నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా !

ప్రముఖ స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, కమల్ హసన్‌ రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది.తమిళనాట సినిమాలు రాజకీయాల చుట్టూ తిరడగం, రాజకీయాలు సినిమా వాళ్ల చుట్టూ తిరగడం పరిపాటే.  ఈ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్‌ “నేనూ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా” అంటున్నారు. ఇప్పటికే గట్టి పోటీ మధ్య దక్షిణభారత నటినటుల సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ గెలిచి సంచలనం సృష్టించారు మన తెలుగు వాడైన విశాల్‌.​

తన అభిమాన సంఘం అయిన ‘దేవీ ట్రస్ట్‌’ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విశాల్‌ హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం ‘తుప్పరివాలన్‌’ గురువారం విడుదలయ్యింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈయన పత్రికలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాల్‌ సేవా కార్యక్రమాలను ప్రస్థావిస్తూ…రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ…. ‘ ఈ విషయంలో దాపరికాలు నాకు ఇష్టం లేదు. అధికారం ఉంటే ప్రజలకు మంచి చేయవచ్చు. మంచి చేయడమే రాజకీయం అయితే, నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా’ నని ఆయన దృఢంగా అన్నారు.

ఈ కాలంలో కూడా చదువుకునే పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. వాళ్లకు సరైన వసతులు కల్పిస్తే పోయేదేముందని ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వ్యాఖ్యానించారు. ఒక పక్క ఆర్థిక లోటు అంటూనే ఎమ్మెల్యే జీతాలు మాత్రం పలు రెట్లు పెంచుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేశారనీ, తమిళనాడులో రైతులు  ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆందోళన బాట పట్టినా రుణమాఫికి నిరాకరిస్తోందని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఉచిత​ విద్య, వైద్యాన్ని అందించాలని విశాల్‌ పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం నిర్ణయం !

తమ సమస్యలను పరిష్కరించాలంటూ తమిళనాడుకి చెందిన రైతులు గత కొద్ది కాలంగా ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. నిరసనలో భాగంగా మలాన్ని సైతం తిన్న రైతుల దయనీయ స్థితి అందరినీ కలచివేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ రైతుల సంక్షేమం కోసం కథానాయకుడు విశాల్‌ తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. విశాల్‌ హీరోగా నటించిన ‘తుప్పరివాలన్‌’ చిత్రం గురువారం విడుదలైంది. మిస్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. డిటెక్టివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్‌, ఆండ్రియా కథానాయికలుగా నటించారు. గురువారం విడుదలైన ఈ చిత్రానికి అమ్ముడయ్యే ప్రతి టికెట్టులో ఒక రూపాయిని కష్టాల్లో ఉన్న రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు విశాల్‌ ప్రకటించారు. దీంతోపాటు ప్రస్తుతం తమిళ నడిఘర్‌ సంఘం అధ్యక్షులుగా ఉన్న విశాల్‌ ఆర్టిస్టుల సంక్షేమం కోసం కూడా పలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకీ వెళ్ళనున్నట్టు ఇటీవల విశాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక హీరోగా ప్రస్తుతం ‘విలన్‌’, ‘ఇరుంబు థిరై’, ‘కరుపు రాజ వెల్లై రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.