విక్రమ్ 300 కోట్ల ‘కర్ణ’ కి షారుఖ్ నిర్మాత ?

విక్రమ్ ‘మహావీర్ కర్ణ’… దక్షిణాది చిత్రాలలో భాగస్వామ్యమయ్యేందుకు ఉత్తరాదికి చెందిన బడా బడా నిర్మాతలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం సౌత్ సినిమాల బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది.  ‘బాహుబలి’ సిరీస్‌తో భారీ విజయాన్నందుకున్న కరణ్ జోహార్.. ఇటీవల ‘2.0’ని కూడా రిలీజ్ చేసి సక్సెస్ సాధించాడు. ఇక ‘2.0’ తర్వాత దక్షిణాది నుంచి రాబోతున్న మరో పెద్ద సినిమా ‘కెజిఎఫ్’ను.. బాలీవుడ్ దర్శక-హీరో ఫర్హాన్ అక్తర్.. హిందీలో విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా విక్రమ్ నటించబోతున్న పౌరాణిక గాథ ‘మహావీర్ కర్ణ’లో భాగస్వామ్యమయ్యేందుకు కింగ్ ఖాన్ షారుఖ్ ముందుకొచ్చాడట. విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే విక్రమ్ కర్ణుడి పాత్ర హైలైట్‌గా తెరకెక్కబోయే ఈ భారీ బడ్జెట్ సినిమాకి తన ‘రెడ్ ఛిల్లీస్’ వి.ఎఫ్.ఎక్స్ విభాగం ద్వారా టెక్నికల్ సపోర్ట్ అందించబోతున్నాడట. అంతేకాదు హిందీలో ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడట షారుఖ్ ఖాన్.
కర్ణుడు ప్రధాన పాత్రధారిగా ‘మహావీర్ కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మలయాళీ దర్శకుడు ఆర్.ఎస్.విమల్. మలయాళంలో ‘ఎన్ను నింటే మొహిదీన్’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్.. తన రెండో చిత్రంగా ఈ మైథలాజికల్ మూవీని రూపొందిస్తున్నాడు. న్యూయార్క్ బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ యునైటెడ్ కింగ్ డమ్ నిర్మాణంలో రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రారంభోత్సవాన్ని జరుపుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందట. 2020 ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శక-నిర్మాతలు.