నాకు తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు!

విజయశాంతి… లేడీ అమితాబ్‌, లేడీ సూపర్‌ స్టార్‌, రాములమ్మగా ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న నటి. ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం ‘కిలాడి కృష్ణుడు’ విడుదలై సెప్టెంబర్‌ 12కి  40 సంవత్సరాలు. ఈ సందర్భంగా విజయశాంతి ఇన్ని సంవత్సరాల పాటు తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. తనని తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయనిర్మలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘కిలాడి కృష్ణుడు’ చిత్రంలో తెలుగులో మొదలైన విజయశాంతి ప్రస్థానం..ఆ తర్వాత  ఏ విధంగా మలుపు తిరిగిందో అందరికీ తెలిసిందే. హీరోయిన్‌గా మొదలై.. ‘మగరాయుడు’గా మారి తన క్యారెక్టర్‌ పేరు మీదే సినిమాలు రూపొందించే స్థాయిని ఆమె సొంతం చేసుకుంది. ఈ 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆమె ఎన్నో సక్సెస్‌లు.. అవార్డులు అందుకున్నారు. రాజకీయాలంటూ కొంతకాలం పాటు సినిమాకి దూరమైనప్పటికీ.. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇచ్చి.. మరోసారి తన నటనతో అందరినీ మెప్పించడమే కాకుండా.. ఆ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించారు. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో నటిగా సమున్నతమైన స్థానం తనకి దక్కినందుకు ఆనందిస్తూ.. ఆ స్థానం కల్పించిన కళామతల్లికి అలాగే ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటూ… రాములమ్మ ఉద్వేగానికి లోనయ్యారు.

“నా మొదటి తెలుగు సినిమా ‘కిలాడి కృష్ణుడు’ విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి.. అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు నాకు అందించారు. నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలు…” అని తెలుపుతూ ‘కిలాడి కృష్ణుడు’ చిత్ర పోస్టర్‌ని విజయశాంతి పోస్ట్ చేశారు.