  పాటలు తెలుగు ఆడియన్స్‌ ను పెద్దగా అలరించకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది .హీరో విజయ్‍ను ఎలివేట్ చెయ్యడానికి బాగా ఉపయోగపడింది. యాక్షన్‌ సీన్లు  మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బావుంది. ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటింగ్‌ ఇంకా షార్ప్ గా ఉండాలనిపిస్తుంది – రాజేష్