షిర్డి సాయిబాబా భక్తుల అనుభవాలు !

విజయచందర్‌ సాయిబాబాగా మరోసారి  నటిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిల్మ్స్‌ సారథ్యంలో జి.ఎల్‌.బి మూవీ మేకర్స్‌ పతాకపై శ్రీనివాస్‌ జి.ఎల్‌.బి స్వీయ దర్శకత్వంలో పోనుగోటి భవాని అర్జున్‌రావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘భగవాన్‌ షిర్డి సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాబా ఆలయాల్లో చిత్రీకరణ జరిపాం. ఇప్పటికే తొలి కాపీ రెడీ అయ్యింది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందింది. సాయిబాబా సమాధి చెంది నూరు సంవత్సరాలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని బాబా భక్తులకు కానుకగా త్వరలో విడుదల చేయబోతున్నాం’ అని అన్నారు.

‘సినిమాలో ఐదు పాటలు, మూడు శ్లోకాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది’ అని నిర్మాత పొనుగోటి భవాని అర్జున్‌రావు తెలిపారు. సుమన్‌, చంద్రమోహన్‌, కోట శ్రీనివాసరావు, రావు రమేష్‌, సాయిప్రకాష్‌, ఎల్‌.బి.శ్రీరామ్‌, ధన్‌రాజ్‌, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుదీప తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: పోలూర్‌ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి.