అంచనాలను మించిన అనుభూతి…కేజీఎఫ్‌-2 చిత్రసమీక్ష

సినీ వినోదం రేటింగ్ : 3/5

హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థ  ప్రశాంత్ నీల్ రచన, దర్శకత్వం లో విజయ్ కిరగందూర్ (తెలుగులో సాయి కొర్రపాటి) ఈ చిత్రాన్ని నిర్మించారు.

కన్నడ సినిమా స్టామినాను దేశ వ్యాప్తంగా చూపించిన చిత్రం ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’. ఈ సినిమాతో దర్శకహీరోలు ప్రశాంత్‌నీల్‌, యష్‌ తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఆవిష్కరిస్తూ కొలార్‌ బంగారు గనుల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌ మూవీగా ‘కేజీఎఫ్‌’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ ‘కేజీఎఫ్‌-2’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూశారు.

కధ… మొదటి పార్ట్‌ కథ ఎక్కడ ముగిసిందో రెండో పార్ట్‌ అక్కడే మొదలవుతుంది. తొలి భాగం తాలూకు కథ జర్నలిస్ట్‌ ఆనంద్‌ వాసిరాజు (అనంత్‌నాగ్‌) నరేషన్‌లో నడుస్తుంది. రెండో భాగాన్ని ఆయన కొడుకు విజయేంద్ర వాసిరాజు (ప్రకాష్‌రాజు) చెబుతుంటాడు… గరుడను అంతమొందించి తొలిభాగంలో నరాచి గోల్డ్‌ మైన్స్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు రాఖీభాయ్‌ (యష్‌). అక్కడ బానిసలుగా బతుకున్న కూలీల బతుకుల్లో వెలుగులు నింపుతాడు. ఇక ‘కేజీఎఫ్‌-2’కథలోకి వెళితే… నరాచిని హస్తగతం చేసుకున్న రాఖీభాయ్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. అక్కడ పనిచేసే వారికి ఆయుధ శిక్షణ ఇప్పిస్తూ  సైన్యంగా తయారుచేస్తు.. వారి అవసరాల్ని తీర్చుతూ ఓ దేవుడిలా మారతాడు. ఆ తరుణంలో చనిపోయాడని భావిస్తున్న అధీరా (సంజయ్‌దత్‌) తెరమీదికొస్తాడు. దీంతో రాఖీభాయ్‌-అధీరా మధ్య పోరు ఆరంభమవుతుంది. ముంబయి మాఫియాడాన్‌ శెట్టి కూడా రాఖీభాయ్‌ అడ్డు తొలగించుకోవాలను కుంటాడు. అధీరా ఎలా బ్రతికొచ్చాడు?  గోల్డ్‌ మైనింగ్‌ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న రాఖీభాయ్‌ని కట్టడి చేయడానికి ప్రధాన మంత్రి రమికాసేన్‌ (రవీనా టాండన్‌) ఎలాంటి చర్యలు తీసుకుంది? దుబాయ్‌లో ఉన్న ఇయాయత్‌ ఖలీ తో సహా వీరందరినీ రాఖీభాయ్‌ ఎలా ఎదుర్కొన్నాడనేది ? సినిమాలో చూడాలి …

