కాపీ కధతోనే విజయ్ ‘సర్కార్’ : కన్ఫర్మ్ చేశారు !

‘సర్కార్‌’… దీపావళికి బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుందని భావిస్తున్న ‘సర్కార్‌’ విడుదలకు ముందు అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. కాపీ కథ ఉచ్చులో చిక్కుకుని సతమతమవుతోంది. నకిలీ ఓటు చుట్టూ తిరిగే రాజకీయాల నేపథ్యంతో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ‘సర్కార్‌’ కథను దర్శకుడు మురుగదాస్‌ కాపీ కొట్టారంటూ వరుణ్‌ రాజేంద్రన్‌ అనే వ్యక్తి ఆరోపించగా, కథ కాపీ జరిగిన మాట వాస్తవమేనని రచయితల సంఘం తరపున సీనియర్‌ దర్శకుడు, రచయిత కె.భాగ్యరాజా స్పష్టం చేశారు.
2007లో వరుణ్‌ ‘రచయితల సంఘం’లో ‘సెంకోల్‌’ పేరుతో రిజిష్టర్‌ చేసుకున్న కథ, ‘సర్కార్‌’ కథ ఒక్కటేనని చెబుతున్నారు. కానీ, మురుగదాస్‌ మాత్రం తన సొంత కథతోనే ‘సర్కార్‌’ తీశామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీంతో సమస్య క్లిష్టంగా మారింది. కథ కాపీ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన వరుణ్‌… తనకు న్యాయం చేయాలంటూ సోమవారం నిర్మాతల మండలిలోనూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో, నిర్మాతల మండలి ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు తమిళ సినిమారంగం లోనే ఇంతకుముందెన్నడూ విడుదల కాని సంఖ్యలో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేసేందుకు సన్‌పిక్చర్స్‌ సంస్థ సన్నాహాలు చేస్తుండగా.. కొన్నిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిమాణాలతో ‘సర్కార్‌’ చిత్ర బృందం తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ‘సర్కార్‌’కు సంబంధించినంత వరకు పెద్ద తలకాయలతో వ్యవహారమని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిదని పలువురు వరుణ్‌కు, కె.భాగ్యరాజాకు సూచించినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ..‘సర్కార్‌’ కాపీ కథ వాస్తవం అనే తేలింది.
అయితే, ఈ విషయంపై ముందుగా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పిన దర్శకుడు తరువాత మాట మార్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సర్కార్‌ కథ వరుణ్‌ రాజేంద్రన్‌దే అని అంగీకరించటంతో పాటు 30 లక్షల పారితోషికం, సినిమా టైటిల్స్‌లో వరుణ్‌కు క్రెడిట్‌ ఇచ్చేందుకు మురుగదాస్ అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.