నటుడు విశాల్ సోమవారం తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్ సెంటర్‌కు వెళ్లిన అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. తెలుగు కుర్రాడు అయినా అటు తమిళనాట విశేషాభిమానులను చూరగొన్న నటుడు విశాల్ ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా సైలెంట్ ఎంట్రీ ఇస్తుండటం సందడి రేపుతోంది. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో ఇండిపెండెంట్‌గా ఆయన బరిలోకి దిగారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీ ఎంకే అమ్మ పార్టీ తరపున), బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళనాట క్రేజ్ సంపాదించుకున్న ‘మాస్ హీరో’ విశాల్ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఆయన రాజకీయ లక్ష్యాలేమిటి? పదవులే లక్ష్యమా? ప్రజానేతగా నిలవానికి కోరుకుంటున్నారా? ఫుల్ టైమ్ నేతా? పార్ట్‌టైమ్ నేతగా ఉండబోతున్నారా? రాజకీయాల్లోకి రావడం వెనుక ఆయనకు స్ఫూర్తిగా నిలిచినవారు ఎవరైనా ఉన్నారా? ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో విశాల్ తన మనోగతాన్ని వెల్లడించారు….
ప్రజల వాణి వినిపించాలని…
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తనకు స్ఫూర్తి అని విశాల్ తెలిపారు. ‘ఆ ఇద్దరూ నాకు స్ఫూర్తి. నిజానికి అరవింద్ కేజ్రీవాల్‌ను నేనెప్పుడూ కలుసుకోలేదు. అయితే ఆయన ప్రజానేత. నేను రాజకీయవేత్త కావాలనుకోవడం లేదు. ఓ సాధారణ వ్యక్తిగానే ఉండాలనుకుంటున్నాను’ అని చెప్పారు. తనకు పెద్ద రాజకీయ ఆకాంక్షలేవీ లేనప్పటికీ ప్రజా నేతగా అందరి మనస్సులోనూ నిలిచిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘ఆర్కే నగర్ ప్రజల వాణి వినిపించాలని అనుకుంటున్నాను. ప్రజా ప్రతినిధి కావాలనుకుంటున్నాను. నేను పూర్తి స్థాయి రాజకీయవేత్త కావాలనుకోవడం లేదు. అలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలేవీ లేవు. ఎన్నికల్లో పోటీ చేయగలననే దమ్ముతోనే బరిలోకి దిగుతున్నాను’ అని ఆయన చెప్పారు.
సమస్యలను తక్షణం పరిష్కరించాలి !
‘ప్రజలు చాలాకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఊదాహరణకు ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రతాలోపం, ప్రభుత్వాసుపత్రిలో నాసిరకం వైద్యం, ప్రజలకు పెన్షన్లు అందకపోవడం, రేషన్ దుకాణాల సమస్యలు వంటివి ఉన్నాయి. నిజానికి ఇవి ఆర్కే నగర్‌లో మాత్రమే ఉన్న సమస్యలు కావు. ఈ సమస్యలను మనం తక్షణం పరిష్కరించాలి. ఎన్నికల ఫలితాల వరకూ ఆగకూడదు’ అని విశాల్ అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించగానే సినీ పరిశ్రమ నుంచి కూడా ఆనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. ‘నేను ఎవరినీ కలుసుకోవడం లేదు. భావసారూప్యత కలిగిన వ్యక్తులు నాకు మద్దతిస్తే స్వాగతిస్తాను. కుష్బూ, ప్రకాష్ రాజ్, ఆర్య ఇప్పటికే తమ మద్దతు ప్రకటించారు. చాలామంది నుంచి అభినందనలు వస్తున్నాయి’ అని విశాల్ వెల్లడించారు. కమల్‌హాసన్ నుంచి అభినందనలు వచ్చాయా అని అడిగినప్పుడు ‘కమల్ సార్ నుంచి ఇంతవరకూ ఫోను రాలేదు. నామినేషన్ వేసిన తర్వాత నేనే ఆయనకు ఫోన్ చేస్తా’ అని విశాల్ నవ్వుతూ చెప్పారు.