మన హీరోలు కూడా అలా ముందుకు రావాలి!

సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు, దర్శకుల పారితోషికాలు చుక్కల్లోవుంటాయి. సినిమా సినిమాకు పారితోషికాన్ని పెంచుతూ మన కథానాయకులు పారితోషికాల విషయంలో పోటీలు పడుతూ వుంటారు. స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్‌ సినిమా తీసినా.. నిర్మాతకు లాభాలు వుండటం లేదంటే దానికి కారణం హీరో, దర్శకుల పారితోషికాలే.. అయితే, ఇటీవల కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న సినీ పరిశ్రమ కోలుకోవాలంటే చిత్ర నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలనే డిమాండ్‌‌ నిర్మాతల నుంచి పెరుగుతోంది. దీంతో కొందరు నటీనటులు, దర్శకులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ముందుకొస్తున్నారు.
 
వంద కోట్ల పారితోషికం తీసుకునే తమిళ హీరో విజయ్‌ తన పారితోషికంలో ముప్పై శాతం తగ్గించుకున్నాడు. రాబోయే రెండు సంవత్సరాల వరకు నటించబోయే సినిమాలకు ఇలాగే పారితోషికాన్ని అందుకోబోతున్నాడు. విజయ్‌తో పాటు మరికొంత మంది తమిళ హీరోలు కూడా రెమ్యూనరేషన్‌కు తగ్గించుకోవడానికి సిద్దమయ్యారు.
 
నిర్మాతకు అజిత్ హామీ !
అజిత్‌ ప్రస్తుతం ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. దివంగత శ్రీదేవి భర్త, బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకున్న చిత్రం షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయింది.లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ‘వలిమై’ చిత్ర షూటింగ్‌ మొదలవుతుందని బోనికపూర్ స్పష్టం చేశారు.
 
లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో అజిత్‌ కూడా తన పారితోషికం తగ్గించే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం. అజిత్‌ ఈ విషయమై చిత్ర నిర్మాత బోనీకపూర్‌ ఒక మెయిల్‌ను పంపినట్లు తెలిసింది. అందులో చిత్ర విడుదల ఎప్పుడన్నది నిర్ణయించిన తరువాత అప్పటి పరిస్థితులను బట్టి పారితోషికం తగ్గించే విషయమై చర్చిద్దామని చెప్పినట్టు సమాచారం. కాగా నటుడు అజిత్‌ ప్రస్తుతం ఉన్న స్థాయిలో తన పారితోషికాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని..అయినా ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకునే విషయమై నిర్మాతకు భరోసా ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్తున్నాయి. అజిత్‌ తీసుకున్న నిర్ణయం ప్రముఖ నటుల్లో పెద్ద చర్చకే దారితీసింది..అయితే ఇప్పటి వరకు మన తెలుగు కథానాయకుల నుండి ఇలాంటి ప్రకటన వెలువడలేదు. తెలుగు హీరోలు కూడా ఇదే బాటలో నడిస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుంది.