విజయ్ టార్గెట్.. ‘మల్టీ లాంగ్వేజ్‌ స్టార్’ !

‘అర్జున్‌రెడ్డి’తో  స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’తో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడం మార్కెట్ పరంగా ప్లస్ అయ్యేలా ఉంది. అయితే ఇలా ఒకేసారి నాలుగైదు భాషల్లో విడుదల చేయడం పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఈ విధంగా చేయలేదు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు అంతటివాడే ఒక్క ‘స్పైడర్’ తప్ప ఏ సినిమాను సమాంతరంగా విడుదల చేయలేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తమిళ్ మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు.
 
గతంలో ‘నోటా’ ఫలితం నిరాశపరిచినప్పటికీ ఈసారి మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ స్టార్. అయితే కోలీవుడ్‌లో ఇప్పటిదాకా భారీ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు స్టార్ ఎవరూ లేరు. కోలీవుడ్ ప్రేక్షకులకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. తమిళనాడులో పక్క రాష్ట్రాల హీరోలను ఆదరించిన ఉదంతాలు లేవు. కేరళలో సైతం అనూహ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. మరి విజయ్ దేవరకొండ అన్ని సినిమాలను ఇలా మల్టీ లాంగ్వేజ్‌లోకి తీసుకెళ్లడం వరుస సక్సెస్‌లు దక్కినప్పుడే కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుంది. అయితే ‘డియర్ కామ్రేడ్’ ఫలితం విజయ్ దేవరకొండ మల్టీ లాంగ్వేజ్ వ్యూహానికి ఒక దిక్సూచిలా మారనుంది. ఈ సినిమా సక్సెస్ అయితే అతని అన్ని చిత్రాలు అదే వరుసలో వెళ్తాయి. లేదంటే ఇకపై వచ్చే వాటి మీద పునరాలోచన జరుగవచ్చు. అయితే విజయ్ దేవరకొండ అంత సులభంగా వదిలేలా లేడు. తమిళ్ దర్శకుడితో ‘హీరో’ సినిమాను లైన్‌లో పెట్టడాన్నే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
రూల్స్ మనం తప్పకుండా పాటించాలి !
విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యువత చూపును తనవైపునకు తిప్పుకున్న ఈ హీరో ఆ తర్వాత ‘గీత గోవిందం, టాక్సీవాలా’ సినిమాలతో యువత గుండెల్లో స్థానం సంపాదించాడు. అయితే యూత్‌లో తనకున్న క్రేజ్‌ని క్యాచ్ చేసుకుంటూ ‘రౌడీ’ పేరుతో వస్త్ర బ్రాండ్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చాడు. ఈ బ్రాండ్ కూడా యువ మనసులను దోచుకుంది. దీంతో విజయ్‌పై తమ అభిమానాన్ని చాటుకునేలా కొందరు రౌడీ అనే పేరును తమ తమ వాహనాలపై ముద్రించుకుంటున్నారు. ఇంకొందరైతే మరీ మితిమీరి రౌడీ సింబల్‌ని తమ వాహన నంబర్ ప్లేట్స్‌పై వేసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు రౌడీ నంబర్ ప్లేట్ ఉన్న ఓ వాహనాన్ని పట్టుకొని జరిమానా విధించారు. అంతటితో ఆగక.. యువత నంబర్ ప్లేట్లపై ఇలా రౌడీ అనే ముద్రలు వేసుకుంటున్నారని, ఇది చట్ట విరుద్ధం అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
అయితే ఈ పోస్ట్ చూసిన విజయ్ దేవరకొండ.. ఆ యువకుల తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని పేర్కొంటూ రిప్లై ఇచ్చాడు. ఈ మేరకు ‘‘మీరంతా నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. మీరు కష్టాల్లో ఇరుక్కుపోకండి. కొన్ని రూల్స్ మనం తప్పకుండా పాటించాలి. అవన్నీ మన మంచి కోసం పెట్టినవే. మీ ప్రేమను ఎలాగైనా చూపించండి కానీ నంబర్ ప్లేట్స్‌పై మాత్రం వాహన నంబర్‌నే ఉంచండి’’ అని పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ.