అటువంటి వాటిని నా ముందుకు తీసుకురావద్దు !

కధానాయిక ప్రధానం గా సాగే చిత్రాలు ఈ మధ్య అంతగా రావడం లేదు. కేవలం దెయ్యాల సినిమాల్లో మాత్రం ఆడ దెయ్యాలే కనిపిస్తున్నాయి . పద్దతిగా తీసిన కొన్నిచిత్రాలు వచ్చినా, అవి ప్రేక్షకాదరణ పొందడం లేదు. చక్కటి కుటుంబచిత్రంగా ఇటీవల వచ్చిన ‘ఫిదా’ చిత్రం మాత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసులవర్షం కురిపిస్తోంది. అందులో సినిమా అంతా తానై నడిపించిన సాయి పల్లవి నటనకు  ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. దీంతో పారితోషికం కూడా పెంచేసిందని ప్రచారం జరుగుతోంది.  ప్రస్తుతం ఈ అమ్మాయి నాని హీరో గా రూపొందుతోన్న ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి(ఎంసీఏ)’లో చేస్తోంది.

ఆమె ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఎక్కడా అభ్యంతరకరమైన పాత్రలు కానీ, మాటలు కానీ కనిపించవు.కేవలం నటనకే ప్రాధాన్యం. ఈ అమ్మాయి ఇప్పుడో షరతు కూడా విధించింది. గ్లామర్‌ షో క్యారెక్టర్స్‌ చేయనని …అంతకంటే ముఖ్యంగా ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు తాను పూర్తిగా వ్యతిరేకినని పేర్కొంది. అటువంటివి కథలో ఉంటే వాటిని తన ముందుకు తీసుకురావద్దని స్పష్టం చేసింది. ‘ఏదో నాకు ఇష్టమైన డాన్స్‌ వల్ల సినిమాల్లో చేస్తున్నాను. డాక్టర్‌ కావాలన్న నా కలను నెరవేర్చుకోవాలని నా తల్లిదండ్రులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అది ఒత్తిడి కాదు.. నా బాధ్యతను గుర్తు చేస్తున్నట్టు. కాబట్టి నేను దాన్ని చేయాలి. అందుకే దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ఏదో సరదాగా సినిమాలు చేస్తున్నాను’ అని చెప్పింది సాయి పల్లవి.