విశ్లేషణ… ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’తో పోలిస్తే చాప్టర్ 2కు రెండింతల అధికంగా ఎలివేషన్, యాక్షన్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ జోడించారు. సినిమా ప్రారంభం నుంచి గుర్రంలా పరుగుతీస్తుంది. నేపథ్య సంగీతం మోత మోగిపోతుంది. రాఖీభాయ్ పాత్రను మొదటి భాగం కన్నా పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేయగలిగాడు. ఆసక్తికరమైన కథనంతో సన్నివేశాలతో ఉత్సాహ పరిచాడు. హీరోకన్నా విలన్‌ను పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ఇద్దరి మధ్య యుద్ధాన్ని ఆసక్తికరంగా మలిచాడు. దాంతో సినిమా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ప్రత్యర్ధుల ఎత్తులకు‌ పై ఎత్తులు వేస్తూ హీరో చేసే సన్నివేశాలు  ప్రేక్షకులను  విపరీతంగా ఆకట్టుకుంటాయి .అయితే, చాప్టర్ 1లో మాదిరిగా కథ, కథనంపై దర్శకుడు దృష్టిపెట్టలేదేమో అనిపిస్తుంది. మొదటి భాగం స్థాయిలోని ఎమోషన్స్ రెండో పార్ట్ లో మిస్సయ్యాయి. అలాగే.. కాన్ఫ్లిక్ట్ కూడా మొదటి భాగం స్థాయిలో లేదని చెప్పుకోవాలి. ద్వితీయార్థంలో కథా గమనం కాస్త పట్టుతప్పింది. ముఖ్యంగా పోరాట ఘట్టాల్ని పునరావృతం చేశారనే భావన కలుగుతుంది. అదే సమయంలో రాఖీ-అధీరా మధ్య పోరాటం కూడా అంతగా ఆకట్టుకోదు. ప్రీ ైక్లెమాక్స్‌ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి రమికాసేన్‌తో రాఖీ భాయ్‌ తలపడటం ఉత్కంఠను పంచుతుంది.కానీ, కొన్ని సన్నివేశాలు  కన్విన్సింగ్‌గా అనిపించవు. పార్లమెంట్‌ భవనంలోకి వెళ్లి ప్రధానమంత్రిని హెచ్చరించడం వంటివి  ఏమాత్రం లాజిక్‌కు అందవు. పతాకఘట్టాల్ని తల్లి సెంటిమెంట్‌తో జడ్జ్‌ చేసి చూపించడం.. ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య తొలిభాగంలో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. ద్వితీయార్థంలో మాత్రం ఇద్దరి మధ్య బంధాన్ని చక్కగా ఆవిష్కరించారు. క్లెమాక్స్‌ ఎపిసోడ్‌ హైలైట్‌.

నటవర్గం…   రాఖీ భాయ్ గా యశ్ రెండో భాగంలోనూ గొప్పగా పాత్రను పోషించాడు. రాకీ భాయ్ వాకింగ్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఎలివేషన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కథానాయికగా శ్రీనిధి శెట్టి పర్వాలేదనిపిస్తుంది. సంజయ్ దత్‌ చేసిన అధీర పాత్రపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. కానీ, అధీర పాత్ర మాత్రం ఆ స్థాయిలో లేదు. అధీర వేషధారణలో ఉన్న క్రూరత్వం, గాఢత్వం.. పాత్రలో కనిపించలేదు. ఇక దేశ ప్రధానమంత్రి రమికా సేన్‌గా రవీనా టాండన్ చాలా బాగా సెట్ అయ్యారు. ఆమె ముఖంలో గాంభీర్యం, ఆహార్యంలో హుందాతనం రమికా సేన్ పాత్రను బాగా ఎలివేట్ చేశాయి. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, అయ్యప్ప పీ శర్మ, ఈశ్వరీరావు, అచ్యుత్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

భువన్ గౌడ సినిమాటోగ్రఫీ సినిమా ప్రధాన బలాలలో  ఒకటి. కేజీఎఫ్‌ గోల్డ్‌మైన్స్‌లోని విజువల్స్‌ కట్టిపడేస్తాయి. రవి బస్రూర్ నేపథ్య సంగీతం మరో ప్రధాన బలం. ముఖ్యంగా అద్భుతమైన బ్యా్క్ గ్రౌండ్ స్కోర్ తో చిత్రానికి ప్రాణం పోశారు. ఉజ్వల్‌ ఎడిటింగ్‌ బాగుంది. హోంబలే పిక్చర్స్ నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. మొత్తం మీద ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్స్ నుంచి బైటికి వెళతారు. ఈ సినిమాకి మూడో పార్ట్ ఉన్నట్టు చూపించడం కొసమెరుపు – రాజేష్